వావ్.. అగ్నిమాపక సిబ్బంది టాలెంట్ ఈ రేంజ్‌లో ఉంటుందా..! నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోన్న Viral Video

ABN , First Publish Date - 2022-02-06T02:53:14+05:30 IST

ఇంతటి రిస్క్ తీసుకునే అగ్నిమాపక సిబ్బందికి ఎలాంటి వృత్తి పరమైన నైపుణ్యాలు ఉంటాయి? వారు ఎలాంటి శిక్షణ తీసుకుంటారు అనే ప్రశ్నలు సామాన్యులకు కలగకమానవు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానమిస్తున్న ఓ వీడియో ప్రస్తుతం నెటిజన్లను అబ్బుర పరుస్తోంది.

వావ్.. అగ్నిమాపక సిబ్బంది టాలెంట్ ఈ రేంజ్‌లో ఉంటుందా..! నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోన్న Viral Video

ఇంటర్నెట్ డెస్క్:  అగ్ని ప్రమాదాలు.. క్షణాల్లో ప్రారంభమై చూస్తుండగానే  అనేక మంది ప్రాణాలు తీసేయగలవు! అందుకే.. సుశిక్షితులైన అగ్నిమాక సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటూ ప్రమాదం జరిగినట్టు తెలియగానే  ఘటనా స్థలికి చేరుకుని సహాయకార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఎంత పెద్ద భవంతి అయినా.. మంటలు ఎంత వేగంగా వ్యాపిస్తున్నా అదరక బెదరక బాధితులను కాపాడేందుకు ముందుకు ఉరుకుతారు.  మరి ఇంతటి రిస్క్ తీసుకునే అగ్నిమాపక సిబ్బందికి ఎలాంటి వృత్తిపరమైన నైపుణ్యాలు ఉంటాయి?  వారు ఎలాంటి శిక్షణ తీసుకుంటారు అనే ప్రశ్నలు సామాన్యులకు కలగకమానవు.  ఇలాంటి ప్రశ్నలకు సమాధానమిస్తున్న ఓ వీడియో ప్రస్తుతం నెటిజన్లను అబ్బుర పరుస్తోంది. 


అగ్నిమాపక సిబ్బంది(ఫైర్ ఫైటర్స్‌) సామర్థ్యాలు, నైపుణ్యాలు ఈ రేంజ్‌లో ఉంటాయా అని ఆశ్చర్యపోయేలా ప్రస్తుతం ఓ వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. బల్గేరియాకు చెందిన ఓ ఫైర్ ఫైటర్.. శిక్షణలో భాగంగా మూడంతస్తుల భవనాన్ని  కేవలం 15 సెకన్లలో.. అదీ నిచ్చెన సాయంతో చకచకా ఎక్కేశాడు. ఇలా అబ్బురపరిచే ఫీట్ చేసిన అతడి పేరు జార్జ్! గతంలో జాతీయ స్థాయి రికార్డులు కూడా జార్జ్ నెలకొల్పినట్టు తెలుస్తోంది. ఇక.. అతడి వీడియో చూసిన నెటిజన్లు ప్రస్తుతం షాకైపోతున్నారు. ఇతడు స్పైడర్ మ్యాన్ లాగా ఉన్నాడే అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరీ ఈ స్థాయిలో కాకపోయినప్పటికీ.. అనేక మంది  ఫైర్ ఫైటర్స్ వృత్తిపరమైన నైపుణ్యాలు ఇలాగే ఉంటాయని వ్యాఖ్యానిస్తున్నారు. 


కాగా.. ఫైర్ ఫైటర్స్‌కు సంబంధించిన ఇలాంటి  వీడియోలు గతంలోనూ తెగ వైరల్ అయ్యాయి. ఒకానొక సందర్భంలో ఓ బోటు మంటల్లో చిక్కుకోవడంతో క్షణాల్లో స్పందించిన ఫైర్ ఫైటర్ మరో బోటు(జెట్ స్కీ) సాయంతో మంటలను ఆర్పేస్తాడు. మంటల్లో చిక్కుకున్న బోటు సమీపంలో శరవేగంతో జెట్ స్కీని తిప్పుతూ.. పెద్ద అలలు ఎగసి బోటుపై పడేలా చేసి అతడు మంటలను ఆర్పేశాడు. గతేడాది వైరల్ అయిన ఈ వీడియో నెటిజన్లు ఇలాగే నోరెళ్ల బెట్టేలా చేసింది. సమయస్ఫూర్తి, నైపుణ్యాలు, ధైర్యసాహసాలు కనబరిచే అగ్నిమాపక సిబ్బందిని వేనోళ్ల పొగిడేలా చేసింది.




Updated Date - 2022-02-06T02:53:14+05:30 IST