Omicron : ఆస్పత్రుల్లో తగ్గిన OP.. పెరిగిన వీడియో కన్సల్టేషన్లు

ABN , First Publish Date - 2022-02-13T18:56:44+05:30 IST

ఒమైక్రాన్‌ తీవ్రత తగ్గింది. ఆస్పత్రులకు వచ్చే వారి తాకిడి కూడా తగ్గిపోయింది...

Omicron : ఆస్పత్రుల్లో తగ్గిన OP.. పెరిగిన వీడియో కన్సల్టేషన్లు

హైదరాబాద్‌ సిటీ : ఒమైక్రాన్‌ తీవ్రత తగ్గింది. ఆస్పత్రులకు వచ్చే వారి తాకిడి కూడా తగ్గిపోయింది. ఇంతకు ముందు రోజూ 50నుంచి 60  వరకు వచ్చిన ఓపీ కేసుల సంఖ్య ఇప్పుడు 20నుంచి 30కి తగ్గిపోయింది. ఇక అడ్మిషన్లు దాదాపు ఉండడం లేదని వైద్యులు పేర్కొంటున్నారు.  ఆస్పత్రికి వచ్చే కేసులలో కూడా ఎక్కువగా దీర్ఘవ్యాధులకు సంబంధించినవే ఉంటున్నట్లు వైద్యులు తెలిపారు. ఇందులో ఎక్కువ శాతం మందికి మైల్డ్‌ లక్షణాలు ఉంటుండడంతో వారిని హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా సూచిస్తున్నామని చెప్పారు.


ఐసీయూ అడ్మిషన్లు లేవు..

ఒమైక్రాన్‌ బాధితులలో కొందరికి హై ఫీవర్లు వస్తున్నాయని వైద్యులు చెప్పారు. మందులు ఇస్తే ఒకటి, రెండు రోజులలో జ్వరం తగ్గిపోతోందన్నారు. మరికొందరిలో ఒమైక్రాన్‌ లక్షణాలు గమనిస్తున్నామన్నారు. ఐసీయూల్లో చేరుతున్న వారి సంఖ్య పెద్దగా ఉండడం లేదు. సాధారణ వార్డుల్లో ఐదునుంచి ఆరుగురు మాత్రమే ఉంటున్నారని వైద్యులు పేర్కొంటున్నారు.


వీడియో, ఫోన్‌ కన్సల్టేషన్స్‌ ద్వారానే..

ప్రస్తుతం వీడియో కౌన్సెలింగ్‌, ఫోన్‌ ద్వారా సంప్రందించే కేసులు పెరిగాయి. ఆస్పత్రికి రావడం కాస్త తగ్గింది. రోజుకు ఒకటి రెండు, అడ్మిషన్లు ఉంటున్నాయి. ప్రస్తుతం రోజుకు పది మందికి మించి కొవిడ్‌ బాధితులు వీడియో, ఫోన్‌ ద్వారా కన్సల్టేషన్‌ తీసుకుంటున్నారు. సలహాలు, సూచించిన మందులు తీసుకుంటున్నారు. ఎవరికైనా అవసరం అయితే రక్త పరీక్షలు చేయిస్తున్నాం. -డాక్టర్‌ రాహుల్‌ అగర్వాల్‌, సీనియర్‌ జనరల్‌ ఫిజీషియన్‌, కేర్‌ ఆస్పత్రి.


వైరస్‌ పూర్తిగా తగ్గలే..

జ్వరం, దగ్గు, జలుబు ఉంటే కొవిడ్‌ టెస్టు చేయించుకుంటే పాజిటివ్‌ కనిపిస్తుంది. ఇంకా వైరస్‌ పూర్తిగా తగ్గిపోలేదు. కేసుల సంఖ్య తగ్గినప్పటికీ ఇంకా బాధితులు ఉంటున్నారు. కోమార్బిటీస్‌ ఉన్న వారు కాస్తా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. వారికి కాంప్లికేషన్స్‌ ఎక్కువగా ఉంటాయి. కొవిడ్‌ తీవ్రత ఎలా ఉన్నప్పటికీ మాస్కులు ధరించడం, రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండడం, నిబంధనలు పాటించడం వంటివి తప్పని సరిగ్గా చేయాలి. - డాక్టర్‌ శ్యామల అయ్యంగార్‌, సీనియర్‌ జనరల్‌ ఫిజీషియన్‌, అపోలో ఆస్పత్రి.

Updated Date - 2022-02-13T18:56:44+05:30 IST