విలక్షణ రాజకీయ పథికుడు

ABN , First Publish Date - 2022-08-09T08:58:11+05:30 IST

తెలుగు వారి వెలుగు సంతకం, తెలుగు అక్షరానికి నిండుదనం, తెలుగు సంప్రదాయానికి నిలువెత్తు రూపం మన ముప్పవరపు వెంకయ్యనాయుడు.

విలక్షణ రాజకీయ పథికుడు

తెలుగు వారి వెలుగు సంతకం, తెలుగు అక్షరానికి నిండుదనం, తెలుగు సంప్రదాయానికి నిలువెత్తు రూపం మన ముప్పవరపు వెంకయ్యనాయుడు. తన దగ్గరకు ఎవరొచ్చినా ఆప్యాయంగా పలకరించే తత్వం ఆయనది. గ్రామీణ ప్రాంతంలో పుట్టి, విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు అలవర్చుకుని ప్రారంభమైన ఆయన ప్రస్థానం బీజేపీ జాతీయ అధ్యక్ష స్థాయికి, తుదకు ఉపరాష్ట్రపతిగా శిఖరాగ్రానికి చేరి, తెలుగు ఖ్యాతిని ప్రపంచ నలుదిశలా వ్యాపింపజేశారు.


సామాన్య కార్యకర్తగా, విశాఖలో విద్యార్థి నేతగా పయనం ప్రారంభించిన వెంకయ్య దీక్షాదక్షతలతో ముందుకు సాగి దేశ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. పార్టీ మారకుండా తన గ్రాఫ్‌ను చక్కగా నిలుపుకున్నారు. గంటలపాటు ప్రసంగించగల వాగ్ధాటి ఆయన సొంతం. సభికులను క్షణం కూడా కదలనీయకుండా మాట్లాడగలిగే చతురత ఆయనది. దక్షిణ భారతదేశం నుంచి బీజేపీకి అత్యంత కీలక నేతగా ఎదిగి, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని రాజకీయ సంక్షోభాలను చతురతతో పరిష్కరించగలిగిన నేతగా నిరూపించుకున్నారు. మాటల మాంత్రికుడుగా పేరు తెచ్చుకున్న ఈ తెలుగు తేజం అలవోకగా నినాదాలు సృష్టించడంలో దిట్ట. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు వారధి.


స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జన్మించిన వాళ్లలో ఉపరాష్ట్రపతి పదవి చేపట్టిన మొట్టమొదటి వ్యక్తి వెంకయ్య నాయుడు. తెలుగు నేలనుంచి మూడవ ఉపరాష్ట్రపతి. రాజ్యసభలో సుదీర్ఘకాలం సభ్యుడిగా కొనసాగిన ఆయన అదే సభకు ఛైర్మన్‌ అయ్యారు. పాలకపక్షం బీజేపీకి రాజ్యసభలో మొదట్లో మెజారిటీ లేనప్పుడు తన చతురతతో సభను సజావుగా నిర్వహించడమే కాక ప్రభుత్వ బిల్లులు చాలా వరకూ అమోదం పొందేలా చూశారు. సభా కార్యక్రమాలు హుందాగా నిర్వహించారు. ఈ బహుభాషా కోవిదుడికి సంగీతం, సాహిత్యం, కళలు అంటే మక్కువ. సంప్రదాయం ఆరో ప్రాణం. ఎన్టీఆర్, ఇందిరాగాంధీల ప్రభంజనాలను తట్టుకుని నిలబడి తెలుగురాష్ట్రాల్లో పార్టీని బతికించిన నాయకుడు వెంకయ్య. బీజేపీ జాతీయ స్థాయి పదవులు సమర్థంగా నిర్వహించడంతోపాటు అధిష్టానంతో సన్నిహిత సంబంధాలు వెంకయ్యకు కలసి వచ్చాయి. వాజపేయి కేబినెట్‌లో గ్రామీణాభివృద్ధి మంత్రిగా పనిచేయడం జాతీయ రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి ఉపకరించింది. ఆడ్వాణీ వర్గీయుడిగా ముద్ర ఉన్నా, 2013 నాటి బీజేపీ అంతర్గతపోరులో మోదీకి మద్దతివ్వడం వెంకయ్యకు కలిసొచ్చింది.


‘ట్రబుల్‌ షూటర్‌’గా పేరొందిన ఆయనకు మోదీ మంత్రివర్గంలో కీలక శాఖలు దక్కాయి. తన స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ ద్వారా విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర, నమ్మిన భావజాలానికి మొక్కవోని అంకితభావం.. తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో గుక్కతిప్పుకోని చమత్కార వాగ్ధాటితో పాటు, గెలుపోటములకు వెరవకుండా నిలకడతో, దృఢచిత్తంతో ఆయన రాజకీయ ప్రస్థానం సాగింది. అధ్యయనం, రచన, చర్చ అన్నింట్లో దిట్ట ఆయన. జాతీయ స్థాయిలో అనేకాంశాలను స్పృశిస్తూ పత్రికలలో రాసిన వ్యాసాలు అసంఖ్యాకం. ఏ అంశమైనా సరే దానిని ఆమూలాగ్రం తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. విస్తృత సమాచారం ఆయన అమ్ముల పొదిలో ఉంటుంది. పార్టీలో కీలక పదవిలో ఉన్నా, కేంద్రంలో మంత్రిగా ఉన్నా, ఉపరాష్ట్రపతిగా ఉన్నా పాత్రికేయ ప్రపంచంతో ఆయనకు సత్సంబంధాలున్నాయి. ఏళ్ళ తరవాత కలసినా ఎదుటివ్యక్తిని పేరుపెట్టి మరీ కుశల ప్రశ్నలు వేస్తారు. వయోధిక పాత్రికేయ సంఘం కార్యక్రమాలకూ ఆయన హాజరయ్యారు.


నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితమున్నా ఆయన కుటుంబీకులెవ్వరూ రాజకీయ యవనికపై కనపడలేదు. రాజకీయాలలో వివాదరహితుడు. క్షణం విరామం లేకుండా పని చేయడం ఆయన బలం. అనుకుంటే సాధించేదాకా వదిలి పెట్టని మనస్తత్వం ఉన్నందువల్లనే దీర్ఘకాలం దేశ రాజకీయాల్లో చక్రం తిప్పగలిగారు, అత్యున్నత స్థానాలను అలంకరించగలిగారు.


నందిరాజు రాధాకృష్ణ

విశ్రాంత పాత్రికేయుడు

Updated Date - 2022-08-09T08:58:11+05:30 IST