నత్తనడకన ఈక్రాప్‌

ABN , First Publish Date - 2021-07-28T05:11:49+05:30 IST

వ్యవసాయ శాఖ కొత్తగా తీసుకొచ్చిన యాప్‌లో ఈక్రాప్‌ నమోదుకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. గత ఏడాది అవాంతరాలను అధిగమించేందుకు సరికొత్తగా యూడీపీ (యూనీఫైడ్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫాం) యాప్‌ను రూపొందించారు. ఇది కూడా సిబ్బందికి చుక్కలు చూపిస్తోంది.

నత్తనడకన ఈక్రాప్‌
ఈక్రాప్‌ నమోదులో ఎదురవుతున్న సమస్యలపై ఉన్నతాధికార్లకు వినతిపత్రం అందజేస్తున్న రామభద్రపురం సిబ్బంది(ఫైల్‌)

యూడీపీ యాప్‌లో సక్రమంగా నమోదు కాని వివరాలు

మల్లగుల్లాలు పడుతున్న సచివాలయ సహాయకులు

(సాలూరు)

వ్యవసాయ శాఖ కొత్తగా తీసుకొచ్చిన యాప్‌లో ఈక్రాప్‌ నమోదుకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. గత ఏడాది అవాంతరాలను అధిగమించేందుకు సరికొత్తగా యూడీపీ (యూనీఫైడ్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫాం) యాప్‌ను రూపొందించారు. ఇది కూడా సిబ్బందికి చుక్కలు చూపిస్తోంది. వివరాలు సక్రమంగా నమోదు కావడం లేదు. దీంతో ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రభుత్వ పథకాలు, రాయితీలు పొందాలంటే ఈక్రాప్‌ తప్పనిసరి. గత ఏడాది ఈక్రాప్‌లో లోపాలు వెలుగుచూశాయి. పంటలు సాగు చేయకుండానే కొందరు రైతులు ప్రభుత్వ ఫలాలను పొందుతున్నారని గుర్తించిన అధికారులు నిబంధనలు కఠినతరం చేశారు. అయినా అక్రమాలను కట్టడి చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో ఈక్రాప్‌ను మరింత పకడ్బందీగా చేయాలని నిర్ణయించారు. రైతు తన పొలం వద్ద నిలుచున్న చిత్రం తీసి, క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించి నమోదుచేయాలి. అప్పుడే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయి. దీనిపై చాలామంది రైతులకు అవగాహన లేదు. ఫలితంగా పథకాలకు, ప్రభుత్వ సాయానికి దూరమవుతున్నారు. 

ఇబ్బందిని అధిగమిస్తామంటే..

గత ఏడాది ఈక్రాప్‌లో ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం సరికొత్తగా యూడీపీ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. వ్యవసాయ శాఖ అనుబంధ యాప్‌లను దీని పరిధిలోకి తెచ్చారు. సచివాలయాల్లో పనిచేసే వ్యవసాయ, ఉద్యానవన, సెరీకల్చర్‌ సహాయకులకు నమోదు బాధ్యతను ప్రభుత్వం అప్పగించింది. కానీ యాప్‌పై సరైన అవగాహన లేకపోవడం, రెవెన్యూ సిబ్బంది లేకపోవడంతో వివరాల నమోదులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో ఆధార్‌ నంబరు కానీ.. పట్టాదారు పాసుపుస్తకం కానీ.. నమోదు చేయగానే ఆ రైతు పూర్తి వివరాలు కనిపించేవి. రైతు ఫొటో తీసుకొని జియో టాగింగ్‌ చేసేవారు. కొత్తగా వచ్చిన యాప్‌తో అలా కుదరడం లేదు. ఖాతా నంబర్‌ నమోదు చేసేటప్పుడు ఆ రైతు వివరాలు రావడం లేదు. ఆ రైతు స్థానంలో పక్క జిల్లా రైతు వివరాలు ప్రత్యక్షమవుతున్నాయి. భూములు ఒక చోట రైతులు నివాసం మరో చోట ఉండడంతో సర్వే సిబ్బందికి చుక్కలు కనిపిస్తున్నాయి. రెవెన్యూ గ్రామాలు మారితే పట్టాదారు పాస్‌పుస్తకం క్రమ సంఖ్య మారిపోతోంది. దీంతో నమోదు ప్రక్రియలో ఎడతెగని జాప్యం జరుగుతోంది. గతంలో రోజుకు 70 నుంచి 90 సర్వే నంబర్లు నమోదు చేసేవారు. ప్రస్తుతం 15 నుంచి 25 సర్వే నంబర్లు కూడా చేయలేకపోతున్నారు. వివరాలు ఎక్కువగా నమోదు చేయాల్సి రావడంతో ట్యాబ్‌ 3-4 గంటలకే చార్జింగ్‌ అయిపోతోందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

ఇబ్బందులు వాస్తవమే

క్షేత్రస్థాయిలో ఈక్రాప్‌ నమోదు ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతుండడం వాస్తవమే. ప్రధానంగా జియోటాగింగ్‌ సమస్య ఎక్కువగా ఉంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. యాప్‌ను సరిదిద్దారు.  ఇకపై నమోదు ప్రక్రియ సులువు అవుతుంది.  

- ఎం.ఆశాదేవి, వ్యవసాయ శాఖ జేడీ, విజయనగరం. 




Updated Date - 2021-07-28T05:11:49+05:30 IST