నాడు గల్లీలోని అనామకుడు.. నేడు గల్ఫ్‌లో నాయకుడు

ABN , First Publish Date - 2020-02-16T22:30:02+05:30 IST

ఒక సాధారణ పల్లెటూరి యువకుడు దుబాయిలో నవాబులా ఖరీదైన రోల్స్‌రాయిస్‌ కారులో తిరగగలడా? బతుకుదెరువు కోసం నానా అగచాట్లు పడినవాడు.. ఒక కంపెనీకి యజమాని కాగలడా? గల్లీలోని అనామకుడు.. గల్ఫ్‌లో నాయకుడు.. కాగలడా? సొంతూరు కరీంనగర్‌ జిల్లా (ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా)లోని వేములవాడ నుంచి... దుబాయి విమానం..

నాడు గల్లీలోని అనామకుడు.. నేడు గల్ఫ్‌లో నాయకుడు

ఒక సాధారణ పల్లెటూరి యువకుడు దుబాయిలో నవాబులా ఖరీదైన రోల్స్‌రాయిస్‌ కారులో తిరగగలడా? బతుకుదెరువు కోసం నానా అగచాట్లు పడినవాడు.. ఒక కంపెనీకి యజమాని కాగలడా? గల్లీలోని అనామకుడు.. గల్ఫ్‌లో నాయకుడు.. కాగలడా? సొంతూరు కరీంనగర్‌ జిల్లా (ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా)లోని వేములవాడ నుంచి... దుబాయి విమానం ఎక్కే వరకు తోట రామ్‌ కుమార్‌కు గమ్యం తెలీదు. వెళ్లేప్పుడు లగేజీలో బీటెక్కులు, ఎమ్మెస్‌లు లేవు. ఒకసారి తప్పి, మళ్లీ గట్టెక్కిన పదో తరగతి సర్టిఫికెట్టు మాత్రమే ఉంది. అలా మొదలైన ప్రయాణం.. ఎన్నో మలుపులు తిరిగింది. రూ.680 కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేతను చేసింది..


1980 ప్రాంతం. కరీంనగర్‌ జిల్లా.. కరువు.. నిరుద్యోగం.. అటు పోలీసులు.. ఇటు అన్నలు.. బతకాలంటే బట్టలు సర్దుకుని బయటికి వెళ్లిపోవాల్సిందే! పని దొరికితే ఉప్పో కారమో తిని ఊపిరిపీల్చుకోవచ్చు. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో.. ఎడారి దేశం ఊరించింది. రెండు జతల బట్టలు, టెన్తు సర్టిఫికెట్టు పట్టుకుని గల్ఫ్‌ బాట పట్టారు తెలంగాణ గ్రామీణ యువకులు. వారిలో ఒకడు.. వేములవాడ పిలగాడు. ఊరోళ్లకు ‘రాము’. స్కూలోళ్లకు ‘తోట రామ్‌కుమార్‌’. గల్ఫ్‌ దేశానికి ఫ్లయిట్‌ ఎక్కాడు కానీ.. తన బతుకు ఎక్కడ ల్యాండ్‌ అవుతుందో, ఎలా ఉంటుందో తనకే స్పష్టతలేని పరిస్థితి. పాజిటివ్‌గా ఉంటే ప్రకృతి కూడా సహకరిస్తుందన్న నమ్మకమే ముందుకు నడిపించింది. 


కరీంనగర్‌ జిల్లా వేములవాడలోని ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు రామ్‌కుమార్‌. తల్లిదండ్రులు తోట నారాయణ, నర్సమ్మ. వ్యవసాయ కుటుంబం. ‘చూడు బిడ్డా... బతుకుడు అంటే.. నువ్వొక్కనివే తినుడు కాదు. నువ్వు బాగా బతకాలె, మరో పదిమందినీ బతికించాలె. అదీ బతుకంటే!’ దుబాయి వెళుతున్న కొడుక్కి మంచిచెడ్డలు చెప్పాడు తండ్రి. అలా.. 1989లో దుబాయికి చేరుకున్నాడు రాము. ఓ కంపెనీలో అకౌంట్స్‌ అసిస్టెంట్‌గా చేరాడు. రోజులు గడుస్తున్నాయి కానీ.. ఎదుగూబొదుగూ లేదు. ‘నువ్వు పాసైంది పదో తరగతే భయ్యా. ఇంతకంటే మంచి ఉద్యోగం ఏమొస్తుంది?’ అన్నారు దోస్తులు. అవును, నిజమే! పదికే పరిమితమైతే ప్రయోజనం లేదు. పైచదువులు చదవాలన్న కసిని రగిలించాయా మాటలు. దుబాయిలోనే ఇంటర్‌ పూర్తి చేశాడు. కొన్నాళ్లకు అదీ అర్థమైంది. పైకి రావాలంటే ఈ చదువు సరిపోదని. అకౌంటింగ్‌, ఫైనాన్స్‌, మార్కెటింగ్‌ నైపుణ్యాలు అవసరం. అక్కడే చార్టర్డ్‌ అకౌంటెన్సీ చదివాడు. ఒకవైపు సీఏ పరీక్షలకు సిద్ధం అవుతూనే... సేల్స్‌ మేనేజర్‌గా పనిచేసేవాడు. ఆ తరువాత అదానీ గ్రూప్‌లో సేల్స్‌ డైరెక్టర్‌గా పెద్ద కొలువే వరించింది. 


