మరుగుదొడ్ల నిర్మాణంలో అవతకవకలపై విజిలెన్స్‌ అధికారుల విచారణ

ABN , First Publish Date - 2020-11-29T06:23:31+05:30 IST

చోడవరంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదులపై డ్వామా విజిలెన్స్‌ అధికారి చంద్రకళ ఆధ్వర్యంలో శనివారం విచారణ చేపట్టారు.

మరుగుదొడ్ల నిర్మాణంలో అవతకవకలపై విజిలెన్స్‌ అధికారుల విచారణ
సమావేశంలో మాట్లాడుతున్న విజిలెన్స్‌ అధికారి చంద్రకళ

ఇంటింటికీ వెళ్లి ఆరా తీయండి: విజిలెన్స్‌ అధికారి

డిసెంబరు 5 నాటికి నివేదిక ఇవ్వాలని వలంటీర్లకు ఆదేశం


చోడవరం, నవంబరు 28: చోడవరంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదులపై డ్వామా విజిలెన్స్‌ అధికారి చంద్రకళ ఆధ్వర్యంలో శనివారం విచారణ చేపట్టారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో గ్రామ వలంటీర్లు, గతంలో పనిచేసిన ఎంపీడీవో, ఈవోపీఆర్డీ, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. 2500 వ్యక్తిగత మరుగుదొడ్లలో కొన్ని నిర్మించకుండానే నిర్మించినట్టుగా రికార్డుల్లో చూపించి నిధులు స్వాహా చేశారని, కొందరి లబ్ధిదారుల పేర్లతో వేరొకరికి చెల్లింపులు చేశారని, దీనిపై సమగ్రంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని వలంటీర్లు, సచివాలయ సిబ్బందిని విజిలెన్స్‌ అధికారి ఆదేశించారు. ఇప్పటివరకు 850 మరుగుదొడ్ల వివరాలు సేకరించామని, మిగిలిన వివరాల కోసం కొంత సమయం కావాలని వలంటీర్లు కోరడంతో డిసెంబరు 5వ తేదీ నాటికి విచారణ చేయాలని ఆమె సూచించారు.

సమావేశంలో గత ఎంపీడీవో జీవీ చిట్టిరాజు మాట్లాడుతూ గతంలో ఉన్న పరిస్థితులు, తమకు నిర్దేశించిన లక్ష్యాలను అందుకునే క్రమంలో అక్కడక్కడ కొన్ని పొరపాట్లు జరిగి ఉండవచ్చని, మొత్తమ్మీద పనులన్నీ పూర్తిచేశామని చెప్పారు. సమావేశంలో స్థానిక ఎంపీడీవో ఎస్డీ శ్యాంసుందర్‌, ఈవోపీఆర్డీ చైతన్య పాల్గొన్నారు. కాగా, దీనిపై గతంలో ఉన్నతాధికారులు విచారణ చేపట్టగా, ఫిర్యాదులో వ్యక్తుల వివరాలు లేకపోవడం.. ఫిర్యాదుదారులు ముందుకు రాకపోవడంతో ఫిర్యాదు అవాస్తవమని స్పష్టం చేశారు.  అయితే, ఫిర్యాదుదారు లేకపోయినప్పటికీ ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేయడంతో శనివారం మరలా విచారణ చేపట్టారు.

Updated Date - 2020-11-29T06:23:31+05:30 IST