ltrScrptTheme3

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి ప్రచురణను ఆవిష్కరించిన భారత ఉపరాష్ట్రపతి

Oct 25 2021 @ 20:02PM

సింగపూర్: భారత ఉపరాష్ట్రపతి గౌ. ముప్పవరపు వెంకయ్య నాయుడు వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థ ప్రచురించిన 100వ తెలుగు గ్రంధాన్ని సోమవారం లాంఛనప్రాయంగా ఆవిష్కరించారు. న్యూఢిల్లీలో ఆయన అధికారిక భవనంలో అంతర్జాల వేదిక ద్వారా ఈ కార్యక్రమం జరిగింది.  ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా తెలుగు సాహిత్య పునరుజ్జీవం జరగాల్సిన అవసరం ఉందని, భాష-సంస్కృతుల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ చొరవ తీసుకోవాలని గౌరవ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. 2020 అక్టోబర్‌లో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, శ్రీ సాంస్కృతిక కళా సారధి – సింగపూర్, తెలుగు మల్లి – ఆస్ట్రేలియా, ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తెలుగు సమాఖ్య - యునైటెడ్ కి౦గ్ డమ్, దక్షిణ ఆఫ్రికా తెలుగు సాహిత్య వేదిక - జొహానెస్ బర్గ్ వారు సంయుక్తంగా నిర్వహించిన 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులోని అంశాలను  “సభావిశేష సంచిక” పుస్తక రూపంలో తీసుకొచ్చారు. సాహితీ సదస్సును, పుస్తకాన్ని ప్రముఖ గాయకుడు శ్రీ ఎస్పీ బాలుకి అంకితం చేయడం పట్ల అభినందనలు వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, 27 ఏళ్ళుగా తెలుగు భాషా సదస్సులు నిర్వహిస్తున్న వంగూరి ఫౌండేషన్ చేస్తున్న కృషి ముదావహమని, 100 పుస్తకాలను ప్రచురించడం గొప్ప ప్రయత్నమని తెలిపారు. తెలుగు భాషా సంస్కృతుల కోసం తాను ప్రతి ఒక్కరి నుంచి ఇలాంటి చొరవను ఆకాంక్షిస్తున్నామని, తెలుగు భాష సంస్కృతులను ముందు తరాలకు తీసుకుపోయే ఏ అవకాశాన్ని వదులుకోరాదని సూచించారు.

అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతికత విజ్ఞానం భాషాభివృద్ధికి అనుకూలంగా ఎన్నో నూతన అవకాశాలను అందిస్తోందన్న ఉపరాష్ట్రపతి, వీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా భాషా సంస్కృతులను అభివృద్ధి చేసుకోగలమని తెలిపారు. భాషను మరచిపోయిన నాడు, మన సంస్కృతి కూడా దూరమౌతుందన్న ఆయన, మన ప్రాచీన సాహిత్యాన్ని  యువతకు చేరువ చేయాలని సూచించారు. తెలుగులో ఉన్న అనంతమైన సాహితీ సంపదను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకొచ్చే బాధ్యతను తెలుగు భాష కోసం కృషి చేస్తున్న సంస్థలు తలకెత్తుకోవాలన్న ఉపరాష్ట్రపతి, మన పదసంపదను సైతం ప్రతి ఒక్కరికీ చేరువ చేయాలన్నారు.

నిద్ర లేచింది మొదలు మనం వినియోగించే ఎన్నో పదాల్లో ఆంగ్లం కలసిపోతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, ఉన్న పదాలను సమర్థవంతంగా వాడుకోవడం, నూతన మార్పులకు అనుగుణంగా కొత్త తెలుగు పదాలను సృష్టించుకోవడం అవసరమని తెలిపారు. అంతర్జాల వేదికగా సాహిత్య, భాషాభివృద్ధికి కృషి చేస్తున్న సంస్థలను ఈ సందర్భంగా అభినందించిన ఆయన, ఈ పుస్తక సంపాదకులైన వంగూరి చిట్టెన్ రాజు, శాయి రాచకొండ, రాధిక మంగిపూడికి, రచయితలకు, ప్రచురణకర్తలకు పేరు పేరునా అభినందనలు తెలిపారు.

గతాన్ని నెమరువేసుకుంటూ, వర్తమానాన్ని విశ్లేషించుకుంటూ తెలుగు భాష భవిష్యత్తు కోసం ప్రణాళికలు రచిస్తున్న ఈ తరుణం లో తెలుగు భాష, సాహిత్యాల పట్ల అపారమైన ఆసక్తి, అనురక్తి ఉన్న గౌ. ఉపరాష్ట్రపతి చేతులమీదుగా తమ 100వ పుస్తకావిష్కరణ జరగడం తమ అదృష్టంగా భావిస్తూ, 1995 లో ప్రారంభ అయిన తమ పుస్తక ప్రచురణల పురోగతిని వంగూరి ఫౌండేషన ఆఫ్ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షులు వంగూరి చిట్టెన్ రాజు తమ స్వాగతోపన్యాసం లో క్లుప్తంగా వివరించారు. ఈ పుస్తకం తమ 100వ ప్రచురణగాను,  వంగూరి ఫౌండేషన్ గత 27 ఏళ్ళగా సాధించిన ప్రగతిని, సాహిత్య ప్రస్థానాన్ని పదిలపరిచిన వీడియో ప్రసారాన్ని గౌ. ఉపరాష్ట్ఱపతి ఎంతో ఆసక్తితో వీక్షించి, ప్రశంసించారు.


ఈ అవిష్కరణ మహోత్సవాన్ని రాధిక మంగిపూడి వ్యాఖ్యాతగా నిర్వహించారు. 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ప్రధాన నిర్వాహకులు రత్నకుమార్ కవుటూరు (సింగపూర్), రావు కొంచాడ (మెల్ బర్న్), వంశీ రామరాజు (హైదరాబాద్), జొన్నలగెడ్డ మూర్తి (ఇంగ్లండ్), శాయి రాచకొండ లతో సహా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు చెందిన ప్రవాసాంధ్రులు, తెలుగు భాషాభిమానులు, తెలుగు సాహితీవేత్తలు తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి దక్షిణ ఆఫ్రికాకు చెందిన ప్రధాన నిర్వాహకులు రాపోలు సీతారామరాజు వందన సమర్పణ చేశారు.

ఈ ఆవిష్కరణ మహోత్సవం తర్వాత జూమ్ వేదిక లో జరిగిన “సభా విశేష సంచిక” డయాస్పోరా తెలుగు కథానికి -15, వెనుతిరగని వెన్నెల (డా.కె.గీత) “వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేమి?( డా. చాగంటి కృష్ణకుమారి) గ్రంధాల పరిచయం, 7వ ప్రపంచ సాహితీ సదస్సు జ్ఞాపకాల రవళి కార్యక్రమం రెండు గంటలకి పైగా అంతర్జాలం లో విజయవంతంగా జరిగింది. ఈ వేదికలో ఆ సదస్సు ప్రధాన నిర్వాహకులు, పాల్గొన్న కొందరు వక్తలు, వేదిక నిర్వాహకులు మొదలైన వారు పాల్గొని తమ జ్ఞాపకాలను పంచుకున్నారు.

Follow Us on:

తాజా వార్తలుమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.