Advertisement

పాపమే భవబంధాలకుమూలం

Nov 27 2020 @ 02:51AM

పాపం అనే పదాన్ని ఆధ్యాత్మిక విద్యలో మలం అని కూడా అంటారు. మలం లేక పాపం అనే మాయా భూతం మనిషితో అనుచిత కార్యాలు చేయిస్తుంది. మానవుని మాన్యతను లోపింపజేస్తుంది. ఆపదలకు గురిచేస్తుంది. తద్వారా అమూల్యమైన మానవ జీవితం అయోమయమౌతుంది. ఇహ, పర లోక సాధన ఫలితం మృగ్యమైపోతుంది. మలం (పాపం) సమూలంగా వెడలిపోవాలంటే ఆధ్యాత్మిక సాధన అత్యంత ఆవశ్యకం. అది జన్మసార్థకం కలిగించి, అమోఘమైన ఆనందాన్నిస్తుంది. అది జరగాలంటే కామక్రోధాల కలుషితం ఖండమైపోవాలి. కర్మ ఫలిత త్యాగం జరగాలి. కామ్యకర్మలు శాస్త్రవిరుద్ధాలు. అవి తప్పకుండా నిషేధింపబడాలి. ఎందుకంటే అవి చిత్తశాంతిని నిర్మూలిస్తాయి. కర్తృత్వ భావం (ఇది నేనే చేశాను, నావల్లే జరిగింది అనే అహంకారం) వల్ల కామక్రోధాదులు కలుగుతాయి. కామక్రోధాదులు.. తీరని పాపరాశులు. భయంకరమైన అంతఃశత్రువులు. 


కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః

మహాశనో మహాపాప్మా విద్ధ్యేనమిహ వైరిణమ్‌


రజోగుణం వల్ల పుట్టే కామం.. క్రమంగా క్రోధంగా మారుతుందని, పాపకారణాలైన వాటిని అంతం చేయనిదే మనిషి మంచిపనులు చేయలేడని జగద్గురువైన ఆ కృష్ణపరమాత్మ గీతాశాస్త్రంలో బోధించాడు. మనిషి రాగద్వేషాలకు వశం కాకుండా అశాశ్వతమైన ప్రాపంచిక భోగాలకు స్వస్తి పలికి శాశ్వతమైన పరమాత్మ ప్రయోజనాన్ని గుర్తించాలి. పనుల ఫలితాలు పరమాత్మకర్పించాలి. తత్ఫలితంగా మనసులోని మలినం తొలగిపోతుంది. శాస్త్రవిహితమైన సత్కర్మలే ఆచరిస్తారు. అంతటితో మలం (పాపం) భస్మమైపోతుంది. అవిద్య అంతమైపోతుంది. సమానత్వ భావం అంతఃకరణశుద్ధిని కలుగచేస్తుంది. కర్తవ్యకర్మలను ప్రోత్సహిస్తుంది. కర్తవ్యకర్మలతో కామ్యకర్మలంతరిస్తాయి. అంతటితో మలమనే పాపం మాయమైపోతుంది. సమానత్వభావమే యోగమని కూడా గీతలో చెప్పబడింది. సమానత్వంతో సాధింపరానిదేది ఉండదు.


వ్యక్తి ఆ పవిత్రగుణంతో సమాజాన్ని సంతసపరచే బృహత్తరమైన కర్మలు చేయడానికి పూనుకొంటాడు. నిస్వార్థ బుద్ధితో దానధర్మాలు చేయడం, ఆపదలోనున్నవారిని ఆదుకోవడం, సంఘీభావం వెలయించే సలహాలివ్వడం, సత్యసాధనోద్ధరణ సాగించడం, ధర్మో రక్షతి రక్షితః అనే సూక్తిని మనసా వాచా నమ్మి, ఆచరించడం మొదలైన సద్గుణాలతో తరిస్తాడు. పరమాత్మను నమ్మినవారు ఎన్నటికీ చెడిపోరు. వారు అన్నివిధాలా అత్యంతోన్నత ప్రయోజనాన్ని పొందగల్గుతారు.

- విద్వాన్‌ వల్లూరు చిన్నయ్య


Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.