ప్రజాస్వామ్య పరిరక్షణలో మీడియా పాత్ర అత్యంత కీలకం: ఉపరాష్ట్రపతి

ABN , First Publish Date - 2022-03-07T01:39:31+05:30 IST

నాలుగో స్తంభంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రచార, ప్రసారమాధ్యమాలపై ఉందని, ప్రజాస్వామ్య దేశాల్లో మీడియా పాత్ర అత్యంత కీలకమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

ప్రజాస్వామ్య పరిరక్షణలో మీడియా పాత్ర అత్యంత కీలకం: ఉపరాష్ట్రపతి

హైదరాబాద్: నాలుగో స్తంభంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రచార, ప్రసారమాధ్యమాలపై ఉందని, ప్రజాస్వామ్య దేశాల్లో మీడియా పాత్ర అత్యంత కీలకమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వాలకు, ప్రజలకు మధ్య వారథిగా.. అటు సమస్యలను ఇటు, ఇక్కడి పరిష్కారాలను అటు చేరవేయడంలో పాత్రికేయులు పోషిస్తున్న, పోషించాల్సిన పాత్రను ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు.ఆదివారం హైదరాబాద్ లో ‘ ముట్నూరి కృష్ణారావు సంపాదకీయాలు’ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముందు ముట్నూరి కృష్ణారావు చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రచార, ప్రసార మాధ్యమాలపై ప్రజల్లోనూ ఎన్నో ఆశలు, అంచనాలు ఉంటాయని, చాలా విషయాలను తమకు అర్థమయ్యే రీతిలో పత్రికలు వివరిస్తాయనే ప్రజలు భావిస్తారని అందుకు అనుగుణంగా సమాజంలో మార్పులు తీసుకువచ్చేందుకు పత్రికలు కీలక భూమిక పోషించాలని ఆయన సూచించారు.


నిజాలను నిక్కచ్చిగా, వాస్తవాలకు తమ అభిప్రాయాలను జోడించకుండా ఉన్నదున్నట్లుగా చేరవేయడమే ఉత్తమ పాత్రికేయం అన్నఉపరాష్ట్రపతి, సంపాదకీయాల ద్వారా తమ భావాలను జోడిస్తూ.. మిగిలిన వార్తలను యథావిధిగా అందించాల్సిన అవసరం ఉందన్నారు. పత్రికలు సత్యానికి దగ్గరగా, సంచలనాలకు దూరంగా ఉండాలన్న ఆయన వార్తలు, వ్యక్తిగత అభిప్రాయాలు కలిపి ప్రచురించరాదని దిశానిర్దేశం చేశారు.  ప్రభుత్వ విధానాల్లో ఏవైనా లోపాలంటే వాటిని ఎత్తిచూపిస్తూ మార్పులను సూచించాల్సిన బాధ్యత కూడా మీడియాపై ఉందని.. అదే సమయంలో చిన్న చిన్న విషయాలను కూడా భూతద్దంలో చూపిస్తూ ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించడం సరికాదని పేర్కొన్నారు. 


ఈ సమాజంలో మనం కూడా భాగస్వాములమనే విషయాన్ని పాత్రికేయులు గుర్తుంచుకోవాలన్న ఉపరాష్ట్రపతి, మనం రాసే ఒక్కొక్క అక్షరం మన తోటి సమాజంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందనే విషయాన్ని బేరీజు వేయగలగాలని పాత్రికేయ మిత్రులకు సూచించారు. అక్షరంపై సంపూర్ణ సాధికారత ఉన్నవారే జర్నలిజం రంగంలో ప్రత్యేకతను చాటుకుంటారన్నారు. ఇందులో నాటి కృష్ణా పత్రిక సంపాదకులు ముట్నూరి కృష్ణారావు మొదటి వరసలో నిలుస్తారని ఉపరాష్ట్రపతి అన్నారు. 


ఈ సందర్భంగా తెలుగు పాత్రికేయ చరిత్రలో వ్యాసరచనకు నూతన ఒరవడి ప్రవేశపెట్టిన ముట్నూరి కృష్ణారావుకి ఉపరాష్ట్రపతి ఘనంగా నివాళులు అర్పించారు. పత్రికలు లేని ప్రజాస్వామ్యాన్ని ఊహించలేమని, మనిషి జీవిత విధానాన్ని, ఆలోచన క్రమాన్ని సరైన మార్గంలో పెట్టగల శక్తి పత్రికలకు ఉందని ఉపరాష్ట్రపతి అన్నారు. అయితే ఈ శక్తిని సద్వినియోగం చేసుకునే సామర్థ్యం కూడా పత్రికలకు ఉండాలన్నారు. వివక్షలకు వ్యతిరేకంగా, మనవైన సంప్రదాయాలను, ప్రకృతిని కాపాడుకోవలసిన అవసరాన్ని వివరిస్తూ కృష్ణారావు గారు రాసిన సంపాదకీయాలు నేటికీ స్ఫూర్తిని పంచుతాయని తెలిపారు.


