నిలువెలాచ నిర్లక్ష్యం

Jul 25 2021 @ 00:27AM
స్వర్ణవాగుపై కొట్టుకుపోయిన నిర్మాణం

ప్రాజెక్ట్‌ గేట్ల ఎత్తివేతలో లోపించిన చిత్తశుద్ధి

లోతట్టు ప్రాంతాలకు అందని సమాచారం 

అప్రమత్తం చేయకుండానే నీటి విడుదల 

24వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు 

పెద్దసంఖ్యలో ఇళ్లకు, ఆస్తులకు నష్టం 

ఇక కోలుకోవడం ఇప్పట్లో కష్టమే 

నిర్మల్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి) : సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహారించాల్సిన నీటి పా రుదలశాఖ అధికారులు అడుగడుగునా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పైస్థాయి అధికారులు, కిందిస్థాయి సిబ్బంది మధ్య సమన్వయం కొరవడడం అలాగే జాగ్రత్తగా నిర్వహించాల్సిన బాధ్యతల పట్ల నిర్లక్ష్యధోరణి అవలంభించడంతో సాధారణ ప్రజానీకం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా జిల్లాలోని స్వరప్రాజెక్టు అధికారుల తీరుపై ప్రస్తుతం సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రాజెక్ట్‌ అధికారుల నిర్వాహకంతో జరిగిన నష్టం ప్రస్తుతం ఇరిగేషన్‌శాఖను కుదిపేస్తోంది. అలాగే కడెం, గడ్డెన్నవాగు ప్రాజెక్టుల అధికారుల తీరుపైనా ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రాజెక్టులకు సంబంధించి రిజర్వాయర్‌లు, కాలువల మరమత్తులతో పాటు ప్రతీయేటా వర్షకాలంలో ఎగువ నుంచి ప్రవహించే వరద నీటి నిర్వహణ విషయంలో సైతం ఇరిగేషన్‌ అధికారులు ఆశించిన మేరకు చర్యలు చేపట్టడం లేదన్న ఆరోపణలున్నాయి. ఎగువ నుంచి ఎంత మేరకు వరదనీరు రిజర్వాయర్‌లోకి వచ్చి చేరుతుందన్న అంశంతో పాటు గరిష్ట నీటిమట్టంను ఎప్పటికప్పుడు గమనించి దిగువకు నీటిని విడుదల చేయాలనే విషయంలో అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అధికార యంత్రాంగమంతా ముఖ్యంగా వర్షకాలంలో మరింత అప్రమత్తంగా వ్యవ హరించాల్సి ఉంటుంది. అయితే చాలా సంవత్సరాల నుంచి ఇరిగేషన్‌ అధి కారులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోకుండా కిందిస్థాయి సిబ్బందికి బాధ్యతలు అప్పగిస్తుండడం భారీ మూల్యానికి ఆస్కారమిస్తోందంటున్నారు. గత మూడురోజుల క్రితం జిల్లా కేంద్రమైన నిర్మల్‌తో పాటు భైంసా పట్టణంలో చోటు చేసుకున్న సంఘటనలు ప్రాజెక్టు అధికారుల బాధ్యత రాహిత్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా వందలాది ఇళ్లు నీటమునగగా, వేలాది ఎకరాల్లో పంటలు నష్టాల పాలయ్యాయి. స్వర్ణప్రాజెక్ట్‌కు సంబంధించి గేట్లను ఆకస్మికంగా ఎత్తివేయడంతో స్వర్ణవాగు పరివాహక ప్రాంతాలన్నీ నీట మునిగిన సంగతి తెలిసిందే. ఈ వాగు పరివాహకంలోని పంటలన్నీ మునిగిపోగా పట్టణంలోని జీఎన్‌ఆర్‌ కాలనీ పూర్తిగా నీటమునిగింది. ఇరిగేషన్‌ అధికారులు ముందుగానే స్వర్ణవాగు పరివాహక ప్రాంతాలను అలాగే లోతట్టు ప్రాంతాలన్నింటినీ అప్రమత్తం చేసిన తరువాతనే ప్రాజెక్ట్‌గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసి ఉండాల్సిందంటున్నారు. పరివాహక ప్రాంతాలకు, లోతట్టు ప్రాంతాల్లో సమాచారం ఇవ్వకుండా సంబంధిత రెవెన్యూ, పంచాయతీ రాజ్‌ యంత్రాంగానికి అప్రమత్తం చేయకుండా ప్రాజెక్టుగేట్లను వదిలిన కారణంగానే భారీ ఉపద్రవం ముంచుకొచ్చిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్వర్ణవాగు పొంగిపొర్లిన కారణంగా జీఎన్‌ఆర్‌ కాలనీతో పాటు కొన్నిగ్రామాలు సైతం జలమయమైపోయాయి. అలాగే దాదాపు 24వేల ఎక రాల్లో వివిధ రకాల పంటలు నీట మునిగిపోయాయి. పెద్దసంఖ్యలో ఇళ్లు నేలమట్టం కాగా అదే స్థాయి లో ఆస్థులు కూడా ధ్వంసమయ్యాయి. సాక్ష్యాత్తు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, కలెక్టర్‌ ముషారఫ్‌ ఆలీ ఫారూఖీ, ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌ తదితరులంతా రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాల్సి వచ్చిందంటే పరిస్థితి ఏ మేరకు చేయిదాటిపోయిందో తెలిసిపోతోందంటున్నారు. భైంసా మండలంలోని పల్సీకర్‌ రంగారావు ప్రాజెక్టు, గడ్డెన్నవాగు ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో కూడా నిర్లక్ష్యవైఖరి కొనసాగుతోందన్న ఫిర్యాదులున్నాయి. ఇక్కడి అధికారుల నిర్లక్ష్యం కారణంగానే గుండెగావ్‌ గ్రామం ప్రతియేటా వర్షకాలంలో ముంపుకు గురవుతుండడం సహజంగా మారిందంటున్నారు.