అదానీ గ్రూప్‌లో ఉద్యోగం రాము జీవితాన్ని మలుపు తిప్పింది. అక్కడ పెట్రో కెమికల్‌ విభాగం అధిపతి యోగేష్‌ మెహతా ప్రోత్సాహం మరువలేనిది. కార్పొరేట్‌ పాలనా వ్యవహారాల్లోని లోతుపాతుల్ని తెలుసుకునే అవకాశం కలిగింది. ‘నా కళ్ల ముందు ఒక కొత్త ప్రపంచం ఆవిష్కృతం అయ్యింది. మెహతా అనుభవం నాకెన్నో పాఠాలను నేర్పింది. ఆయనతో పోల్చుకుంటే, పదిశాతం కష్టపడినా పైకి రావొచ్చని అనిపించింది. నాకు నేనే ఒక కొత్త లక్ష్యాన్ని ఏర్పరచుకునేలా చేసింది’ అంటాడు రాము. అదానీ గ్రూప్‌లో పనిచేస్తున్నప్పుడు.. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని పలు కంపెనీల సేల్స్‌ డైరెక్టర్లతో పరిచయం కలిగింది. నెట్‌వర్క్‌ను విస్తరించుకున్నాడు. వివిధ కంపెనీల సేల్స్‌ డైరెక్టర్ల గ్రూప్‌లో చేరాడు. అక్కడ అంతర్జాతీయ వాణిజ్య అంశాల గురించి చర్చలు జరిగేవి. కొత్త పరిణామాలపై విశ్లేషించు కునేవారు. దీంతో ప్రణాళికలు కొత్త రూపు తీసుకునేవి. సరిగ్గా అప్పుడే దుబాయిలో నిర్మాణరంగం ఊపందుకుంటున్నది. అప్పటి వరకు ఉద్యోగమే జీవితం అనుకున్న ఆయన.. కొత్త అవతారం ఎత్తాలనుకున్నాడు. బిల్డింగ్‌ మెటీరియల్‌ ట్రేడింగ్‌పై కన్నేశాడు. 


కొన్నేళ్లపాటు పైసా పైసా కూడబెట్టిన డబ్బుకు తోడు.. బ్యాంకుల చుట్టూ తిరిగితే కొంత రుణం లభించింది. ఓ స్నేహితుడు చేతులు కలిపాడు. దుబాయిలోనే 2004లో బిల్డింగ్‌ మెటీరియల్‌ ట్రేడింగ్‌కు శ్రీకారం చుట్టాడు రామ్‌కుమార్‌. ఆయన నెలకొల్పిన కంపెనీ ‘టోటల్‌ సొల్యూషన్స్‌’. ఊహించిన దానికంటే గొప్పగా సాగింది వ్యాపారం. లాభాలు కళ్లజూసినప్పుడే భాగస్వామితో పొరపొచ్చాలు ఏర్పడ్డాయి. 2007లో ఆయన్ని వదులుకోవాల్సి వచ్చింది. సొంతంగా వ్యాపారం చేయడమే తన ముందున్న ఏకైక మార్గం. దేశం కాని దేశం వెళ్లినప్పుడు.. ఏ చిన్న కష్టం వచ్చినా.. ముందు గుర్తొచ్చేది మన ఊరి దేవుడే! వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి అంటే రామ్‌కుమార్‌కు ఎనలేని భక్తి. ఆ దేవుడికే దండం పెట్టుకుని.. అదే పేరుతో దుబాయిలో ‘శ్రీ రాజరాజేశ్వర బిల్డింగ్‌ మెటీరియల్‌ ట్రేడింగ్‌’ (ఎస్‌ఆర్‌ఆర్‌ బీఎంటీ)ని ప్రారంభించాడు. అప్పటికే పరిచయమున్న కస్టమర్లు తోడ్పాటును అందించారు. పెద్ద పెద్ద భవనాలు, షాపింగ్‌మాల్స్‌, నివాస ప్రాంతాలు.. ఇలా ఏ నిర్మాణం జరిగినా తనే మెటీరియల్‌ను సరఫరా చేయడం మొదలుపెట్టాడు.


