మార్పునకు సారథులు.. ఐఏఎస్‌లు

ABN , First Publish Date - 2020-08-08T09:18:33+05:30 IST

నవభారత నిర్మాణంలో మార్పునకు సారథులుగా సివిల్‌ సర్వీస్‌ అధికారుల పాత్ర కీలకమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.

మార్పునకు సారథులు.. ఐఏఎస్‌లు

  • సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలి
  • ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసలు

న్యూఢిల్లీ, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): నవభారత నిర్మాణంలో మార్పునకు సారథులుగా సివిల్‌ సర్వీస్‌ అధికారుల పాత్ర కీలకమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. శుక్రవారం లాల్‌బహదూర్‌ శాస్త్రి జాతీయ పరిపాలన అకాడమీలో రెండో దశ శిక్షణను ముగించుకున్న అధికారులనుద్దేశించి  ఆయన ప్రసంగించారు. సుపరిపాలన ద్వారానే ప్రజల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసినప్పుడే వాటికి సార్థకత చేకూరుతుందని అన్నారు. ‘నేర్చుకున్న అంశాలను చక్కగా అవతగం చేసుకొని ప్రజా శ్రేయస్సుకు పాటుపడండి. నిజాయితీ, క్రమశిక్షణ, సమయపాలన పాటిస్తూ బాధ్యతాయుతంగా పనిచేయండి.  పారదర్శక పాలనతో సమాజాభివృద్ధిలో భాగస్వాములు కండి. పేద-ధనిక, స్త్రీ-పురుష, గ్రామీణ -పట్టణ అంతరాలను తొలగించేలా చొరవ తీసుకోండి’’ అని సూచించారు. స్థానిక భాషలో పరిపాలన సాగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 


అన్నదాతలకు అభివందనాలు..

కరోనా విజృంభిస్తున్న కష్టకాలంలో అన్నదాతలు పోషిస్తున్న పాత్ర ఎంతో గొప్పదని వెంకయ్యనాయుడు ప్రశంసించారు. రైతుల అంకితభావం, చిత్తశుద్ధి కారణంగానే ఆహార భద్రతకు సమస్యల్లేకుండా గతం కంటే ఎక్కువ ఆహారధాన్యాల ఉత్పత్తి జరిగిందన్నారు. శుక్రవారం ఎంఎస్‌ స్వామినాథన్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన సైన్స్‌ ఫర్‌ రెజిలియంట్‌ ఫుడ్‌, న్యూట్రిషన్‌ అండ్‌ లైవ్లీహుడ్స్‌ అనే అంశంపై సదస్సును ఆయన ప్రారంభించారు. రైతులు చేసిన కృషికి తాను శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని, రైతుబిడ్డగా గర్విస్తున్నానని వెంకయ్య తెలిపారు. భారతీయ సంప్రదాయ వ్యవసాయ పరిజ్ఞానానికి ఆధునిక సాంకేతికత, శాస్త్ర పరిశోధనలు తోడైతే భారతదేశం మరింత పురోగమిస్తుందని చెప్పారు.

Updated Date - 2020-08-08T09:18:33+05:30 IST