AP News: మ‌హానందిలో విద్యాభార‌తి క్షేత్ర స‌మావేశాలు

ABN , First Publish Date - 2022-09-06T16:43:11+05:30 IST

కరోనా కారణంగా విద్యా వ్యవస్థ కాస్త వెనుకబడిందని... తిరిగి దానిని గాడిలో పెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని..

AP News: మ‌హానందిలో విద్యాభార‌తి క్షేత్ర స‌మావేశాలు

కర్నూలు: కరోనా కారణంగా విద్యా వ్యవస్థ కాస్త వెనుకబడిందని... తిరిగి దానిని గాడిలో పెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. ఈ దిశ‌గా విద్యారంగంలో కృషి జ‌ర‌గాల‌ని విద్యాభార‌తి అఖిల భార‌త అధ్య‌క్షులు దూసి రామ‌కృష్ణ (Dusi ramakrishna) అభిప్రాయప‌డ్డారు. విద్యా భారతి దక్షిణ మధ్య క్షేత్ర (ఏపీ, తెలంగాణ, కర్నాటక)  రెండు రోజుల క్షేత్రీయ సమావేశాలు నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో జరిగాయి. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ..   ప్ర‌పంచంలోనే అతి ఎక్కువ విద్యాల‌యాలు న‌డుపుతున్న స్వ‌చ్ఛంద విద్యా వ్య‌వ‌స్థ‌ల స‌మూహంగా విద్యాభార‌తి వినుతికెక్కిన విష‌యం తెలిసిందే. విద్యా వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేయ‌టంలో జాతీయ విద్యా విధానం కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని అన్నారు. దీనిని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లేందుకు విద్యా భార‌తి కార్య‌క‌ర్త‌లు చురుగ్గా వ్య‌వ‌హ‌రించాల‌ని ఆయ‌న సూచించారు.


శిశుమందిరాల ప్రభావం సమాజంపై గాఢంగా ఉంది....

శ్రీ సరస్వతీ శిశుమందిరాల ప్రభావం సమాజంపై గాఢంగా పడిందని దక్షిణ మధ్య క్షేత్ర అధ్యక్షులు, రిటైర్డ్ ఐఏఎస్ అధ్యక్షులు డాక్టర్ చామర్తి ఉమా మహేశ్వరరావు తెలిపారు. విద్యా భారతి కార్యకర్తలు సంఘటితంగా ఉంటూ అనుకున్న, లక్ష్యాలను చేరుకోవాలన్నారు. కేవలం వాచక జ్ఞానం వుంటే సరిపోదని... దానిని అనుభవైక జ్ఞానంగా మలుచుకున్నప్పుడే లక్ష్యం నెరవేరుతుందని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.


రెండు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమాన్ని దక్షిణ మధ్య క్షేత్ర సంఘటనా కార్య‌ద‌ర్శి  లింగం సుధాకర్ రెడ్డి సమన్వయం చేశారు. విలువ‌ల‌తో కూడిన విద్య‌ను అందిస్తున్న విద్యా భార‌తి పాఠ‌శాల‌ల్లో జ‌రుగుతున్న వివిధ కార్య‌క‌లాపాల‌ను సమావేశంలో స‌మీక్షించారు. అలాగే నూతన జాతీయ విద్యా విధానం స‌హా అనేక అంశాల‌పై విద్యా భార‌తి నుంచి అనేక పుస్త‌కాలు, సాహిత్యం విడుదలవగా... తాజాగా బాలిక‌ల విద్య ప‌ట్ల అవ‌గాహ‌న క‌ల్పించేందుకు "బాలిక విద్య" అనే పుస్తకాన్ని రూపొందించి ఆవిష్కరించారు. క్షేత్ర కార్యదర్శి అయాచితుల లక్ష్మణ రావు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రాంత అధ్య‌క్షులు ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర‌రావు, అనంత‌పురం  స‌మితి అధ్య‌క్షులు రామ‌కృష్ణారెడ్డి, మూడు రాష్ట్రాల ప్ర‌తినిధులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-06T16:43:11+05:30 IST