ఆత్మీయుల్ని  ఆదుకోవడమే కాదు... పండుగలనూ కలిసి సెలబ్రేట్‌ చేసుకోవాలన్నది నా ఆశయం. అందుకే పన్నెండేళ్లుగా దుబాయ్‌లో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నా.  



తొలి ఏడాదిలోనే సుమారు రూ.200 కోట్ల లావాదేవీలతో గల్ఫ్‌ దేశాల దృష్టిని ఆకర్షించాడు రామ్‌కుమార్‌. ప్రఖ్యాత బుర్జ్‌ఖలీఫాతో పాటు మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ సిటీ, అల్‌ మక్‌టౌమ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు, అరేబియన్‌ రాంచెస్‌, స్పోర్ట్స్‌ సిటీ, మోటార్‌సిటీ, దుబాయ్‌ మాల్‌, ఫామ్‌ జుమేరా, బిజినెస్‌ బే... వీటన్నిటికీ భవన నిర్మాణ సామగ్రిని సరఫరా చేసింది ఎస్‌ఆర్‌ఆర్‌. ‘బుర్జ్‌ ఖలీఫా ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన భవనం. ఇలాంటి నిర్మాణానికి మెటీరియల్‌ సరఫరా చేసే  అవకాశం రావడం.. నా జీవితంలో మరపురాని అనుభవం’ అని గుర్తు చేసుకుంటాడు రామ్‌కుమార్‌. దుబాయిలో ఏ పెద్ద నిర్మాణం చేపట్టినా తన కంపెనీ మెటీరియల్‌ ఉండాల్సిందే! యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో ఈ తరహా వ్యాపారం చేస్తున్న కంపెనీల్లో ఆయనది రెండోస్థానం. గల్ఫ్‌ కో-ఆపరేషన్‌ కౌన్సిల్‌ (జీసీసీ) టాప్‌ బిలియనీర్‌ కంపెనీల జాబితాలో 23వ స్థానం దక్కించుకుంది ఎస్‌ఆర్‌ఆర్‌.


అంతటితో ఆగలేదు. చైనాలోనూ అడుగుపెట్టాడు రామ్‌కుమార్‌. అక్కడ అల్యూమినియం ప్యానెళ్ల పరిశ్రమను నెలకొల్పాడు. 2005లో మొదలైన ఈ కంపెనీ ఇప్పుడు రూ.200 కోట్ల టర్నోవర్‌కు చేరుకుంది. ఇందులో తన వాటా 40 శాతం. ఇటు దుబాయిలో వ్యాపారం విస్తరిస్తోంది, అటు చైనాలో విజయవంతమైంది. మరికొందరి సహాయంతో ఒమన్‌లో కూడా ఒక శాఖను ప్రారంభించాడు. మిడిల్‌ ఈస్ట్‌ కంట్రీస్‌కు బిల్డింగ్‌ మెటీరియల్‌ సరఫరా చేసే టాప్‌ డీలర్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. దుబాయి, ఒమన్‌...  రెండు చోట్లా కలిపి ఎస్‌ఆర్‌ఆర్‌ సంస్థ ఏడాదికి రూ.600 కోట్ల లావాదేవీలను నిర్వహిస్తోంది. సుమారు 16 అవుట్‌లెట్లలో 345 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీళ్లలో తెలుగువారితో పాటు ఇతర దేశాల వాళ్లు కూడా ఉన్నారు. దాదాపు వెయ్యి రకాల మెటీరియల్‌ను ఈ కంపెనీ సరఫరా చేస్తోంది.


మా ఊరికి ఏం చేసినా తక్కువే. నాకు జీవితాన్ని ఇచ్చిన పల్లె అది. ఇప్పటిదాకా చేసిన సాయం వేరు. ఇకపై చేయాల్సింది వేరు. అందుకే  సేవ ఆర్గనైజ్డ్‌గా ఉండాలని వేములవాడలో టీఆర్‌కే ట్రస్టును ప్రారంభించాను. మా బావ వుప్పుల దేవరాజు, మిత్రులు నాయిని శేఖర్‌, గోలి శ్రీనివాస్‌, బూర సదానందంలను ట్రస్టీలుగా నియమించాను. ట్రస్టు కోసం ఒక భవనాన్ని నిర్మిస్తున్నాను. చుట్టుపక్కల గ్రామాలకు సైతం సేవల్ని విస్తరించే ఆలోచన ఉంది.  


