‘బడా’బాబుల లేఅవుట్లు

Jul 25 2021 @ 23:54PM
ఆలంఖానపల్లె - రాజంపేట బైపా్‌సలో వెలుస్తున్న లేఅవుట్‌

అనుమతి లేకుండానే వెంచర్లు

ఖజానాకు గండి

చోద్యం చూస్తున్న అధికారులు


కడప కార్పొరేషన రూటే సపరేట్‌. అయిన వాళ్లు అక్రమాలు చేసినా అధికారులకు సక్రమంగానే కనిపిస్తుంది. బలహీనులపై చూపించే ప్రతాపం బడాబాబుల పై చూపించరనే విమర్శ ఉంది. దీనికి ఉదాహరణ అనుమతులు లేని లేఅవుట్ల వ్యవహారమే. ఇటీవల కార్పొరేషన పరిధిలో అనుమతులు లేని లేఅవుట్లపై టౌనప్లానింగ్‌ అధికారులు విరుచుకుపడుతూ తొలగించేస్తున్నారు. అయితే పాలకవర్గంలోని ముఖ్యనేతలు, రాజకీయ అండ కలిగిన బడాబాబులు వేసిన అనుమతులు లేని లేఅవుట్ల దగ్గరకు వచ్చేసరికి టౌన ప్లానింగ్‌ చూసీ చూడనట్లు వదిలేయడం విమర్శలకు తావిస్తోంది. 


కడప, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ఇటీవల కడప నగరంలో రియల్‌ జోరు కొనసాగుతోంది. నగరంలో రింగు రోడ్డు చుట్టూ వెంచర్లు వెలుస్తున్నాయి. అంతా బడాబాబులే రియల్టర్ల అవతారమెత్తారు. కార్పొరేటర్లు కూడా డీలింగ్‌ చేస్తున్నారు. వారి వ్యాపారాన్ని తప్పుబట్టడం లేదు కానీ అనుమతులు లేకుండా వెంచర్లు వేయడం ఆరోపణలకు తావిస్తోంది. ఆలంఖానపల్లె బైపాస్‌ నుంచి రాజంపేట వెళ్లే రింగు రోడ్డులో ఓ షోరూం వద్ద సుమారు 30 ఎకరాల్లో కొత్తగా లేఅవుట్‌ వేస్తున్నారు. ఇందులో కార్పొరేషన పాలకవర్గంలోని కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. అనుమతులు లేకుండానే లేఅవుట్‌ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దీని జోలికి టౌన ప్లానింగ్‌ అధికారులు వెళ్లడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. చలమారెడ్డిపల్లె వద్ద సుమారు 15 ఎకరాల్లో అనుమతులు లేకుండా లేఅవుట్‌ వేశారు. వినాయక్‌నగర్‌లో సమీపంలో ఓ ముఖ్య నేత సోదరుడు సుమారు 15 ఎకరాల్లో అనుమతులు లేకుండా లేఅవుట్‌ వేసినట్లు చెబుతారు. అల్మా్‌సపేటలో కూడా ఆయన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున లేఅవుట్లు ఉన్నట్లు తెలుస్తోంది. వాటిని పడగొట్టే సాహసం అధికారులు చేయలేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.


చిన్నచౌకు ప్రత్యేకం

కార్పొరేషన పరిధిలో చిన్నచౌకు ప్రాంతం శరవేగంగా విస్తరిస్తోంది. అక్కడ ఏరియాను బట్టి నివాస స్థలం సెంటు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల పైమాటే పలుకుతోంది. ఇది ముఖ్య నేతలున్న ఏరియా. ఇక్కడ సుమారు వంద లేఅవుట్ల వరకు అనుమతులు లేనివి ఉన్నట్లు చెబుతున్నారు. అయితే అధికార యంత్రాంగం మాత్రం ఆ ప్రాంతంలోని లేఅవుట్ల జోలికి పోవడానికి సాహసం చేయలేరని సమాచారం. పుట్లంపల్లెలో కూడా అనుమతులు లేని లేఅవుట్లు వెలిశాయి.


ఖజానాకు గండి

ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేసే లేఅవుట్లలో 40 అడుగుల రోడ్లుండాలి. లేఅవుట్లలో పది శాతం ఓపెన స్పేస్‌, 3 శాతం స్థలాన్ని యుటిలిటీస్‌ కోసం కేటాయించాల్సి ఉంది. ప్రభుత్వ ఫీజులు చెల్లించాలి. ఇవన్నీ అనుమతి తీసుకున్న లేఅవుట్లలో తప్పకుండా పాటించాలి. అయితే అనుమతి లేకుండా వేసే లేఅవుట్లలో 30 అడుగుల రోడ్లు ఉండడం, ఓపెన, యుటిలిటీస్‌ చార్జీలు కేటాయించకుండానే వెంచర్లు వెలుస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ప్రభుత్వానికి వచ్చే ఫీజులకు గండి పడుతోంది.


ఎందుకంత ప్రేమ?

కార్పొరేషన పరిధిలో 188 అనుమతులు లేని లేఅవుట్లను టౌన ప్లానింగ్‌ అధికారులు గుర్తించారు. వాటిలో కొనుగోలు చేసే ప్లాట్లను రిజిస్టరు చేయవద్దంటూ సర్వే నెంబర్ల వారీగా వివరాలతో రిజిస్ట్రేషన శాఖకు టౌనప్లానింగ్‌ అధికారులు లేఖ రాశారు. అయితే బడాబాబులు వేసిన లేఅవుట్ల జోలికి వెళ్లకపోవడంతో ఎందుకు వాటిపై ప్రేమ అంటూ నగర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పాలకవర్గంలోని పలువురు కార్పొరేటర్లు, ముఖ్యులు ఓ ముఖ్య నేత సోదరుడు, మరో కీలక నేత ఇప్పుడు రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వేస్తున్నారు. వాటికి అనుమతులు లేకపోయినా అధికారులు పట్టించుకోకపోవడంపై పలువురు ప్రశ్నిస్తున్నారు.


అనుమతుల్లేని లేఅవుట్లను తొలగిస్తాం

- నాగేంద్ర, అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌

కార్పొరేషన పరిధిలో చాలావరకు లేఅవుట్లకు అనుమతులు లేవు. ఇప్పటివరకు 70 లేఅవుట్లను తొలగించాం. ఎక్కడెక్కడ లేఅవుట్లు ఉన్నాయో గుర్తిస్తున్నాం. అనుమతులు లేకుండా లేఅవుట్లు వేస్తే ఉపేక్షించేది లేదు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.