పశువైద్యం..దయనీయం!

ABN , First Publish Date - 2022-09-23T04:50:40+05:30 IST

పశువైద్యం సంగతి ప్రభుత్వానికి పట్టడం లేదు.

పశువైద్యం..దయనీయం!

రోగం వస్తే కనీస చికిత్స కరువు
సూపర్‌స్పెషాలిటీ ఉన్నా అందని సేవలు
మందులు సరఫరా చేయని వైనం
పల్లెల్లో సక్రమంగా తెరచుకోని వైద్యశాలలు
రైతులకు నాటు వైద్యులే దిక్కు

 
పశువైద్యం సంగతి ప్రభుత్వానికి పట్టడం లేదు. అవసరమైన మందులు సరఫరా చేయడం లేదు. దీంతో మూగజీవాలకు నాటు వైద్యమే దిక్కవుతోంది. కర్నూలులో సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి ఉన్నా పశువులను ఇక్కడికి తీసుకొచ్చే పరిస్థితి లేదు. వైద్యులు పట్టణ జీవనానికి అలవాటు పడడంతో పల్లెల్లో ఉన్న వైద్యశాలలు సక్రమంగా పని చేయడం లేదు. అధిక శాతం ఆస్పత్రుల్లో కాంపౌడర్లే దిక్కవుతున్నారు. దీనికితోడు పశువుల ఆసుపత్రులకు ఏడాది నుంచి కరెంట్‌ బిల్లులు చెల్లించడం లేదు. దీంతో అత్యవసరమైన టీకాలు, మందులు నిల్వ చేసేందుకు ఫ్రిజ్‌లు ఉన్నా వాటిని వినియోగించుకోలేని పరిస్థితి.

కర్నూలు(అగ్రికల్చర్‌)

వారానికి రెండు రోజులే..

గ్రామాల్లోని పశువైద్యులు నెలంతా విధుల్లో ఉండాలి. కానీ తాము ఎలా పనిచేసినా ఎవరూ పట్టించుకోరనే ధీమాతో కొంతమంది వైద్యులు ఆస్పత్రుల్లోని వాచ్‌మెన్‌, కాంపౌండర్‌ల మీద బాధ్యతలు వదిలేసి ఎంచక్కా కర్నూలులో ప్రైవేటు వ్యాపారాలు చేసుకుంటున్నారు. వారానికి ఒకటి లేదా రెండు రోజులు ఆసుపత్రికి వచ్చి హాజరు పట్టికలో సంతకం పెట్టి ఒంటి గంటకే తిరుగుముఖం పడుతున్నారు. గ్రామాల్లో పశు వైద్యశాలలు సక్రమంగా తెరుచుకోవడం లేదని తెలిసినా ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండిపోవడంతో పశువైద్యులు ఆడిందే ఆటగా సాగుతోంది.

 సాధారణ మందులూ ఉండవు

పశువులకు ఏదైనా రోగం వస్తే సాధారణ మందులు కూడా ఆసుపత్రుల్లో ఉండటం లేదు. జిల్లాలో పశు వైద్యశాలలు, పాలిక్లినిక్‌లు, ఒక సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్‌, డిస్పెన్సరీలు, రూరల్‌ లైవ్‌స్టాక్‌ యూనిట్లు ఉన్నాయి. అధ్వాన స్థితిలో ఉన్న భవనాలు 50కి పైగానే ఉన్నాయి. ప్రతి మూడు నెలలకోసారి మందులు కేటాయిస్తున్నట్లు చెబుతున్నారేగాని వాస్తవంగా ఐదారు నెలలకోసారి సరఫరా చేస్తున్నారు. రాష్ట్రంలోని ఆసుపత్రిలన్నింటికీ ఏడాదికి (వ్యాక్సిన్‌ లేకుండా) మందులు తదితర వైద్య పరికరాల కోసం రూ.30 కోట్లు కేటాయిస్తున్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాలకు ఈ మొత్తం ఏ మూలకూ సరిపోవడం లేదు.

 రేబిస్‌ వ్యాక్సిన్‌దీ అదే పరిస్థితి..