 2008లో దుబాయిలో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. రెండేళ్లపాటు వ్యాపారాలను అతలాకుతలం చేసింది. ఆ అడ్డంకుల్ని ధైర్యంగా తట్టుకుని నిలబడింది ఎస్‌ఆర్‌ఆర్‌ సంస్థ. అంతటి సంక్షోభంలోనూ ఒక్క ఉద్యోగినీ తొలగించలేదు, ఎవరికీ ఒక్క రూపాయి జీతమూ తగ్గించలేదు. కొన్నాళ్లు ఓపికతో వ్యాపారాన్ని నడిపించాడు రామ్‌కుమార్‌. ఆ తరువాత అదే ఊపందుకుంది. లాభాల పంట పండింది. అయితే 2016లో గట్టి దెబ్బ తగిలింది. కొందరు కస్టమర్లు విలువైన సరుకు తీసుకుని.. రూ.10 కోట్లకు చెక్కులు ఇచ్చారు. అంతలోనే తమ కంపెనీని గుట్టుచప్పుడు కాకుండా మూసేశారు. ఆ మోసాన్ని జీర్ణించుకోవడానికి కొన్నేళ్లు పట్టింది. అలాంటి ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలిచాడు రామ్‌కుమార్‌.


నాకు స్నేహితులంటే చాలా ఇష్టం. జీవితంలోని ప్రతి మలుపులో ఫ్రెండ్స్‌ లేకుండా నేను లేను. ఎక్కడున్నా, ప్రత్యేకించి హైదరాబాద్‌, వేములవాడలకు ఎప్పుడు వచ్చినా... చుట్టూ స్నేహితులు ఉండాల్సిందే. నేను ఉన్నత స్థితికి చేరాక వాళ్ల జీవితాలనూ మెరుగ్గా చూడాలను కున్నా. అందుకే వాళ్ల కష్టాలూ తీరుస్తున్నా.


రామ్‌కుమార్‌ దుబాయికి వెళ్లిన కొత్తలో ఇరుకైన గదిలో ఉండేవాడు. ఇప్పుడు రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆఫీసును ఏర్పాటు చేసుకున్నాడు. సొంతూళ్లో చిన్న ఇంట్లో సర్దుకుని బతికినవాడు.. ఈ రోజు దుబాయిలో విలాసవంతమైన విల్లాను సొంతం చేసుకున్నాడు. వేములవాడ ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి ఫెయిలైనవాడు.. పరాయి దేశంలో చార్టర్డ్‌ అకౌంటెన్సీ పాసయ్యాడు.  తొలినాళ్లలో ఒక చిన్న కారు కొంటే.. ఈ జీవితానికి చాలని అనుకున్నవాడు.. ఖరీదైన రోల్స్‌రాయిస్‌లో  షికార్లు చేస్తున్నాడు. పెద్ద కొడుకును ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీలో చదివిస్తున్నాడు. చిన్న కొడుకు, కూతురు దుబాయిలోని పేరున్న పాఠశాలలో చదువు కుంటున్నారు. గల్ఫ్‌కు వెళ్లి నాలుగు కాసులు సంపాదించి.. తల్లిదండ్రులకు పంపిస్తే అదే పదివేలు అనుకున్నవాడు.. ఇప్పుడు దుబాయిలో తెలంగాణ తరఫున కాన్సులేట్‌ మెంబర్‌గా గౌరవం దక్కించుకున్నాడు. ‘బతకడమంటే నువ్వొక్కడివే బతకడం కాదు.. నీతోపాటు మరో నలుగుర్ని బతికించు.. అన్న నాన్న మాటలు నన్ను ప్రభావితం చేశాయి. 


ఒక కంపెనీని నెలకొల్పాలి బిడ్డా - అని నాన్న చెప్పలేదు కానీ.. కొందరికైనా సహాయం చేయాలన్నాడు. ఆ దృక్పథమే ఒక వ్యవస్థ నిర్మాణానికి ప్రేరణగా నిలిచింది. ఈ రోజు నా సంస్థ ఎస్‌ఆర్‌ఆర్‌లో ఇంతమందికి ఉపాధి దొరుకుతోందంటే.. నాన్న కల ఫలించినట్లే కదా!’ అంటున్న రామ్‌కుమార్‌ కళ్లలో ఆనందబాష్పాలు. ఆ సమయంలోనే, వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలోంచి గణగణమని ఘంటానాదం. ‘తథాస్తు.. తథాస్తు’ అంటున్నట్టు.

- చందనం శ్రీకాంత్‌, 94939 46649


Updated Date - 2020-02-16T22:30:02+05:30 IST