విద్యార్థులు ‘మాయ’ం!

ABN , First Publish Date - 2022-07-04T04:29:30+05:30 IST

2,07,206.. ఇది 2021-22 విద్యాసంవత్సరంలో ఖమ్మం జిల్లాలోని మొత్తం విద్యార్థుల సంఖ్య. వారిలో ప్రభుత్వ పాఠశాలల్లో 86,966 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. కాగా ఆ ఏడాదికి సంబంధించి మొత్తం పదో తరగతి విద్యార్థులు 19,638 మంది విద్యార్థులున్నారు. కానీ

విద్యార్థులు ‘మాయ’ం!

పదో తరగతిలో రెండువేల మంది వివరాలు గల్లంతు

అధికారుల లెక్కల్లో భారీ వ్యత్యాసాలు 

‘బడిబాట’లోనూ బోలెడు మంది నమోదు

పాఠశాలకు ఎంతమంది వస్తున్నారో తెలియని వైనం

ఎనరోల్‌మెంట్‌లో 14వేల మందికి పైగా విద్యార్థులు

రావచ్చు.. రాకపోవచ్చంటున్న అధికారులు


ఖమ్మం, జులై 3 (ఆంధ్రజ్యోతి) : 2,07,206.. ఇది 2021-22 విద్యాసంవత్సరంలో ఖమ్మం జిల్లాలోని మొత్తం విద్యార్థుల సంఖ్య. వారిలో ప్రభుత్వ పాఠశాలల్లో 86,966 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. కాగా ఆ ఏడాదికి సంబంధించి మొత్తం పదో తరగతి విద్యార్థులు 19,638 మంది విద్యార్థులున్నారు. కానీ ఆ విద్యార్థుల్లో సుమారు రెండువేల మంది మాయమైపోయారా? అంటే అవుననే చెప్పాలి. ఖమ్మం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఉన్న అధికారిక లెక్కలను పరిశీలిస్తే.. జిల్లా వ్యాప్తంగా 19వేల మంది విద్యార్థులున్నట్టుగా లెక్కలు చెబుతుండగా.. ఇటీవల ప్రకటించిన పదోతరగతి ఫలితాల ప్రకారం మొత్తం కేవలం 17,408 మంది విద్యార్థులు మాత్రమే పరీక్ష రాసినట్టు చూపించారు. అంటే ఆ రెండింటి లెక్కల మధ్యలో ఉన్న 2,230 మంది విద్యార్థులు ఏమైనట్టు అన్న సందేహం కలగకమానదు. దీనిని బట్టి పరిశీలిస్తే జిల్లా విద్యాశాఖాధికారుల వద్ద సరైన లెక్కలు లేవన్న విషయం స్పష్టమవుతోండగా.. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువమంది విద్యార్థులున్నట్టు చూపించుకోవడం కోసం ఆయా లెక్కల్లో మాయ ప్రదర్శించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది పదో తరగతి విద్యార్థుల సంఖ్యను పరిశీలించడం ద్వారా వెలుగులోకి వచ్చిన విషయం. ఇదే తరహా మాయాజాలం ఇతర తరగతుల్లోనూ జరుగుతున్నట్టు తెలుస్తుండగా.. చాలామంది ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులను సైతం ప్రభుత్వ పాఠశాలల్లో చదివినట్టు కేవలం కాగితాలపై అంకెలను చూపుతున్నట్టు స్పష్టమవుతోంది. ఇదే తరహా మాయాజాలన్ని ప్రస్తుతం బడిబాటలోనూ ప్రదర్శిస్తున్న విద్యాశాఖ అధికారులు జిల్లా ఉన్నతాధికారులను కూడా పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 


అధికారుల అంకెల మాయాజాలం..

జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో అసలు విద్యార్థుల లెక్కలు సక్రమంగా లేవన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు అంకెల మాయాజాలం చేస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఉన్న లెక్కల ప్రకారం గతేడాది కంటే ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోనూ కలిపి విద్యార్థులు తగ్గినట్టు ఉన్నాయి. గతేడాది జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో 2,07,206 మంది విద్యార్థులుండగా  ఈ ఏడాది ఇప్పటివరకు 1,64,545 మంది విద్యార్థులు మాత్రమే పాఠశాలల్లో చేరినట్టు చూపుతున్నారు. కాగా ప్రస్తుతం పాఠశాలలు పూర్తిస్థాయిలో ప్రారంభమవగా మహా అయితే వేలస్థాయిలో విద్యార్థులు సంఖ్య పెరిగే అవకాశమే లేదు. అంటే గతేడాది కంటే ఈ ఏడాది 42వేల మంది విద్యార్థులు తగ్గినట్టుగా తెలుస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా గతేడాది ప్రభుత్వ పాఠశాలల్లో 86,966 మంది విద్యార్థులను మాత్రమే చూపించిన అధికారులు ఈ ఏడాది ఆ సంఖ్య 93,840 మందికి చేరడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటులో గతేడాది లక్షా 20వేల మంది ఉన్న విద్యార్థులు కాస్త ఈ ఏడాదికి వచ్చేసరికి కేవలం 68,868 మంది విద్యార్థులకు చేరడం గమనార్హం. అంతటి స్థాయిలో ప్రైవేటులో విద్యార్థులు తగ్గారా? అంటూ పలువురు నోరు వెళ్లబెట్టుకునే పరిస్థితి. ప్రస్తుతం విద్యాశాఖ అధికారులు ప్రదర్శిస్తున్న అంకెల మాయాజాలం చూసి అవాక్కవక తప్పని పరిస్థితి నెలకొంది. 

బడిబాటలో ఎంతమంది వస్తున్నారో? 

బడిబాటలో బోలెడుమంది విద్యార్థుల వివరాలను నమోదు చేశారు. అయితే బడిబాటలో కేవలం విద్యార్థుల లెక్కలు చూపించడం కోసమే ఇష్టారీతిన ప్రైవేటుకు వెళ్లే పిల్లల పేర్లను కూడా నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఫలితంగా హాజరునమోదు శాతం పెరగకపోవడం, జిల్లాలో 19 పాఠశాలలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయడం లాంటివి జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం జిల్లా అధికారులు చెప్పే సమాధానాలు దానికి మరింత బలం చేకూరుస్తున్నాయి. బడిబాటలో గతంలో ఎన్నడూ లేనివిధంగా జూన చివరి వరకు 14,016 మంది విద్యార్థుల వివరాలను నమోదు చేశారు. అందులో సుమారు 5వేల మంది వరకు ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వచ్చినట్టుగా చూపించారు. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు బడిబాటలో చేరిన విద్యార్థులు ప్రస్తుతం ఎంతమంది పాఠశాలలకు వస్తున్నారన్న పూర్తి సమాచారం నేటి వరకు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో లేకపోవడం గమనార్హం. పైగా నమోదు చేసిన విద్యార్థులు రావొచ్చు.. రాకపోవచ్చు అన్న సమాధానాలు చెబుతున్నట్టు సమాచారం. అయితే వారిలో 50 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఉండే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి దీనిపై దృష్టిసారించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. 

Updated Date - 2022-07-04T04:29:30+05:30 IST