బై..ఫాస్ట్‌..!

ABN , First Publish Date - 2022-05-22T06:18:22+05:30 IST

బై..ఫాస్ట్‌..!

బై..ఫాస్ట్‌..!

వేగంగా విజయవాడ పశ్చిమ బైపాస్‌ పనులు 

ప్యాకేజీ 3లో చిన అవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు..

50 శాతం పనులు పూర్తి.. వంతెనలపై దృష్టి

మరో తొమ్మిది నెలల్లో అందుబాటులోకి..


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ పశ్చిమ బైపాస్‌ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ప్యాకేజీ-3లో చిన అవుటపల్లి నుంచి గొల్లపూడి వరకూ జరుగుతున్న ఆరు వరుసల బైపాస్‌ నిర్మాణ పనులు 50 శాతం మేర పూర్తయ్యాయి. మిగిలిన 50 శాతం పనులు మరో తొమ్మిది నెలల్లో పూర్తి కానున్నాయి. ప్రధానమైన పనులు దాదాపు మొదటి 50 శాతంలోనే  ఉండటం వల్ల రెండో 50 శాతం పనులు వేగంగా చేపట్టాలన్నది కాంట్రాక్టు సంస్థ మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) ఆలోచన. ఎట్టి పరిస్థితుల్లో 2023, జనవరికి ప్యాకేజీ-3 పనులు పూర్తి చేయాలన్నది ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. చిన అవుటపల్లి నుంచి గొల్లపూడి (ఎన్‌హెచ్‌-65) వరకు 30 కిలోమీటర్ల నిడివిలో ఆరు వరుసల ఈ రహదారి పనులను ఐదంచెల్లో ప్రారంభించారు. చిన అవుటపల్లి పిన్నమనేని హాస్పిటల్‌ ఎదురుగా, 16వ నెంబర్‌ జాతీయ రహదారికి అనుసంధానంగా ఒకచోట, బీబీ గూడెం దగ్గర మరోచోట, కొండపావులూరు, నున్న దగ్గర ఇంకోచోట, గొల్లపూడి నుంచి నున్న వైపు.. ఇలా ఐదంచెల్లో సమాంతరంగా పనులు చేపట్టారు. రోడ్డుకు సంబంధించిన పనులు ఇప్పటికే 70 శాతం మేర పూర్తయ్యాయి. బ్రిడ్జిలు, ఆర్‌వోబీలు, ఫ్లైఓవర్ల పనులే మిగిలాయి. ఇవి కూడా పిల్లర్లు లేచి గడ్డర్లు వేయటానికి సిద్ధమయ్యాయి. 

ఇక ఫ్లై ఓవర్లపై దృష్టి

కాంట్రాక్టు సంస్థ రోడ్డు పనులపై ఎక్కువ దృష్టి పెట్టింది. సమాంతరంగా బ్రిడ్జిలు, ఫ్లై ఓవర్ల పనులు చేపట్టింది. అయితే, రోడ్డు పోర్షన్‌ పనులు 70 శాతం మేర పూర్తయ్యాయి. ఆరు వరుసలు నిర్మించటంతో పాటు మధ్యలో సెంట్రల్‌ డివైడర్‌గా ఐరన్‌ క్రాష్‌ బ్యారియర్‌ పనులు చేపట్టారు. రోడ్డు వెంబడి బ్రిడ్జిలు, ఫ్లై ఓవర్లు వచ్చిన చోట సర్వీసు రోడ్డును దాదాపు 22 కిలోమీటర్ల మేర చేపట్టారు. ఇంకా వీటికి బీటీ పూర్తి కాలేదు. బ్రిడ్జిలు, ఫ్లై ఓవర్లు పూర్తయితే తప్ప బీటీ పనులు చేపట్టలేని పరిస్థితి. గొల్లపూడి, మర్లపాలెం దగ్గర రెండు ఫ్లైఓవర్లకు భూ ఉపరితల పిల్లర్ల నిర్మాణం పూర్తయింది. అలాగే, చిన అవుటపల్లి, బీబీ గూడెం వద్ద రెండు పెద్ద ఆర్‌వోబీల నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించి కూడా పిల్లర్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఇవికాకుండా మరో మూడు మేజర్‌ బ్రిడ్జిల నిర్మాణ పనులు పిల్లర్ల దశను దాటేశాయి. గ్రామాలకు వెళ్లే క్రాస్‌ రోడ్లు, పంటకాల్వలు వెళ్లేచోట మొత్తం 10 మైనర్‌ బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు. ఇవే పెద్దగా పురోగతిలో లేవు. ఈ పది బ్రిడ్జి పనులు చాలా కీలకమైనవి. ఇవికాకుండా కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లు, మినీ వ్యాన్లు వంటివి రాకపోకలు సాగించటానికి వీలుగా మొత్తం 11 లైట్‌ వెహి కల్‌ అండర్‌ పాస్‌ (ఎల్‌వీయూపీ) పనులు కూడా చేపట్టారు. 

కాజ-గుండుగొలను రోడ్డు పనుల్లో పురోగతి

కాజ-గుండుగొలను రోడ్డు ప్రాజెక్టులో భాగంగా విజయవాడ పశ్చిమ బైపాస్‌ పనులు అత్యంత కీలకం. బైపాస్‌కు సంబంధించి ప్యాకేజీ 3, 4 పనులు జరుగుతున్నాయి. 3లో భాగంగా 30 కిలోమీటర్ల మేర ఆరు వరుసల పనులను చేపడుతున్నారు. ప్యాకేజీ 4లో 18 కిలోమీటర్ల మేర కృష్ణానదిలో ఆరు వరుసల బ్రిడ్జి, కాజ వరకు ఆరు వరుసల రహదారి పనులను నవయుగ-అదానీ జాయింట్‌ వెంచర్‌గా పనులు చేపడుతోంది. ఈ రెండు పనులు మరో ఏడాదిలో అందుబాటులోకి వస్తే విజయవాడ పశ్చిమ బైపాస్‌ అందుబాటులోకి వచ్చేస్తోంది. కాజ-గుండుగొలను రోడ్డు ప్రాజెక్టు మొత్తం పూర్తి కావాలంటే ప్యాకేజీ-1 పనులు కూడా పూర్తికావాలి. గుండుగొలను నుంచి కలపర్రు వరకు వరాహ ఇన్‌ఫ్రా సంస్థ పనులను చేపడుతోంది. ఈ మొత్తం ప్రాజెక్టులో అన్నింటి కంటే శరవేగంగా పూర్తయినది మాత్రం ప్యాకేజీ 2 పనులే. కలపర్రు నుంచి చిన అవుటపల్లి, హనుమాన్‌ జంక్షన్‌ ఆరు కిలోమీటర్ల బైపాస్‌ పనులు కలిపి మొత్తం 27 కిలోమీటర్ల మేర ఆరు వరుసల విస్తరణ పనులు పూర్తయ్యాయి. ప్యాకేజీ 1, 3, 4 పనులు ఏడాది కాలంలోనే అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. 

Updated Date - 2022-05-22T06:18:22+05:30 IST