Venkaiah Naidu : పదవులకే వన్నె తెచ్చిన పెదరాయుడు…!

ABN , First Publish Date - 2022-08-11T15:18:54+05:30 IST

వెంకయ్య నాయుడు- ఉపరాష్ట్రపతి(Vice President Venkaiah Naidu), మాజీ ఉపరాష్ట్రపతి అంటూ పేరుకు ముందు విశేషణాలు అవసరం లేకుండా దేశమంతా తెలిసిన పేరు.

Venkaiah Naidu : పదవులకే వన్నె తెచ్చిన పెదరాయుడు…!

(ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు పదవీ విరమణ చేసిన సందర్భంగా)

వెంకయ్య నాయుడు- ఉపరాష్ట్రపతి(Vice President Venkaiah Naidu), మాజీ ఉపరాష్ట్రపతి అంటూ పేరుకు ముందు విశేషణాలు అవసరం లేకుండా దేశమంతా తెలిసిన పేరు. అలాంటి వెంకయ్యనాయుడు గురించిన ఒక విలేకరిగా నేను మరచిపోలేని కొన్ని జ్ఞాపకాలు వున్నాయి.


1972 – 73


ప్రత్యేక ఆంద్ర ఉద్యమం(Andhra Protest) ఉధృతంగా సాగుతున్న రోజులు. నేను బెజవాడ నార్లవారి ఆంధ్రజ్యోతి(Andhrajyothy)లో పనిచేస్తున్నాను. బందరు రోడ్డులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, ఇప్పుడు స్వరాజ్ మైదానం(Swaraj Maidan) అనుకుంటా, అక్కడ జరిగిన బహిరంగ సభలో ప్రధాన వక్తలు మాట్లాడిన తరువాత ఒక యువకుడు మైకు అందుకున్నాడు. నిమిషాల వ్యవధిలోనే సభికులను తన వాగ్దాటితో మైకంలో ముంచి తేల్చాడు. ఎవరని ఆరా తీస్తే వెంకయ్య నాయుడు అన్నారు. పేరు చూస్తే వయసుమళ్ళినవాడనిపించించేది కానీ, మనిషి మాత్రం చాలా చిన్నకారువాడే.


1975 లో హైదరాబాదు ఆలిండియా రేడియో(All India Radio)లో విలేకరిగా చేరిన మూడు సంవత్సరాలకు వెంకయ్యనాయుడు ఎమ్మెల్యేగా శాసన సభలో అడుగుపెట్టారు. ఆయనకు జోడీ ఎస్. జై పాల్ రెడ్డి(Jaipal Reddy). ఇక వాళ్ళు సభలో ప్రసంగం మొదలు పెట్టినా, ప్రశ్నలు లేవనెత్తినా, ప్రభుత్వాన్ని నిలదీసినా మొత్తం ప్రెస్ గ్యాలరీ పూర్తిగా నిండిపోయేది. వింటూ రాసుకోవడం విలేకరులకి అలవాటే అయినా వాళ్ళిద్దరూ చెబుతున్నది ఆసక్తిగా వినాలా, శ్రద్ధగా వింటూ పొల్లుపోకుండా రాసుకోవాలా అనేది అందరికీ ఒక సమస్యగా వుండేది. ఆ రోజుల్లో ‘శాసన సభలో ఛలోక్తులు’ అనే శీర్షికతో ప్రతి పత్రికా ఒక కాలం ప్రచురించేది. వాటిల్లో సింహభాగం వారిద్దరివే ఉండేవి. ఈ విషయంలో ఇద్దరూ ఇద్దరే. వెంకయ్యనాయుడి విశ్వరూపం నేను చూసింది అసెంబ్లీలోనే. అంత్య ప్రాసలతో ఉపన్యాసాన్ని రక్తి కట్టించే ఆ సాంప్రదాయాన్ని ఆనాటి నుంచి ఈనాటివరకూ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ప్రసంగాల్లో కూడా ఆయన కొనసాగిస్తూ వస్తూనే వున్నారు.






ఆయనతో నా రేడియో అనుబంధం ఇంకా విచిత్రం. ఏదైనా వార్తను పత్రికలకు ఎలా చెప్పాలో, రేడియోకు ఎలా చెప్పాలో ఆయనకు కరతలామలకం. మాకు మధ్యాన్నం, మళ్ళీ సాయంత్రం ప్రాంతీయ వార్తలు ఉండేవి. ఆయన ఇరవై మూడు జిల్లాల్లో ఎక్కడ వున్నా ఫోనుచేసి వార్త చెప్పేవారు. మేము ప్రసారం చేసింది విని, మళ్ళీ ఫోను చేసి ‘బాగానే చెప్పారు కానీ మరో వాక్యం జత చేస్తే బాగుండేది, సాయంత్రం వీలుంటే  చెప్పండి’ అనేవారు, ‘కాదు’ అనడానికి వీల్లేకుండా. ఇక ఎన్టీఆర్ రోజుల్లో జరిగిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో ఆయన పాత్ర ఇంతా అంతా కాదు. ప్రజల్లో రగిలిన అసహనానికి ఆయన వాగ్ధాటి ఆజ్యం పోసిందనడంలో అతిశయోక్తి లేదు. మరోసారి కలిసింది ఢిల్లీలో. మాస్కో రేడియోలో పనిచేస్తూ సెలవుపై హైదరాబాద్ వస్తూ ఢిల్లీలో దిగాను. పూర్వ పరిచయం పురస్కరించుకుని వెడితే, గుర్తుపట్టి ఆప్యాయంగా పలకరించారు. మాస్కో విశేషాలు అడిగి ఆసక్తిగా విన్నారు.