అప్రమత్తం చేసి ఉంటే..

కాగా స్వర్ణ ప్రాజెక్ట్‌ నుంచి నీటిని దిగువకు వదిలే సమయానికి నాలుగైదు గంటల ముందుగా వాగు పరివాహక ప్రాంతాన్ని అప్రమత్తం చేసి ఉంటే ముంపు పరిస్థితి తలెత్తేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముందుగానే వాగు పరివాహక గ్రామాలతో పాటు జీఎన్‌ఆర్‌ కాలనీ, ఆదర్శనగర్‌, సిద్దాపూర్‌, విజయనగర్‌ కాలనీలను అప్రమత్తం చేయకపోవడంపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు సందిస్తున్నాయి. అధికారులు కేవలం గంట, రెండు గంటలకు ముందుగా గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నామంటూ పత్రిక ప్రకటనలు వేయడమే కాకుండా సాధారణ వ్యవహారం మాదిరి సంబంధిత అధికారులకు సమాచారం అందించినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా రెవెన్యూ అధికారులను, పంచాయతీ అధికారులను, పోలీసు అధికారులను ముందస్తుగా అప్రమత్తం చేసి ఉన్నట్లయితే అందరు తగినజాగ్రత్తలు తీసుకునే వారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్‌మీడియా ద్వారా కూడా ముందస్తు ప్రచారం జరిపితే ఇంతటి నష్టం వాటిల్లేది కాదంటున్నారు. అధికారులు కూడా ఇలా జరుగుతుందని ఉహించలేకపోయారన్న వాదనలు తలెత్తుతున్నాయి. స్థానికంగా వర్షాలు 24 సెంటీమీటర్లకు పైగా కురియడంతో పాటు ఎగువ నుంచి భారీఎత్తున వరదనీటి ప్రవాహం కొనసాగడంతోనే గేట్లను ఎత్తి పెద్దఎత్తున దిగువకు నీరును విడుదల చేయాల్సి వచ్చిందంటున్నారు. 

ప్రాజెక్ట్‌ల నిర్వహణపై ఆరోపణలు

జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్వహణ విషయంలో సంబంధిత యంత్రాంగం నిర్లక్ష్యధోరణి అవలంభిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలైనా బీజేపీ, కాంగ్రెస్‌లు దీనిపై మండిపడుతుండడమే కాకుండా ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. పై స్థాయి అధికారులు కింది స్థాయి సిబ్బంది మధ్యప్రాజెక్ట్‌ల నిర్వహణ విషయంలో సమన్వయం కొరవడుతున్నట్లు విమర్శలున్నాయి, ముఖ్యంగా ఎగువ ప్రాంతం నుంచి రిజర్వాయర్‌లోకి వచ్చే వరదతో పాటు గేట్ల ద్వారా దిగువకు విడుదల చేసే నీటి లెక్కలపై అధికారుల మధ్య పొంతన ఉండడం లేదన్న వాదనలున్నాయి. అలాగే ప్రధాన కాలువలు, ప్రాజెక్టుల గేట్ల విషయంలో కూడా ఎప్పటికప్పుడు మరమత్తులు చేయడం లేదంటున్నారు. స్వర్ణ ప్రాజెక్టు విషయంలో దాదాపు నాలుగైదు సంవత్సరాల నుంచి మరమత్తులు చేయడం లేదంటున్నారు. స్వర్ణప్రాజెక్ట్‌ గేట్లను ఎత్తే విషయంలో సరియైున సాంకేతికతను వినియోగించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. స్వర్ణప్రాజెక్టు గేట్లను ఎత్తేందుకు ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు దాదాపు ఐదారుగంటలకు పైగా సమయం పట్టిందంటున్నారు. గేట్లకు ప్రతీవేసవిలో గ్రీసింగ్‌ చేయడంతో పాటు ఇతర మరమత్తులు చేపట్టాల్సి ఉంటుంది. ఈ విషయంలో కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. అలాగే గడ్డెన్న వాగు ప్రాజెక్టు విషయంలో కూడా అధికారులు నిర్లక్ష్యధోరణి అవలంభిస్తున్నారంటున్నారు. సరస్వతీ కాలువకు కూడా మరమత్తులు చేయని కారణంగా చాలా చోట్ల ఆ కాలువకు గండ్లుపడ్డాయి. గడ్డెన్నవాగుప్రాజెక్టు గేట్లు, మరమత్తులకు సంబంధించి అధికారులు ప్రతిపాదనలు రూపొందించినప్పటికీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా నిధులను విడుదల చేయలేదంటున్నారు. 

రోడ్లు, పంటలు, ఆస్తులకు అపారనష్టం

కాగా భారీగా కురిసిన వర్షంతో పాటు పాజెక్టుల పరివాహకంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా పెద్దఎత్తున పంటలకు నష్టం వాటిల్లిదంటున్నారు. నిర్మల్‌ జిల్లాలో దాదాపు 24వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు వరద నీటి కారణంగా నష్టపోయాయని వ్యవసాయాధికారులు వెల్లడిస్తున్నారు. దీంతో పాటు చాలా చోట్ల ఇండ్లు నేలమట్టమయ్యాయి. దాదాపు రూ. 5 నుంచి 6 కోట్ల వరకు విలువైన రోడ్లు ధ్వంసమయ్యాయి. పంచాయతీ రాజ్‌, ఆర్‌ అండ్‌ బి శాఖల ఆధ్వర్యంలోని గ్రామీణ ప్రాంతాల రోడ్లే కాకుండా ప్రధానరోడ్లన్నీ వర్షం కారణంగా కొట్టుకుపోయాయి. అలాగే పలుచోట్ల నిర్మాణంలో ఉన్న కల్వర్టులు సైతం తేగిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. 

అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం

స్వర్ణప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని విడుదల చేసే విషయంలో అన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నాం. ఎగువప్రాంతం నుంచి భారీగా వరద నీటిప్రవాహం రావడంతో పాటు దాదాపు 24 సెంటీమీటర్ల మేరకు స్థానికంగా వర్షాలు ఏకధాటిగా కురియడంతోనే ఇలాంటి పరిస్థితి తలెత్తింది. ఎప్పటికప్పుడు మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ఆలీఫారూఖీల ఆదేశాలను పాటించి యుద్దప్రతిపాదికన చర్యలు చేపట్టాం. ప్రస్తుత ప్రాజెక్టు సామర్థ్యం 16 సెంటీమీటర్ల వర్షపాతానికి అనుగుణంగా ఉంది. కాని జిల్లాలో కురిసిన వర్షపాతం 24 సెంటీమీటర్లకు పైగా ఉండడంతో వరద ఉధృతి పెరిగింది. గేట్లకు మరమత్తులు ఎప్పటికప్పుడు చేపట్టని కారణంగా నీటి విడుదలలో జాప్యం జరిగింది. మరమత్తుల కోసం సర్కారుకు ప్రతిపాదనలు పంపినప్పటికీ నిధులు మంజూరు కాలేదు. 


Follow Us on: