Visit Vietnam: ఇక్కడ రూ.330.. అక్కడ లక్షతో సమానం.. బాతు మాంసం నుంచి ఐ ఫోన్ల వరకు వియత్నాం విశేషాలివీ..!

ABN , First Publish Date - 2022-07-20T18:49:54+05:30 IST

మా తొలి మజిలీ... హనోయ్‌! ఉత్తర వియత్నాంలోని ఈ నగరమే... దేశ రాజధాని. పర్యాటకులు హనోయ్‌లోని ఓల్డ్‌ క్వార్టర్స్‌లో బస చేసేందుకు ఇష్టపడతారు. తొలుత... మా హోటల్‌కు సమీపంలోని హోన్‌కియమ్‌ సరస్సుకు వెళ్లాం. ముచ్చటగా కట్టిన ఒక వంపు వంతెనను దాటుకుని లోపలికి వెళితే... ‘అదృష్టాన్ని’ అందించే దేవుడు కొలువైన ప్రాచీన...

Visit Vietnam: ఇక్కడ రూ.330.. అక్కడ లక్షతో సమానం.. బాతు మాంసం నుంచి ఐ ఫోన్ల వరకు వియత్నాం విశేషాలివీ..!

‘నువ్వంటే ఒక యుద్ధం

నీ రూపం ఒక పోరాటం

నీ స్వరం రణ గర్జన

ఏదో ఒకరోజు నేను వస్తాను

అసలైన నిన్ను చూస్తాను

హలో వియత్నాం... అని పలకరిస్తాను’

... వియత్నాం ఆత్మను ఆవిష్కరించే గీతమిది! మేమూ వియత్నాంను పలకరించాలని నిర్ణయించుకున్నాం. పర్యటనపై ప్రాథమికంగా ఓ ప్రణాళిక రూపొందించుకున్నాం. హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కనెక్టింగ్‌ ఫ్లయిట్‌లో బయలుదేరాం..   బ్యాంకాక్‌ మీదుగా ప్రయాణించి,  హనోయ్‌లో వాలిపోయాం... 


రానుపోను విమానం ఖర్చులతో కలిసి రూ.60 వేలలో వియత్నాం వెళ్లి రావొచ్చు. 

వియత్నాంలో పోర్క్‌, బీఫ్‌, బాతు మాంసం ఎక్కువగా తింటారు. శాకాహారం మాత్రమే తినే వారు ఇక్కడి నుంచే ‘రెడీ టు ఈట్‌’ ఆహారం తీసుకెళ్లడం మేలు.

వియత్నాం కరెన్సీ... ‘డాంగ్‌’. వాళ్ల లక్ష డాంగ్‌లు మనకు దాదాపు రూ.330. వంద యూఎస్‌ డాలర్లకు 23.30 లక్షల డాంగ్‌లు. అలాగని... అక్కడ అన్నీ చవకేమీ కాదు.

వియత్నాంలో అత్యధికులకు ఇంగ్లీషు రాదు. భుజం మీద తట్టి, ‘ఏయ్‌’ అని పలకరిస్తారు. నొచ్చుకోవద్దు.

వియత్నమీస్‌ స్నేహశీలురు. వీలైతే సహాయం చేయాలని చూస్తారు. మా పర్యటనలో ఎక్కడా మోసగాళ్లు తారసపడలేదు. యాచకులూ పెద్దగా లేరు.

వియత్నాం... పురోగమిస్తోంది. ఏ మూలకు వెళ్లినా చక్కటి రహదారులున్నాయి. ప్రతి ఒక్కరి చేతిలో ఐఫోన్లు కనిపించాయి. 15 ఏళ్లుగా పరిస్థితి మారుతోందని స్థానికులు తెలిపారు. 


మా తొలి మజిలీ... హనోయ్‌! 

ఉత్తర వియత్నాంలోని ఈ నగరమే... దేశ రాజధాని. పర్యాటకులు హనోయ్‌లోని ఓల్డ్‌ క్వార్టర్స్‌లో బస చేసేందుకు ఇష్టపడతారు. తొలుత... మా హోటల్‌కు సమీపంలోని హోన్‌కియమ్‌ సరస్సుకు వెళ్లాం. ముచ్చటగా కట్టిన ఒక వంపు వంతెనను దాటుకుని లోపలికి వెళితే... ‘అదృష్టాన్ని’ అందించే దేవుడు కొలువైన ప్రాచీన మందిరం కనిపిస్తుంది. హోన్‌కియమ్‌ సరస్సు... అంటే కత్తులుదాచిన కొలను అని అర్థం. దానికి దగ్గర్లోనే వియత్నాం యుద్ధ జ్ఞాపకాల మ్యూజియం కనిపిస్తుంది. చిరస్మరణీయ విజయం దాచుకున్న శకలాలు... పోరాట స్ఫూర్తిని చాటి చెప్పే చిత్రాలు.. ఆ చరిత్రను చెబుతాయి. ఒకటీ రెండేళ్లు కాదు... ఇరవై ఏళ్లు సాగిన యుద్ధమది! అప్పట్లో సమర గర్జన చేసిన హెలికాప్టర్లు, విమానాలు, ట్యాంకులు, వాహనాలను ఇక్కడ చూడొచ్చు. తాము కూల్చేసిన అమెరికా యుద్ధ విమాన శకలాలను కళాత్మాకంగా అమర్చిన తీరు ఆకట్టుకుంటుంది. మ్యూజియం ఆవరణలోనే 18వ శతాబ్దంలో నిర్మించిన ‘హనోయ్‌ ఫ్లాగ్‌ టవర్‌’ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ‘గెలవడానికి బలమొక్కటే చాలదు. గుండెబలం కూడా కావాలి’ అనే స్ఫూర్తిని ఈ మ్యూజియం నింపుతుంది. ఇంకా... వియత్నాం విప్లవ నేత హొచిమిన్‌ సమాధి ఉన్న ‘హొచిమిన్‌ మౌసెలియం’ కూడా చూశాం. హనోయ్‌లో మరో ప్రధానాకర్షణ ‘ట్రెయిన్‌ స్ట్రీట్‌’! సుమారు మూడు ఫర్లాంగుల పొడవునా ఉన్న ఇరుకైన వీధి మధ్యలో పట్టాలు, వాటిపై నుంచి దూసుకెళ్లే రైళ్లు. అటూ ఇటూ అందంగా అలంకరించిన చిన్నచిన్న ఫుడ్‌ కోర్టులు ఉంటాయి. టూరిస్టులు అక్కడ కూర్చుని... కాఫీ, టీలు తాగుతూ రాబోయే రైలు కోసం ఎదురు చూస్తుంటారు.


చలో... హొలాంగ్‌ బే..

సముద్రమంటే అనంత జల నిధి. అలలు, నీళ్లు తప్ప మరేమి కనిపించని సముద్రంలో... ‘మేమున్నాం’ అంటూ ఎక్కడికక్కడ మొలుచుకొచ్చిన సున్నపురాతి కొండలు కనిపిస్తే? ఈ ప్రకృతి గీసిన చిత్రం పేరే హొలాంగ్‌ బే! సముద్రంలో ఉన్న వందలకొద్దీ ‘ఒంటరి సున్నపురాయి కొండల’ మధ్య నుంచి క్రూయిజ్‌ మెత్తగా ముందుకు సాగుతుంది. ఇందులో తొలి మజిలీ... టి టాప్‌ దీవి. ఇక్కడ చిన్నపాటి బీచ్‌లో ఎంచక్కా సముద్ర స్నానం చేయవచ్చు. అక్కడే... సుమారు 450 మెట్లు కొండపైకి ఎక్కితే... ‘హొలాంగ్‌ బే’ విహంగ వీక్షణంలో అతి సుందరంగా కనిపిస్తుంది. మరో మజిలీ... సుంగ్‌సొట్‌ గుహ. వేల ఏళ్ల కిందట సహజసిద్ధంగా ఏర్పడిన ఎన్నెన్నో చిత్రవిచిత్రమైన శిలా రూపాలు కనిపిస్తాయి. హొలాంగ్‌బే ట్రిప్‌లో బాగా థ్రిల్‌కు గురిచేసే ‘యాక్టివిటీ’... కయాకింగ్‌. మనకు సొంతంగా కయాక్‌లు ఇచ్చి వదిలేస్తారు. చక్కగా కయాక్‌ చేసుకుంటూ... నీటి మధ్యలోనే ఒక సొరంగాన్ని దాటి అవతలికి వెళితే, అక్కడ కొండల మధ్య ఉన్న ఓ పెద్ద ‘కొలను’ కనిపిస్తుంది. అరగంటపాటు ఆ నీటిలో విహరించడం... అందులోనూ, మనం సొంతంగా కయాక్‌ చేయడం ఓ అద్భుత అనుభవం. ఇక... హనోయ్‌ కేంద్రంగా సందర్శించగలిగే మరో ప్రకృతి చిత్రం... నిన్‌ బిన్‌. హొలాంగ్‌ బే సముద్రంలో విహారమైతే, నిన్‌బిన్‌ ప్రశాంతమైన నదిలో పడవ ప్రయాణం. స్థానికులే తెడ్లు వేస్తూ పడవలు నడుపుతారు. దాదాపు రెండు గంటలపాటు ఈ పడవ ప్రయాణం... సున్నపు రాళ్ల కొండల మధ్య ప్రవహించే నదిలో సాగుతుంది. నాలుగు సొరంగాలు వస్తాయి. ఒకటి 350 మీటర్ల పొడవునా ఉంటుంది. అదే దారిలో విశాలమైన నీళ్ల మధ్య ‘పగోడా’లాంటి మండప నిర్మాణం అచ్చెరువొందిస్తుంది. అన్నట్లు... ఈ ప్రాంతం యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో కూడా చేరింది. ‘కింగ్‌కాంగ్‌... ది స్కల్‌ ఐల్యాండ్‌’ను చిత్రీకరించింది ఇక్కడే. నిన్‌బిన్‌ టూర్‌లోనే విశాలమైన తామర పూల కొలను చూడొచ్చు. అదికూడా... మధ్యలో చెక్కలతో ఏర్పాటు చేసిన కాలిబాటపై నడుస్తూ!


కూల్‌ కూల్‌... సాపా

హనోయ్‌ నుంచి ఉత్తర దిశగా 5 గంటలు ప్రయాణిస్తే... వచ్చే సుందర పట్టణం సాపా. హనోయ్‌ గరంగరం నగరమైతే... సాపా కూల్‌ ‘హిల్‌ స్టేషన్‌’. వీధులు, హోటళ్లు విద్యుద్దీపాల వెలుగులతో కళకళలాడుతూ ఆహ్వానిస్తాయి. సాపా ప్రధాన ఆకర్షణ... ‘టెర్రెస్‌ రైస్‌ ఫీల్డ్స్‌’. అంటే... పర్వత వాలులో అంచెలు అంచెలుగా పెంచిన వరి చేలు. మన ఏజెన్సీలో పోడు వ్యవసాయం చేస్తారు కదా.. ఇదీ అలాగే! సాపాకు వెళ్లిన వారు కచ్చితంగా చూడాల్సింది... ఫాన్సీపాన్‌. ఇది ‘సన్‌ వరల్డ్‌’ సృష్టించిన ఒక అద్భుతం! కేబుల్‌ కార్‌లో 17 నిమిషాలపాటు అలా పైపైకి, మేఘాలను చీల్చుకుని వెళ్తే... ఫాన్సీపాన్‌ వస్తుంది. పైకి వెళ్లగానే... రివ్వుమని చలిగాలి ముఖాన్ని తాకుతుంది. ‘బౌద్ధం’ థీమ్‌తో అనేక నిర్మాణాలు చేశారు. బౌద్ధాలయాలు, భారీ బుద్ధుడి కాంస్య విగ్రహం, ఆయన శిష్యుల విగ్రహాలు, లేడీ బుద్ధ విగ్రహం.. ఇలా అక్కడ ఒక ప్రపంచాన్నే సృష్టించారు. 


సెంట్రల్‌ వియత్నాంలోకి... 

మా తదుపరి మజిలీ... దనాంగ్‌. ఇది... మధ్య వియత్నాంలోని నగరం. హనోయ్‌ నుంచి డొమెస్టిక్‌ విమానంలో దనాంగ్‌కు వెళ్లాం. ఇక్కడ బీచ్‌ రోడ్‌లో స్టే బాగుంటుంది. 70 కిలోమీటర్ల పొడవునా సముద్ర తీరమే! అలల అలజడి లేని, ఈత కొట్టేందుకు అత్యంత భద్రమైన బీచ్‌లు ఇక్కడి ప్రత్యేకత. సాపాలో ‘ఫాన్సిపాన్‌’ ఎలాగో... దనాంగ్‌లో ‘బాణా హిల్స్‌’ అలా. ఫాన్సిపాన్‌లో ఆధ్యాత్మిక విహారమైతే... బాణాహిల్స్‌ సరదాల ప్రపంచం. బాణా హిల్స్‌కు కూడా కేబుల్‌ కార్‌ ఎక్కాల్సిందే. 13 నిమిషాలపాటు పైపైకి ప్రయాణించాలి. ఫ్రెంచ్‌ విలేజ్‌, అడ్వెంచర్‌ పార్క్‌, బీర్‌ ప్లాజా... ఇలా ఎన్నెన్నో థీమ్స్‌! తిరుగుతుంటే సమయమే తెలియదు. అరచేతుల్లో పొదివి పట్టుకున్నట్లుగా నిర్మించిన ‘గోల్డెన్‌ బ్రిడ్జ్‌’ ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. 


నక్షత్రాల నెలవు... హొ యాన్‌

వియత్నంలోని చారిత్రక, పురాతన పట్టణం... హొ యాన్‌. ‘తు బోన్‌’ నది ఒడ్డున 17, 18 శతాబ్దాలలో చైనా వ్యాపారులు నిర్మించుకున్న గ్రామమిది. అప్పుడు కట్టిన ఇళ్లు, ఆ వీధుల్లోంచి నడుస్తుంటే... ‘పురాతన ప్రపంచం’లోకి వెళ్లినట్లే ఉంటుంది. రాత్రి కాగానే హొయాన్‌ కొత్త హొయలు పోతుంది. దుకాణాలు, వీధులు ‘లాంతర్ల’తో మెరిసిపోతాయి. ‘తు బోన్‌’ నదిలో లాంతర్లను కట్టుకున్న బోటులో విహరిస్తుంటే ఆ అనుభూతే వేరు. హొ యాన్‌లోనే మరో ప్రత్యేక ఆకర్షణ జపనీస్‌ బ్రిడ్జ్‌. నక్షత్రాలు నేలకు దిగినట్లుగా ఉండే హొయాన్‌ సందర్శన ఒక మధుర జ్ఞాపకం.


తుది మజిలీ... సైగాన్‌

దనాంగ్‌ పర్యటన ముగించుకుని మరో డొమెస్టిక్‌ విమానంలో సైగాన్‌ చేరుకున్నాం. రాజధాని హనోయ్‌కంటే సైగాన్‌ పెద్ద నగరం. 1975లో వియత్నాం ఏకీకరణ జరిగిన తర్వాత సైగాన్‌ నగరం పేరును వియత్నాం విప్లవ యోధుడు, అధ్యక్షుడు హొచిమిన్‌గా మార్చేశారు. ఇది... ‘బైక్‌ల నగరం’. వందలూ వేల బైక్‌లపై జనం ప్రవాహంలా వెళ్తుంటారు. హొచిమిన్‌ నగరంలో చూడదగ్గ ప్రాంతాలు అనేకం ఉన్నాయి. మేం కూచి టన్నెల్స్‌, మెకాంగ్‌ రివర్‌ డెల్టా మాత్రమే మా జాబితాలో పెట్టుకున్నాం. భూటాన్‌లో పుట్టి మొత్తం ఆరు దేశాలు దాటే మెకాంగ్‌ రివర్‌ వియత్నాంలో సముద్రంలో కలుస్తుంది. మెకాంగ్‌ రివర్‌ డెల్టా పరిధిలోని గ్రామాల్లోని సంస్కృతులు వేరు. మడ అడవుల తరహాలో దట్టంగా అలుముకున్న కొబ్బరి జాతి చెట్ల మధ్యలోంచి కాల్వలో... చిన్న పడవలో ప్రయాణం థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ఈ డెల్టాలోని ఒక గ్రామాన్ని ఆటోలో చుట్టేశాం. ఇక... మేం చూడాలనుకుని, చూడలేక పోయింది కూచి టన్నెల్స్‌! సమయాభావంవల్ల చూడలేకపోయాం. ఈ పర్యటనకు ముందు వియత్నాంను పలుమార్లు సందర్శించిన పర్యాటక ప్రియుడు తుమ్మూరు జగన్మోహన్‌ రెడ్డిని (పెనుమాక) సంప్రదించాం కాబట్టి... ఆయన సలహాలతో మా పది రోజుల విహారయాత్ర విజయవంతంగా ముగిసింది.


- సురేష్‌ కుమార్‌ తొమ్మండ్రు, 

నాగేంద్ర సాయి కుందవరం



Updated Date - 2022-07-20T18:49:54+05:30 IST