ఆయన కేంద్ర మంత్రిగా ఉన్న రోజుల్లో నేనూ, జ్వాలా నరసింహారావు ఒకసారి ఢిల్లీ వెళ్ళాము. ఏపీ భవన్‌లో దిగిన మమ్మల్ని కలవడానికి సీనియర్ జర్నలిష్టులు చంద్రకాంత్, ఆనంద్ వచ్చారు. మాటల మధ్యలో వెంకయ్యనాయుడు గారి ఇంటికి వెడుతున్నట్టు చెప్పి మమ్మల్ని కూడా రమ్మన్నారు. ఆయన ప్రతి సంక్రాంతి పండగకు కాబోలు తన ఇంట్లో చక్కటి విందు భోజనం ఏర్పాటుచేసి, ఢిల్లీలోని తెలుగు కుటుంబాలను ఆహ్వానిస్తారు. పిలవని పేరంటంగా వెళ్లిన మా ఇద్దర్నీ కూడా వెంకయ్యనాయుడు చాలా ఆదరంగా కనుక్కున్నారు. అందరూ వెళ్ళిన తరువాత వెళ్లి కలిస్తే ‘వచ్చిన పనేమిటని’ ఆయనే ఆరా తీసారు. అప్పుడు జ్వాలా 108లో పనిచేస్తున్నాడు. రాజస్థాన్ రాష్ట్రంలో విస్తరణ గురించి జ్వాలా చెబితే అక్కడి ముఖ్యమంత్రితో మాట్లాడుతానని చెప్పి, అప్పటికప్పుడే మాట్లాడారు కూడా.


ఏడాది క్రితం ఒకసారి హైదరాబాదులో ఏదో కార్యక్రమానికి హాజరయి, జనాల హర్షద్వానాల నడుమ ఆసక్తికర ఉపన్యాసం ముగించుకుని, విమానం టైం అయిందని మధ్యలోనే వెడుతుంటే దారిలో నాకు కనిపించారు. ‘ఎలా వున్నావు శ్రీనివాసరావు’ అంటూ అదే ఆదరణతో కూడిన పలకరింపు. నడుస్తూనే నా గురించి మంచీచెడూ కనుక్కుంటూ కారెక్కి వెళ్ళిపోయారు.




ఉపశ్రుతి :


దేశాన్ని కరోనా పట్టి  పీడిస్తున్న రోజులు.  జనమంతా ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో తెలియక తమని గురించే మధన పడుతున్న రోజులు. 

2020 మే నెల నాలుగో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఫోను రింగయింది.

“భండారు శ్రీనివాసరావు గారా! లైన్లో వుండండి వైస్ ప్రెసిడెంటు గారు మాట్లాడుతారు”

వెంకయ్యనాయుడు గారు దేశంలో చాలామందికి ఇలా ఫోను చేసి మాట్లాడుతున్నారని తెలుసు, కానీ ఆ ఫోను నాకు వస్తుందని ఊహించలేక పోయాను. ఇంతలోనే నాయుడు గారు లైన్లోకి వచ్చారు.

“శ్రీనివాసరావు గారు ఎలా వున్నారు? నేను వెంకయ్య నాయుడిని”

“నమస్కారం సార్! నేను బాగున్నానండీ! మీరెలా వున్నారు?”

“నేను బాగానే వున్నాను. మీ ఆవిడ చనిపోయిన తర్వాత ఫోను చేసి మాట్లాడలేకపోయాను, వెరీ సారీ”

“..........”

“హైదరాబాదులో మన మిత్రులందరూ కులాసేనే కదా!”

“అందరూ బాగున్నారండీ. నాకు అర్ధం కాని విషయం అండీ. పేపర్లో చదివాను. మీరు ఈ కరోనా సమయంలో ఇలా అందరితో ఫోను చేసి మాట్లాడుతున్నారని. ఇంత తీరిక ఎలా దొరికింది”

“ఇలాంటి సమయాల్లోనే కదా మాట్లాడి యోగక్షేమాలు కనుక్కోవాల్సింది”

“....................”

“ఇక్కడ నేను నా భార్య ఇద్దరమే. పిల్లలు దగ్గర లేరు. బహుశా పెళ్ళయిన తర్వాత ఇలా ఇద్దరం ఒక్కచోట ఇన్నాళ్ళు కలిసివుంది ఇప్పుడేనేమో”... “చాలా సంతోషంగా వుందండీ మీతో మాట్లాడడం”

“నాకూ అలానే వుంది. అందరం పెద్ద వయసులో పడ్డాం. ఆరోగ్యం జాగ్రత్త! వుంటాను శ్రీనివాసరావు గారు” 

తర్వాత సిగ్గనిపించింది. ఈ కరోనా సమయంలో నేనూ ఖాళీనే. కానీ ఎంతమంది స్నేహితులను పలకరించగలిగాను?

దటీజ్ వెంకయ్యనాయుడు !


– భండారు శ్రీనివాసరావు

(సీనియర్ పాత్రికేయులు, రచయిత)

9849130595

Updated Date - 2022-08-11T15:18:54+05:30 IST