రైతు సేవలో 17 వసంతాలు

ABN , First Publish Date - 2022-07-06T06:38:51+05:30 IST

తిరుపతి కేంద్రంగా 2005 జూలై 15న శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఏర్పాటైంది.

రైతు సేవలో 17 వసంతాలు

రేపు వెటర్నరీ వర్సిటీ 11వ స్నాతకోత్సవం


తిరుపతి(విద్య), జూలై 5: తిరుపతి కేంద్రంగా 2005 జూలై 15న శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఏర్పాటైంది. అప్పటినుంచి 17 వసంతాలుగా రైతుసేవలో తరిస్తోంది. ఉమ్మడి ఏపీలో మొదటి వెటర్నరీ కళాశాల 1946లో హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో, రెండో కళాశాల 1955లో బాపట్లలో ఏర్పాటు చేశారు. తర్వాత కాలంలో బాపట్లలోని కళాశాలను తిరుపతికి బదిలీ చేసి.. ఎస్వీ వెటర్నరీ కళాశాలగా ఏర్పాటు చేశారు. అప్పటివరకు ఈ కళాశాల ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీకి అనుబంధంగా ఉండేది. 2004 సెప్టెంబరు 30న నిర్వహించిన కళాశాల స్వర్ణోత్సవాల ప్రారంభానికి వచ్చిన అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి.. శ్రీవేంకటేశ్వర వెటర్నరీ వర్సిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 2005 మార్చి 4న కేబినెట్‌ ఆమోదం పొంది అదే నెల 30న ఎస్వీ వెటర్నరీ వర్సిటీ యాక్ట్‌-2005కి ఆమోదం లభించింది. రాష్ట్రంలో పాడిపరిశ్రమను వృద్ధి చేయడం, పాల ఉత్పత్తిని పెంపొందించడం, పశుగ్రాసాల, జంతుసంపద వృద్ధి వంటి లక్ష్యాలతో అదే ఏడాది జూలై15న వర్సిటీని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గురువారం 11వ స్నాతకోత్సవానికి సిద్ధమవుతోంది. 


అభివృద్ధి పథంలో వర్సిటీ


వర్సిటీ ఏర్పాటైన ఈ 17 ఏళ్లలో బోధన, పరిశోధన, విస్తరణ రంగాల్లో మరింత పురోభివృద్ధి సాధించింది. వర్సిటీకి అనుబంధంగా ప్రొద్దుటూరు, తిరుపతి, గన్నవరం, గరివిడిలలో వెటర్నరీ కళాశాలలు, తిరుపతిలో డెయిరీ టెక్నాలజీ కళాశాల నిర్వహిస్తున్నారు. గత ఏడాది వరకు నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఉన్న ఫిషరీ కళాశాల కూడా వర్సిటీకి అనుబంధంగా ఉండేది. ప్రత్యేకంగా ఫిషరీ యూనివర్సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ఇది వేరుపడింది. వర్సిటీ పరిధిలో తొమ్మిది పాలిటెక్నిక్‌ కాలేజీలుండగా.. తాజాగా ప్యాపిలి(కర్నూలు), సదుం (చిత్తూరు), ఆముదాలవలస (శ్రీకాకుళం)లో కొత్త పాలిటెక్నిక్‌ కళాశాలలను ఏర్పాటు చేశారు. వీటికితోడు వర్సిటీకి అనుబంధంగా 18 ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలు నడుస్తున్నాయి. వీటిలో చదివిన పలువురు విద్యార్థులు వీఏఎ్‌సలుగా గ్రామ సచివాలయాల్లో వెటర్నరీ అసిస్టెంట్లుగా సిర్థపడ్డారు. 


పరిశోధనల్లోనూ మేటి..