స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రజలకు మార్గదర్శనం చేయడం, దేశవ్యాప్తంగా వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు కింది స్థాయి వరకు తెలియజేయడంలో పత్రికలు ఎంతగానో కృషిచేశాయన్న ఉపరాష్ట్రపతి, ముఖ్యంగా బ్రిటిషర్ల పాలనా కాలంలో యువతలో దేశభక్తిని నూరిపోసి, స్వరాజ్య కాంక్షను రేకెత్తించి జాతీయోద్యమం దిశగా ముందుకు నడిపించేందుకు కృషి చేసిన పత్రికల్లో తెలుగునాట కృష్ణా పత్రికకు ప్రత్యేక స్థానం ఉందన్నారు.దాదాపు 4 దశాబ్దాలపాటు కృష్ణా పత్రిక సంపాదకీయం ద్వారా  ముట్నూరి వారు ప్రవేశపెట్టిన ఒరవడే తర్వాతి తరం పాత్రికేయులకు మార్గదర్శనం చేసిందన్నారు. వారి నిరుపమానమైన దేశభక్తి, సమాజం కోసం ఏదో ఒకటి చేయాలన్న ఆకాంక్ష వెరసి వారిని పాత్రికేయ వృత్తివైపు నడిపించాయని ఉపరాష్ట్రపతి  గుర్తుచేశారు. 


మొండివారు అని పేరుగాంచిన వారి సంపాదకీయాలు అధ్యయన గ్రంథాలు అని చెప్పడం అతిశయోక్తి కాదని ఆయన అన్నారు.‘తెల్లవారిని తుపాకులతో కాల్చుట’ అన్న ముట్నూరి కృష్ణారావు  సంపాదకీయం గురించి మాట్లాడిన ఉపరాష్ట్రపతి, ఆ రోజుల్లో అలాంటి శీర్షిక పెట్టడమంటే దేశం కోసం ప్రాణాలను కూడా వదులుకునేందుకు వెనుకాడకపోవడమేననే విషయాన్ని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. దీంతోపాటుగా సుతిమెత్తగా, చురకలు అంటిస్తూ విమర్శించే ఓవిధమైన గడుసుదనం వారి రచనల్లో తొంగిచూసేదన్నారు. దీంతోపాటుగా ఆ రోజుల్లో కృష్ణా పత్రిక తెలుగు సాహిత్యానికి, కళలకు, తెలుగు నాట సాగిన జాతీయ ఉద్యమాలకు ఇచ్చిన చేయూత నిరుపమానమైనదన్నారు.కృష్ణారావు సంపాదకీయాల్ని సాంఘిక విషయాలు, సాంస్కృతిక విషయాలు, ఆర్ధిక విషయాలు, రాజకీయ విషయాలు ఇలా 9 విభాగాలుగా విభజించి వాటిని ఓ చక్కటి పుసక్త రూపంలో ముందుకు తీసుకొచ్చిన మరుమాముల దత్తాత్రేయ శర్మ ను ఉపరాష్ట్రపతి అభినందించారు. 


నేటి యువత, మరీ ముఖ్యంగా యువ పాత్రికేయులు ముట్నూరి సంపాదకీయాల పట్ల అవగాహన పెంచుకోవడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుందని పేర్కొన్నారు.కృష్ణారావు రాసిన సంపాదకీయాల్ని యువత ఆకళింపు చేసుకోవాలని, ప్రతి సంపాదకీయం వెనుక ఆయన దూరదృష్టిని అర్ధం చేసుకుంటూ పాత్రికేయ వృత్తిలో కృష్ణారావు పాటించిన విలువలు, సిద్ధాంత నిబద్ధత, దేశభక్తిని ఈతరం యువత అర్ధం చేసుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి,  శాంతా బయోటెక్ చైర్మన్ డా. వరప్రసాద్ రెడ్డి, రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపక చైర్మన్ తుమ్మల నరేంద్ర చౌదరి, సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, వల్లీశ్వర్, రచయిత దత్తాత్రేయ శర్మ, దర్శనం పత్రిక ఎడిటర్ ఎం.వి.ఆర్.శర్మ సహా పలువురు పాత్రికేయులు, పరిశోధక విద్యార్థులు  తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-07T01:39:31+05:30 IST