‘నారప్ప’ మూవీ రివ్యూ

Published: Tue, 20 Jul 2021 18:59:19 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నారప్ప మూవీ రివ్యూ

చిత్రం: నారప్ప

సెన్సార్‌ సర్టిఫికేట్‌: యు/ఎ

బ్యానర్స్: వి క్రియేషన్స్‌, సురేశ్‌ ప్రొడక్షన్స్‌

నటీనటులు: వెంకటేశ్‌, ప్రియమణి, కార్తీకరత్నం, రాజీవ్‌ కనకాల, అమ్ము అభిరామ్‌, నాజర్‌, రావు రమేశ్‌, బ్రహ్మాజీ, రాఖీ, చిత్ర తదితరులు

కథ: వెట్రిమారన్‌

సంగీతం: మణిశర్మ

సినిమాటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు

ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేశ్‌

నిర్మాతలు: కలైపులి ఎస్. థాను, డి.సురేశ్‌బాబు

స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల

విడుదల: అమెజాన్‌ ప్రైమ్‌

తేది: జూలై 20, 2021


రీమేక్ సినిమాలను తెరకెక్కించడానికేముంది? అనుకుంటే పొరపాటే.. మాతృకలోని ఆత్మను మిస్‌ కానీయకుండా మన ప్రేక్షకులకు తగ్గట్టు నెటివిటీలోకి మార్చి దాన్ని తెరకెక్కించడమనేది కత్తిమీదసామే. ఏమాత్రం పొరపాటు జరిగినా ప్రేక్షకులు మాతృకతో పోలిక చేస్తూ పెదవి విరిచే ప్రమాదం ఉంది. కానీ.. అలాంటి కత్తిమీద సామే చేశాడు దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల. ఇప్పటి వరకు ఆయ చేసిన సినిమాలు స్ట్రయిట్‌ తెలుగు సినిమాలే. కానీ తొలిసారి రీమేక్‌ సినిమాను తెరకెక్కించాడు. ధనుశ్‌, వెట్రిమారన్‌ కాంబినేషన్‌లో రూపొందిన తమిళ మూవీ 'అసురన్‌' చాలా పెద్ద విజయాన్ని సాధించింది. తెలుగులో అప్పుడెప్పుడో వెంకటేశ్‌తో ఘర్షణ సినిమా చేసిన కలైపులి ఎస్. థాను, మళ్లీ ఆయనతో సినిమా చేయడానికి ముందుకు వచ్చాడు. ఈసారి కలైపులి ఎస్. థానుకి తోడుగా టాలీవుడ్‌ అగ్ర నిర్మాతల్లో ఒకరైన డి. సురేశ్‌బాబు కూడా జత కలిశారు. డిజిటల్‌ మాధ్యమాల పుణ్యమాని ప్రపంచ సినిమాలను ప్రేక్షకులను ఎప్పటికప్పుడు వీక్షిస్తున్న ఈరోజుల్లో అసురన్ సినిమాను కూడా ఎక్కువ మంది తెలుగు ప్రేక్షకులు చూశారు. మరి వెంకటేశ్‌, శ్రీకాంత్ అడ్డాల అండ్ టీమ్‌ ‘నారప్ప’ పేరుతో చేసిన ఈ రీమేక్‌ ప్రయత్నం నేడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘నారప్ప’ ప్రయత్నం ఏ మేరకు సక్సెస్ అయ్యిందో తెలుసుకునే ముందు కథలోకి వెళదాం..


కథ:

తిరుపతికి దూరంగా ఉండే ఓ పల్లెటూరిలో ఉండే నారప్ప(వెంకటేశ్‌).. భార్య సుందరమ్మ(ప్రియమణి), కొడుకులు ముని కన్నా(కార్తీకరత్నం), చిన్నబ్బ(రాఖీ), కూతురు బుజ్జమ్మ(చిత్ర)లతో కలిసి తనకున్న మూడెకరాల భూమిని సాగు చేసుకుంటూ హాయిగా కాలం వెళ్లదీస్తుంటాడు. ఆ ఊరి మోతుబరి అయిన పండుసామి(ఆడుగలం నరేన్‌) సిమెంట్‌ ఫ్యాక్టరీ కట్టడానికి చుట్టు పక్కల భూమిని కొంటాడు. అందరూ భూములను ఇచ్చినా తన భూమిని ఇవ్వడానికి నారప్ప ఒప్పుకోడు. పండుసామి అప్పటి నుంచి నారప్ప భూమిని ఎలాగైనా ఆక్రమించుకోవాలని అనుకుంటూ ఉంటాడు. అదే సమయంలో జరిగే పొలం తగదాల్లో పండుసామి కుటుంబ సభ్యులకు, నారప్ప కుటుంబ సభ్యులకు గొడవ జరుగుతుంది. ఆ గొడవ పెద్దదవుతుంది. తండ్రిని అవమానించినందుకు పండుసామిని మునికన్నా కొడతాడు. దాన్ని జీర్ణించుకోలేని పండుసామి, ఆయన కొడుకులు కలిసి ముని కన్నాను హత్య చేస్తారు. అన్నను హత్య చేసినందుకు నారప్ప చిన్న కొడుకు చిన్నబ్బ.. పండుసామిని చంపేస్తాడు. దాంతో పండుసామి కుటుంబం నారప్ప కుటుంబాన్ని చంపాలని వెంబడిస్తుంది. నారప్ప తన భార్య, బిడ్డలతో కలిసి అడవిలోకి వెళతాడు. తర్వాత తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి నారప్ప ఏం చేస్తాడు?  ఎలాంటి పరిస్థితులను నారప్ప ఎదుర్కొన్నాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

