Advertisement

అవమానిస్తున్నారని ప్లాస్టిక్ సర్జరీలు.. చివరికి గుర్తుపట్టలేనంత అందంగా..

Mar 5 2021 @ 18:10PM

ఇంటర్నెట్ డెస్క్: సమాజంలో మనిషి బాహ్య రూపానికి మాత్రమే అంతా విలువ, గౌరవాలనిస్తారనే చేదు నిజాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సిందే. అందంగా లేని వారిని వారి చుట్టుపక్కల వారే హేళన చేస్తుంటారు, అవమానిస్తుంటారు. అలాంటి పరిస్థితులే ఎదుర్కొన్న ఓ యువకుడు.. ఎలాగైనా తన రూపాన్ని మార్చుకోవాలని అనుకున్నాడు. దాని కోసం ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నాడు. వాటి తరువాత ఏకంగా ఎవరూ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. వియ‌త్నాంకు చెందిన ఏళ్ల డూ కూయెన్‌ అనే 26 కుర్రాడు అందంగా లేడని అతడిని అంతా ఎగతాళి చేసేవారు. ఏ ఇంట‌ర్వ్యూకి వెళ్లినా అక్క‌డ అవ‌మానాలు ఎదుర‌య్యేవి. ఇంట‌ర్వ్యూ చేసే వ్య‌క్తులు అత‌ని మొహాన్ని చూసి హేళన చేసేవారు. దీంతో కూయెన్‌కు బాధకలిగేది. ఎలాగైనా త‌న ముఖాన్ని అందంగా మార్చుకోవాల‌ని నిశ్చయించుకున్నాడు. తాను ఎలా అయితే అందంగా ఉంటానో తెలుసుకోవాలనుకున్నాడు. దానికోసం మేక‌ప్ ఆర్టిస్ట్‌గా ఉద్యోగం సంపాదించాడు. ఆ ఉద్యోగం చేస్తూనే దాదాపు రూ.12 ల‌క్ష‌లకు పైగా కూడబెట్టాడు.

 

తన ముఖానికి సర్జరీ చేయించుకునేందుకు ఓ ప్లాస్టిక్ సర్జన్‌ను కలిశాడు. సర్జరీ చేసి అందంగా మార్చాలని కోరాడు. డాక్టర్లు అతడి ముఖాన్ని చెక్ చేసి, పూర్తిగా మార్చాలంటే ఎక్కువ సర్జరీలు చేయాల్సి వస్తుందని చెప్పారు. దానికి ఒప్పుకున్న కూయెన్ తన వద్ద ఉన్న మొత్తాన్ని ఆ డాక్టర్‌కు ఫీజ్ రూపంలో చెల్లించి, మొత్తం 9 స‌ర్జ‌రీలు చేయించుకున్నాడు. సర్జరీలన్నీ సక్సెస్ అయ్యాయి. ప్రస్తుతం కూయెన్ ఎవరూ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. ఎంతలా అంటే ముఖం మారిన తర్వాత ఇంటికి వెళ్తే తల్లిదండ్రులు కూడా తనని గుర్తుపట్టలేకపోయారట. 

ఇదిలా ఉంటే తన రూపం పూర్తిగా మార్చుకున్న కూయెన్.. స‌ర్జ‌రీకి ముందు ఫొటోను, ఇప్ప‌టి ఫొటోను తన టిక్ టాక్‌లో షేర్ చేశాడు. అందులో తాను ఎదుర్కొన్న అవ‌మానాలు, ఛీత్కారాల‌ను వివ‌రించాడు. ఆ రెండు ఫొటోలు చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Follow Us on:
Advertisement