
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు సీఆర్ఆర్ కళాశాల 75 వసంతాల వేడుకకు భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు బుధవారం హాజరవుతున్నారు. సాయంత్రం నాలుగు నుంచి 5.15 గంటల వరకు ఈ వేడుకలో పాల్గొంటారు. విజయవాడ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఏలూరు చేరుకుంటారు. ఈ కార్యక్రమం ముగించు కుని తిరిగి బయలుదేరి వెళతారు. వెంకయ్య పర్యటన నేపథ్యంలో భారీ ఎత్తున పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. కాగా.. వీవీఐపీ పర్యటన నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, రాజమహేంద్రవరం అర్బన్ పోలీసు జిల్లాల నుంచి మొత్తం 491 మంది పోలీసు సిబ్బందిని నియమించామని డీఐజీ మోహన్‌రావు, ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ తెలిపారు.
కాగా.. సిబ్బంది ఎవరూ విధి నిర్వహణలో సెల్‌ఫోన్ ఉపయోగించకూడదని స్పష్టం చేశారు. నగరం లో ట్రాఫిక్ మళ్లింపు చేపట్టామని తెలిపారు. పర్యటనలో ఒక అదనపు ఎస్పీ, ఐదుగురు డీఎస్పీలు, 11 మంది సీఐలు, 23 మంది ఎస్ఐ లు, 94 మంది ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుళ్లు, 195 మంది కాని స్టేబుళ్లు, 53 మంది మహిళా పోలీసులు, 109 మంది హోం గార్డులు, ఏఆర్ ప్లాటున్ ఒకటి, పోలీసు స్పెషల్ పార్టీ సిబ్బందిని బందోబస్తులో నియమించారు.