గొర్రెల్లో వచ్చే నీలి నాలుకవ్యాధి, కాలిపుండ్ల వ్యాధికి వర్సిటీలో వ్యాక్సినేషన్‌ రూపొందించారు. వర్సిటీలోని రాష్ట్రస్థాయి పశువ్యాధినిర్ధారణ కేంద్రం(ఎ్‌సఎల్‌డీసీ) దేశంలో ప్రప్రథమంగా ఈ వ్యాక్సిన్‌ రూపొందించడం గమనార్హం. ఈ వ్యాక్సిన్‌ను రైతులకు విస్తృత స్థాయిలో తక్కువ ధరకు అందించేందుకు హైదరాబాద్‌కు చెందిన ఇండియన్‌ ఇమ్యునో లాజికల్‌(ఐఐఎల్‌) సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. 

పిండమార్పిడి, కృత్రిమ గర్భధారణ ద్వారా మేలుజాతి పశువులు ఉత్పత్తి చేశారు. దేశీయ పందిజాతితో విదేశీ పందులను సంకరణం జరిపారు. 23 ఏళ్ల తర్వాత 30శాతం స్వదేశీ లక్షణాలు, 70శాతం విదేశీ లక్షణాలు కలిగిన టీ-17 అనే కొత్తరకం పంది జాతిని ఉత్పత్తి చేశారు. 

దేశీయ గోజాతులైన పుంగనూరు, ఒంగోలు, సాహివాల్‌, గిర్‌, కాంక్రోజ్‌లపై పరిశోధనలు చేస్తున్నారు. 

దేశీయ గోవుపాల ఉత్పత్తి పెంచేందుకు వెటర్నరీ వర్సిటీతో టీటీడీ ఎంవోయూ చేసుకుంది. పిండమార్పిడి సాంకేతిక పద్ధతి ద్వారా దేశీయ ఆవుల ఉత్పత్తి పెంచడంతోపాటు ఒక ఆవు రోజుకి 10లీటర్ల పాలు ఇచ్చేలా రూపొందించనున్నారు. వర్సిటీ ప్రయోగశాలలో నాణ్యమైన దేశీయ ఆవుల అండాలను సేకరించి.. వాటిని పిండాలుగా ప్రయోగశాలలో అభివృద్ధి చేస్తారు. ఈపిండాలను సరోగసి పద్ధతిలో గోశాలలోని ఆవుల గర్భంలో ప్రవేశపెట్టి దూడలను ఉత్పత్తి చేశారు. 

థ్రాక్స్‌పై పరిశోధనలు చేసేందుకు రెండు ప్రతిష్టాత్మక పరిశోధనా ప్రాజెక్టులు మంజూరయ్యాయి. ఈవ్యాధికి సంబంధించి మనుషులు, జంతువులపై పరిశోధించేందుకు అమెరికాలోని పెన్సిలేనియా వర్సిటీ రూ.2.07కోట్ల పరిశోధనా ప్రాజెక్ట్‌ మంజూరు చేయగా.. ఈవ్యాధిని ప్రాథమిక దశల్లో గుర్తించేందుకు ర్యాపిడ్‌ కిట్ల తయారీకి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ(డీబీటీ) రూ.0.77కోట్ల ప్రాజెక్టును మంజూరు చేసింది. 

విస్తరణ విభాగంలో రైతులకు పశుగ్రాసాలు, దాణా అభివృద్ధితోపాటు వర్సిటీలో రూపొందించిన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరువ చేస్తున్నారు. 

కోళ్ల రంగానికి సంబంధించి రాజశ్రీ పెరటికోళ్ల పెంపకాన్ని అభివృద్ధి చేశారు. 

వర్సిటీలో చేపట్టిన విస్తరణ కార్యక్రమాల వల్ల గుంటూరులోని కేవీకేకు జాతీయస్థాయిలో రెండు అవార్డులు లభించాయి. 

వర్సిటీలో ప్రవేశపెట్టిన వెటర్నరీ అంబులెన్స్‌ సేవలు విజయవంతం కావడంతో దీన్ని ప్రభుత్వం రాష్ట్రమంతా విస్తరింపజేసింది. 

Updated Date - 2022-07-06T06:38:51+05:30 IST