ఉపరాష్ట్రపతి గురుభక్తి

ABN , First Publish Date - 2021-10-13T06:23:58+05:30 IST

నేడు హైదరాబాద్‍ లోని డా.దేవులపల్లి కళామందిరం, తెలంగాణ సారస్వత పరిషత్ ప్రాంగణంలో పోలూరి హనుమజ్జానకీరామశర్మ పురస్కారాన్ని ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య స్వీకరిస్తారు. ఈ పురస్కారాన్ని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రదానం చేస్తారు. ఈ సందర్భంగా ఈ పురస్కార స్థాపన గురించి చెప్పుకోవాలి. ఈ పురస్కారం ఉపరాష్ట్రపతి ..

ఉపరాష్ట్రపతి గురుభక్తి

నేడు హైదరాబాద్‍ లోని డా.దేవులపల్లి కళామందిరం, తెలంగాణ సారస్వత పరిషత్ ప్రాంగణంలో పోలూరి హనుమజ్జానకీరామశర్మ పురస్కారాన్ని ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య స్వీకరిస్తారు. ఈ పురస్కారాన్ని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రదానం చేస్తారు. ఈ సందర్భంగా ఈ పురస్కార స్థాపన గురించి చెప్పుకోవాలి. ఈ పురస్కారం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి చదువు నేర్పిన గురువుల్లో ఒకరైన స్వర్గీయ పోలూరి హనుమజ్జానకీరామశర్మ పేరిట నెలకొల్పబడింది. హనుమజ్జానకీరామశర్మ నెల్లూరు వీఆర్ కళాశాల తెలుగు శాఖాధిపతిగా పని చేశారు. పదవీ విరమణ అనంతరం కుర్తాళం శ్రీ సిద్దేశ్వర పీఠం భాషా ప్రవక్తగా నియమితులయ్యారు. ఎన్నో గ్రంథాలను రచించి వేలమంది పండితులను తీర్చిదిద్దారు.


గత ఏడాది సారస్వత పరిషత్ నిర్వహించిన ఒక సదస్సులో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. సభానంతరం పరిషత్ భవనాలు, ఇతర అవసరాలకు ఆయన ఒక నెల జీతం ఐదు లక్షల రూపాయల్ని విరాళంగా ప్రకటించారు. ఇది జరిగిన తర్వాత పరిషత్ వాళ్లు ఉప రాష్ట్రపతి ముందు ఒక ప్రతిపాదన ఉంచారు. మరో లక్ష రూపాయలు ఇవ్వగలిగితే మొత్తం ఆరు లక్షలను మూలధనంగా బ్యాంకులో జమ చేసి వచ్చే వడ్డీతో ఏటా ఒక పండితుడికి నగదు పురస్కారంతోపాటు వెంకయ్య నాయుడు తల్లిదండ్రుల పేరిట పురస్కారాన్ని అందజేస్తామన్నారు. దీనికి ఉపరాష్ట్రపతి అంగీకరిస్తూనే, తనకు వీఆర్ కాలేజీలో తెలుగు భాష మీద మక్కువ కలిగించిన గురువు హనుమజ్జానకీ రామశర్మ పేరుతో పురస్కారాన్ని ప్రదానం చేయాలని సూచించారు. గతంలో కూడా హనుమజ్జానకీరామశర్మ పేరున సావనీర్ వేయాలని వీఆర్సీలో చదువుకున్న శిష్యులు కోరగానే వెంకయ్య రూ.50వేలు ఇవ్వడమేగాక హైదరాబాదు స్వర్ణ భారత్ ట్రస్టులో దానిని ఆవిష్కరించి పోలూరిగారి ధర్మపత్నిని ఆ సభలో సన్మానించారు. ఇలా భారత ఉపరాష్ట్రపతి గురుభక్తి ప్రేరితంగా మొదలైన ఈ పోలూరి హనుమజ్జానకీరామశర్మ పురస్కారాన్ని తెలంగాణ సారస్వత పరిషత్ ఏటా ఒక పండితుడికి ప్రదానం చేయనుంది.

ఈతకోట సుబ్బారావు, నెల్లూరు

Updated Date - 2021-10-13T06:23:58+05:30 IST