గతంలో సీజన్‌కు అనుగుణంగా మందుల సరఫరా ఉండేది. మిగిలిన రోజుల్లో రైతులు కొనుక్కోవాల్సిందే. ఏపీఎల్‌డీఏ ద్వారా గ్రామాల్లో గౌరవ వేతనంపై పశువైద్యం చేస్తున్న గోపాలమిత్రలకు కొన్ని రకాల మందులు సరఫరా చేసేవారు. రెండేళ్ల నుంచి వాటిని సరఫరా చేయడం లేదు. పాము కాటుకు వాడే మందు, కుక్క కాటుకు ఉపయోగించే రేబిస్‌ నివారణ మందుల సరఫరా కూడా లేదు. వాటిని రైతు కొనుక్కోవాలంటే రూ.800 నుంచి రూ.1000 అవుతోంది. పశువులు నాము (పచ్చి గడ్డి) తింటే అనారోగ్యం పాలవుతాయి. వాటికి హైపో అనే మందు అత్యవసరమైనా అందుబాటులో లేదు. పశు సంవర్థక శాఖ దీనిని సరఫరా చేయడం లేదు. చిన్న చిన్న గాయాలకు అవసరమైన పౌడర్లను మాత్రం ఇస్తున్నారు. ఇంజక్షన్లను సరఫరా చేయడం లేదు. నొప్పులు, బి.కాంప్లెక్స్‌(ఆకలికి) యాంటిబయాటిక్స్‌ మందులను ఆసుపత్రులకు తెప్పించడం లేదు. వాటి ఖరీదెక్కువ. కనీసం వాటిని మూడు రోజులు వాడాలి.

ప్రైవేటు వైద్యమే దిక్కు..

గ్రామాల్లో పశువులు వ్యాధుల బారిన పడితే ప్రైవేటు వైద్యులే దిక్కవుతున్నారు. గతంలో వాచ్‌మెన్‌, కాంపౌండర్లు గ్రామాల్లోనే నివాసం ఉండేవారు. ప్రస్తుతం వారు పట్టణాల్లో ఉంటున్నారు. దీంతో ఆసుపత్రులు ఎప్పుడూ మూసే ఉంటున్నాయి. పశువులకు వచ్చే రోగాలకు రైతులు ఇప్పటికీ చెట్టు పసరు వంటి మూలికలను వాడుతున్నారు. అవి వికటిస్తే మాత్రం పశువులపై ఆశలు వదులు కోవాల్సిందేనని రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

మూలుగుతున్న కరెంట్‌ బిల్లులు..

గ్రామీణ ప్రాంతాల్లోని పశువుల ఆసుపత్రులకు ఏడాది నుంచి కరెంట్‌ బిలు ్లలు చెల్లించడం లేదు. దీంతో 70 శాతం ఆసుపత్రులకు విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. ఒక్కో ఆసుపత్రికి రూ.10 వేల నుంచి రూ.18 వేల వరకు విద్యుత్‌ బిల్లులు చెల్లించాల్సి ఉంది. దీంతో అత్యవసరమైన టీకాలు, మందులు నిల్వ చేసేందుకు ఫ్రిజ్‌లు ఉన్నా వాటిని వినియోగించుకోలేని పరిస్థితి. కొందరు వ్యాక్సిన్‌ చెడిపోతుందని బతిమిలాడి కరెంటు సరఫరాను కొనసాగించుకుంటున్నారు.

పేరుకు మాత్రమే సూపర్‌ స్పెషాలిటీ

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కర్నూలు నగరంలో రూ.2 కోట్లు ఖర్చు పెట్టి మూగజీవాలకు సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్‌ను నిర్మించారు. మూగజీవాలకు రోగం వస్తే ఇక్కడే ఉంచి పూర్తి స్థాయిలో వైద్యం అందించేలా ఆధునిక వసతులు కల్పించారు. ప్రసుత్తం ఇన్‌చార్జి వైద్యులతో మూగజీవాలకు వైద్యం అందిస్తున్నారు. సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి హోదా కల్పించినా వాహనాలు ఏర్పాటు చేయక పోవడంతో పశువులను తీసుకొచ్చే పరిస్థితి లేదు. దీనికితోడు మూగజీవాలకు వైద్యాన్ని అందించేందుకు పూర్తిస్థాయిలో వైద్యులు, సిబ్బందిని కేటాయించలేదు. వివిధ ప్రాంతాల్లోని డాక్టర్లు, సిబ్బందిని ఇక్కడ డిప్యుటేషన్‌పై నియమించారు. దీంతో పెంపుడు కుక్కలకు మాత్రమే ఆసుపత్రి పరిమితమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
 
వైద్యం అందించేలా చర్యలు

జిల్లాలోని చాలా చోట్ల సిబ్బంది తప్ప డాక్టర్లు విధులు నిర్వహించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇకపై అలా కుదరదు. సక్రమంగా ఆసుపత్రుల్లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. నిర్లక్ష్యం చూపే వారిపై వేటు వేసేందుకు వెనుకాడబోం.                 

 - జేడీ రామచంద్రయ్య

Updated Date - 2022-09-23T04:50:40+05:30 IST