రాజ్యాంగం, ఆత్మప్రబోధం మేరకు అధికారులు పనిచేయాలి–ఉపరాష్ట్రపతి

ABN , First Publish Date - 2022-04-21T22:58:44+05:30 IST

సివిల్ సర్వీసెస్ అధికారులు తమ శక్తిసామర్థ్యాలకు అనుగుణంగా పనిచేసే విషయంలో ఎదురవుతున్న అడ్డంకులపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.

రాజ్యాంగం, ఆత్మప్రబోధం మేరకు అధికారులు పనిచేయాలి–ఉపరాష్ట్రపతి

హైదరాబాద్: సివిల్ సర్వీసెస్ అధికారులు తమ శక్తిసామర్థ్యాలకు అనుగుణంగా పనిచేసే విషయంలో ఎదురవుతున్న అడ్డంకులపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులకు వారి పనితీరు ఆధారంగానే పదోన్నతులు లభించాలనే విషయంలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. గురువారం సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా హైదరాబాద్ లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా విచ్చేశారు. విధి నిర్వహణలో ఏమైనా అనుమానాలొస్తే రాజ్యాంగంతో పాటు ఆత్మప్రబోధం మేరకు పనిచేయాలని ఆయన సూచించారు.స్వాతంత్ర్యానంతర భారతదేశం పురోగతిలో సివిల్ సర్వీసెస్ అధికారులు గణనీయమైన పాత్రను పోషిస్తున్నారన్న ఉపరాష్ట్రపతి.. పేదరికం, లింగ వివక్షత, సాంఘిక వివక్షత, మూఢ నమ్మకాలు వంటి సామాజిక దురాచారాలను పూర్తిగా నిర్మూలించేందుకు భవిష్యత్ లోనూ విశేషమైన కృషి జరగాల్సిన అవసరం ఉందన్నారు. 


ఈ దిశగా సివిల్ సర్వీసెస్ అధికారులు ప్రత్యేకమైన దృష్టిసారించాలన్నారు. ఈ విషయంలో రాజకీయ సిద్ధాంతాలు, ఇతర కోణాల్లో కాకుండా నిజాయితీ, సత్యసంధతలకే కట్టుబడాలని సూచించారు.రాజకీయ నాయకులు, అధికారుల మధ్య అనైతిక సంబంధం విషయంలో వస్తున్న విమర్శలపైనా ఉపరాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ, సిద్ధాంత కోణంలో కాకుండా నైతికత ఆధారంగా లబ్ధిదారులకు మేలు చేయాలని ఉపరాష్ట్రపతి సూచించారు.కొన్ని రాష్ట్రాల్లో ప్రజలను ఆకట్టుకునేందుకు ఉచితాలను, ఆర్థిక పరిస్థితికి మించిన తాయిలాలను ఎన్నికల మేనిఫెస్టోల ప్రకటిస్తున్నారని ఇది రానున్న రోజుల్లో ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై పెను ప్రభావాన్నిచూపిస్తాయని ఆయన అన్నారు.దేశాభివృద్ధిలో సమర్థవంతమైన అధికారులు పోషించాల్సిన పాత్ర కీలకమన్న ఆయన.. రాజకీయాలకు అతీతంగా అధికారులు పనిచేయాలని సూచించారు. 


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించిన ‘రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ ఫార్మ్’ నినాదంతో ముందుకెళ్లాలన్నారు. సమాజంలోనున్న చివరి వ్యక్తికి వరకు సంక్షేమ పథకాలు వెళ్లాలన్న ప్రభుత్వ నినాదం ‘అంత్యోదయ’ను విజయంతంగా అమలుచేయాలన్నారు.వృత్తి జీవితంతో పాటు వ్యక్తిగత జీవితం మీద కూడా దృష్టి పెట్టాలని శిక్షణలో ఉన్న అధికారులకు సూచించిన ఉపరాష్ట్రపతి, మంచి ఆరోగ్య విధానాలను అవలంబించాలని సూచించారు. శారీరక ఆరోగ్యం ద్వారా మానసిక ఆరోగ్యం కూడా లభిస్తుందన్న ఆయన, ప్రతి రోజు కొంత సమయాన్ని యోగ సహా ఇతర వ్యాయామాలకు కేటాయించాలని సూచించారు. అనారోగ్యకరమైన కొంత మంది యువత ఆహారపు అలవాట్ల పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, మన వాతావరణ పరిస్థితులకు తగిన విధంగా పోషకాహారాన్ని తీసుకోవాలని, భారతీయ సంప్రదాయ ఆహారంలో పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంసీఆర్ హెచ్చార్డీ డైరెక్టర్ జనరల్ హర్పీత్ సింగ్, అదనపు డీజీ మహేశ్ దత్ ఎక్కా, సంయుక్త డీజీ అనితా రాజేంద్రన్, శిక్షణలో ఉన్నవివిధ సర్వీసుల అధికారులు, బోధన సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-04-21T22:58:44+05:30 IST