బైడెన్ ప్రమాణస్వీకారానికి పెన్స్

ABN , First Publish Date - 2021-01-10T17:48:56+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాకు 46వ అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ఈ నెల 20న ప్రమాణస్వీకారం చేయనున్నారు.

బైడెన్ ప్రమాణస్వీకారానికి పెన్స్

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాకు 46వ అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ఈ నెల 20న ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే, ఈ కార్యక్రమానికి రానని ఇప్పటికే ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగా.. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ మాత్రం హాజరుకానున్నారని సమాచారం. వైట్‌హౌస్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ బైడెన్ ఆహ్వానం కోసం పెన్స్ ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. అటు బైడెన్ సైతం పెన్స్ రావాలని కోరుకోవడంతో పాటు ఆయన రాకను గౌరవంగా భావిస్తానని ప్రకటించారు. కాగా, నవంబర్ 3న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపిస్తున్న ట్రంప్.. ఈనెల 20న జో బైడెన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యేది లేదని ప్రకటించిన విషయం తెలిసిందే.


'చాలా మంది 20వ తేదీన జరిగే బైడెన్ ప్రమాణస్వీకారోత్సవం గురించి అడుగుతున్నారు.. నేను దానికి వెళ్లడం లేదు' అని సోషల్ మీడియా ద్వారా ట్రంప్ స్పష్టం చేశారు. ఇక దీనిపై స్పందించిన జో బైడెన్.. ట్రంప్ నిర్ణయాన్ని స్వాగతించారు. ట్రంప్ ఓ మంచి నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్న బైడెన్.. ఆయన రాకపోవడమే మంచిది అని అన్నారు. అయితే, వైస్ ప్రెసిడెంట్ పెన్స్ వస్తే మాత్రం ఆయన రాకను గౌరవంగా భావిస్తానన్నారు. అటు పెన్స్ కూడా బైడెన్ ఆహ్వానం కోసం ఎదురుచూస్తున్నట్లు తేలిసింది. దీంతో బైడెన్ ప్రమాణస్వీకారానికి పెన్స్ వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలాఉంటే.. ఆండ్రూ జాన్సన్ తర్వాత ఇలా అధ్యక్షుడి ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకాని రెండో అధ్యక్షుడిగా ట్రంప్ నిలవనున్నారు. ఇక కేపిటల్ భవనంపై దాడి ఘటన అనంతరం తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో ట్రంప్ దారికొచ్చారు. అధికార మార్పిడికి సహకరిస్తానని అంగీకరించారు. దీంతో పరోక్షంగా ట్రంప్ తన ఓటమిని ఒప్పుకున్నట్లైంది.   

Updated Date - 2021-01-10T17:48:56+05:30 IST