గందరగోళంగా డీఎస్సీ-98 సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌

ABN , First Publish Date - 2022-10-07T16:32:53+05:30 IST

డీఎస్సీ-98(DSC-98) అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన గందరగోళంగా మారింది. విద్యాశాఖ (Education Department) అధికారులు ముందుచూపు లేకుండా వ్యవహరించడంతో గురువారం అభ్యర్థులకు అవస్థలు తప్పలేదు. ఏయే తేదీల్లో

గందరగోళంగా డీఎస్సీ-98 సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌

అభ్యర్థులకు తప్పని అవస్థలు 


అనంతపురం విద్య, అక్టోబరు 6: డీఎస్సీ-98(DSC-98) అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన గందరగోళంగా మారింది. విద్యాశాఖ (Education Department) అధికారులు ముందుచూపు లేకుండా వ్యవహరించడంతో గురువారం అభ్యర్థులకు అవస్థలు తప్పలేదు. ఏయే తేదీల్లో ఎవరెవరు హాజరుకావాలో ముందుగా చెప్పకపోవడంతో భారీగా వచ్చిన అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. డీఎస్సీ-1998లో అర్హత పొంది ఎంటీఎస్‌ కింద పనిచేయడానికి అంగీకారం తెలిపి, సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చేసిన వారికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌(certificates Verification) అంటూ అధికారులు ప్రకటించారు. అయితే ఈ నెల 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకూ 9 రోజులపాటు  జిల్లా కేంద్రంలోని సైన్స సెంటర్‌లో వెరిఫికేషన్‌ ఉంటుందని ప్రకటించారు. అయితే ఇతర జిల్లాల్లో ఫలానా క్రమ సంఖ్య వరకూ ఫలానా తేదీలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ఉంటుందని ప్రకటించారు. అయితే అనంతపురం జిల్లాలో మాత్రం 6వ తేదీ నుంచి వెరిఫికేషన్‌ ఉంటుందని చెప్పడంతో భారీగా అభ్యర్థులు వచ్చారు. కర్నూలు, ధర్మవరం, గుంతకల్లు తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రావడంతో గందరగోళం నెలకొంది. పైగా అభ్యర్థులకు ఎలాంటి సదుపాయాలు కల్పించకపోవడంతో నేలపై కూర్చుని తమ పనులు చేసుకున్నారు. అభ్యర్థులు నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందని తెలుసుకుని హడావుడిగా 3 కౌంటర్లు ఏర్పాటు చేశారు. క్రమ సంఖ్య 1 నుంచి 200 వరకూ మొదటి కౌంటర్‌లో, 201 నుంచి 400 వరకూ రెండవ కౌంటర్‌లో, 401 నుంచి 570 వరకూ మూడవ కౌంటర్‌లో వెరిఫికేషన్‌ నిర్వహించారు. అయితే ముందుగా ప్రకటించకపోవడంతో కొందరు అభ్యర్థులు ఆందోళనకు గురికావడంతోపాటు, నేను ముందంటే...నేను ముందంటూ...వాగ్వాదానికి దిగే పరిస్థితి నెలకొంది. ఆఖరికి 12.30 గంటల తర్వాత వెరిఫికేషన్‌ను ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్‌లో నిర్వహించారు.


హడావుడిగా ఇంకో ప్రకటన

అభ్యర్థులు భారీగా రావడంతో అప్పటికప్పుడు మళ్లీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ఎవరెవరికి ఎప్పుడు ఉంటుందో తెలిసేలా ప్రకటించారు. క్రమ సంఖ్య 1 నుంచి 100 వరకూ 7వ తేదీన 8వ తేదీ 101నుంచి 200 వరకూ, 9వ తేదీ 201 నుంచి 300, 10వ తేదీ 301 నుంచి 400 వరకూ, 11వ తేదీ 401 నుంచి 500 వరకూ, 12తేదీ 501 నుంచి 570 వరకూ వెరిఫికేషన్‌ ఉంటుందంటూ ప్రకటించారు.  

Updated Date - 2022-10-07T16:32:53+05:30 IST