
అన్ని అవయవాలు ఉన్న వారు సక్రమంగా చేయలేని పనులను.. అవయవ లోపం ఉన్న వారు, అవలీలగా చేసేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. కొన్ని సార్లు ఇలాంటి వింత వింత ఘటనలు అక్కడక్కడ చోటు చేసుకుంటుంటాయి. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు ఎన్నో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో దివ్యాంగ విద్యార్థిని బాస్కెట్ బాల్ అడే విధానం చూసి అంతా.. ముక్కున వేలేసుకుంటున్నారు. బాస్కెట్ బాల్ ఆటలో స్కోర్ చేయడమంటే కష్టంతో కూడుకున్న పని.. అలాంటి క్రీడను కూడా ఈ దివ్యాంగురాలు సులభంగా ఆడడం చూపరులను ఆకట్టుకుంటోంది.
యునైటెడ్ స్టేట్స్‌లోని మిచిగాన్‌లో ఉన్న హైస్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ట్విటర్లో Zeeland Public Schools అనే పేరుతో ఉన్న ఖాతాలో మార్చి 22న ఈ వీడియో పోస్టు చేశారు. కొందరు విద్యార్థులు బాస్కెట్ బాల్ గేమ్ ఆడుతుంటారు. ఇంతలో దృష్టిలోపం ఉన్న 17 ఏళ్ల జూల్స్ హూగ్లాండ్ అనే విద్యార్థిని అక్కడికి వస్తుంది. బంతిని చేతిలో పట్టుకుని నిలబడుతుంది. అంతా ఉత్కంఠగా చూస్తూ ఉంటారు. ఇంతలో ఓ మహిళ పొడవాటి కర్రతో బాస్కెట్ ఉన్న స్థానంలో కొడుతూ శబ్ధం చేస్తుంది. విద్యార్థిని కొద్దిసేపు ఆ శబ్ధాన్ని గమనిస్తుంది. తర్వాత బంతిని సూటిగా బాస్కెట్లోకి విసురుతుంది. దీంతో ఆడిటోరియం మొత్తం చప్పట్లతో మారుమోగుతుంది. ఆ విద్యార్థిని మొత్తం అందరూ అభినందిస్తారు. ఈ వీడియోకు ఇప్పటికే 30లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ విద్యార్థిని ప్రతిభ అద్భుతం.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి