వెయ్‌.. ముక్కెయ్‌!

ABN , First Publish Date - 2021-11-28T06:24:10+05:30 IST

పశ్చిమ ప్రాంతంలో పేకాట జోరుగా సాగుతోంది.

వెయ్‌.. ముక్కెయ్‌!

  1. పశ్చిమ ప్రాంతంలో పేకాట
  2. దాడులకు వెనుకాడుతున్న పోలీసులు
  3. అధికార పార్టీ నాయకులపై ఆరోపణలు


ఆదోని, నవంబరు 27: పశ్చిమ ప్రాంతంలో పేకాట జోరుగా సాగుతోంది. రహస్య స్థావరాల్లో నిత్యం రూ.లక్షల్లో పేకాట నడుస్తోంది. పట్టణ ప్రాంతాల్లో లాడ్జిలు, అపార్ట్‌మెంట్లలో జూదం నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పొలాలు, కోళ్ల ఫారాలు, పారిశ్రామిక భవనాలను పేకాట క్లబ్‌లుగా మార్చారు. తెలంగాణలో పేకాట కట్టడికి గట్టి చర్యలు తీసుకుంటున్నారని, దీంతో అక్కడ ఆడేందుకు వీలులేక పొరుగునే ఉన్న జిల్లాలోని పేకాట కేంద్రాలకు వస్తున్నారని సమాచారం. అడపాదడపా పోలీసులు  దాడులు నిర్వహిస్తున్నా ప్రయోజనం ఉండడం లేదు. 


సరిహద్దులో జోరు


ఆదోని, ఆలూరు ప్రాంతాలతోపాటు కర్ణాటక సరిహద్దుల్లో పేకాట నిర్వహిస్తున్నారు. ఏడాది క్రితం మంత్రి జయరాం స్వగ్రామం గుమ్మనూరు సమీపంలో పేకాట క్లబ్‌లపై పోలీసులు దాడులు నిర్వహించారు. పెద్దఎత్తున డబ్బులు, పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని జీర్ణించుకోలేని పేకాటరాయుళ్లు అధికారులపై దాడికి యత్నించారు. ఓ ముఖ్య ప్రజాప్రతినిధికి వరసకు సోదరుడయ్యే వ్యక్తిని ఈ కేసులో అరెస్టు చేశారు. ఆయనే పేకాట స్థావరం ఏర్పాటు చేశారని.. కర్నూలు, అనంతపురం, బళ్లారి జిల్లాల నుంచి పలువురు ముఖ్య నాయకులు ఇక్కడికి వచ్చేవారని పోలీసులు నిర్ధారించారు. 


కొన్ని ఘటనలు


 ఈ ఏడాది ఆగస్టు 29న దేవరగట్టు మాళమల్లేశ్వరస్వామి ఆలయ మాజీ ధర్మకర్త తిమ్మారెడ్డిపై కొందరు దాడి చేశారు. ఆదోని తిరుమలనగర్‌ కాలనీలో ఆయన  ఇంటికి నలుగురు వెళ్లారు. ఇంట్లోనే పేకాట ఆడుదామని పట్టుబట్టారు. కుదరదని చెప్పడంతో రాడ్‌తో దాడి చేశారు. ఇప్పటికీ ఆయన చికిత్స పొందుతున్నారు. ఆదోని త్రీటౌన్‌ పోలీసులు ఆ నలుగురిపై కేసు నమోదు చేశారు. 

గత ఏడాది ఏప్రిల్‌ 26న ఆదోని డీఎస్పీ ఆఫీసు సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఎనిమిది మందిని అరెస్టు చేశారు. రూ.4.21 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో జనసేన పార్టీ ముఖ్య నాయకుడు  ఒకరు ఉన్నారు. 

చిప్పగిరి మండలం గుమ్మనూరులో 2020 ఆగస్టు 27న సెబ్‌ అడిషినల్‌ ఎస్పీ గౌతమిశాలి ఆధ్వర్యంలో పేకాట క్లబ్‌పై దాడులు నిర్వహించారు. రూ.5.34 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అధికార పార్టీ చిప్పగిరి మండల కన్వీనర్‌ నారాయణతోపాటు 33 మందిపై కేసులు నమోదు చేశారు. 

ఆలూరు, మొలగవల్లిలో ఈ ఏడాది జూన్‌ 15న పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించారు. 10 మందిని అరెస్టు చేసి రూ.25 వేలు స్వాధీనం చేసుకున్నారు. 

హొళగుంద మండలంలో 2020 ఆగస్టు 7న ఎల్లార్తి దర్గా వెనుక వైపు పేకాట ఆడుతున్న 23 మందిని ఏఎస్సీ గౌతమి శాలి ఆధ్వర్యంలో సెబ్‌ పోలీసులు దాడులు చేసి అరెస్టు చేశారు. రూ.25,390 నగదు, 10 బైకులను స్వాధీనం చేసుకున్నారు. 

2019 అక్టోబరు 13న ఆదోని మార్కెట్‌ యార్డులో పేకాట స్థావరంపై వన్‌టౌన్‌ సీఐ చంద్రశేఖర్‌ దాడులు నిర్వహించారు. పెద్దఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2021-11-28T06:24:10+05:30 IST