ఇది వరకు చెప్పినట్లు రీమేక్‌ను చేయడం అంత సులువైన విషయం కాదు.. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని డైరెక్టర్‌ శ్రీకాంత్‌ అడ్డాల నారప్ప సినిమాను తెలుగు నెటివిటీకి తగ్గట్టు మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించాడు. ఎమోషన్స్‌ను చక్కగా పండించగల నటీనటులను తీసుకోవడంతో శ్రీకాంత్‌ అడ్డాల పని మరింత సులభమైందనే చెప్పాలి. విక్టరీ వెంకటేశ్‌ రెండు షేడ్స్‌లో కనిపించాడు. ఇద్దరు కొడుకులున్న తండ్రి పాత్ర ఒకటైతే, ఫ్లాష్‌ బ్యాక్‌లో వచ్చే యంగ్‌ లుక్ ఒకటి. యంగ్‌ లుక్‌ కంటే ఇద్దరు కొడుకులున్న తండ్రి పాత్రలో వెంకటేశ్‌ చక్కగా ఒదిగిపోయాడు. మధ్య వయస్కుడి లుక్‌ ధనుశ్‌ కంటే వెంకటేశ్‌కు బాగా నప్పింది. అయితే ఓ రకంగా ఇది ప్రేక్షకులకు థ్రిల్‌గా అనిపించదు. తమిళంలో ధనుశ్‌ అయితే యువకుడైనా మధ్య వయస్కుడిగా కనిపించడం, ఆ పాత్రలో ఒదిగిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ ఇక్కడ వెంకటేశ్‌ విషయంలో అలాంటి థ్రిల్‌ మిస్‌ అయ్యింది. యంగ్‌ లుక్‌లో వెంకీ జోడీగా నటించిన అమ్ము అభిరామి ఆయన పక్కన సూట్‌ కాలేదు. కథ పరంగా చూసుకుంటే కొత్త కథేం కాదు.. డబ్బున్నవాళ్లకి, పేదవాళ్లకి మధ్య జరిగే గొడవలు అనేదే. అయితే కథనం కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. కథంతా నారప్ప చుట్టూనే తిరుగుతుంది. వెంకటేశ్‌ తనకున్న సీనియారిటీతో వన్‌ మ్యాన్‌ షోగా సినిమాను అలా ముందుకు తీసుకెళ్లాడు. వెంకటేశ్‌ భార్య సుందరమ్మగా ప్రియమణి కూడా మెప్పించింది. ఇక రాజీవ్‌ కనకాల, నరేశ్‌, రావు రమేశ్‌, బ్రహ్మాజీ ఇలా అందరూ వారి పాత్రలను చక్కగా చేశారు. తమిళంలోని సన్నివేశాలను అలాగే చేసుకుంటూ వెళ్లిపోయాడు దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల. కొన్ని చోట్ల ఎమోషన్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇక సంగీత దర్శకుడు మణిశర్మ పాటలు పరవాలేదనిపించాయి. కానీ బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ బాగుంది. శ్యామ్‌ కె.నాయుడు సినిమాటోగ్రఫీ బాగుంది. అలాగే సన్నివేశాల పరంగా ‘భూమి ఉంటే తీసేసుకుంటారు, డబ్బు ఉంటే లాగేసుకుంటారు. కానీ, చదువును మాత్రం ఎవరూ తీసుకోలేరు’ అనేలా కొన్ని సందర్భోచిత సంభాషణలు ఆకట్టుకుంటాయి. ఎక్కువగా కమర్షియల్ సినిమాల జోరులో సినిమా స్పీడుకి అలవాటు పడ్డ సగటు తెలుగు ప్రేక్షకుడుకి సినిమా నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపిస్తుంది. సినిమాను వెంకటేశ్‌ ఎలా చేశాడనే కోణంలో ఓసారి చూడొచ్చు.

చివరగా.. ఓకే అనిపించే ‘నారప్ప’
రేటింగ్: 2.75/5

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International