డెంగీ జ్వరం పట్ల అప్రమత్తత అవసరం

ABN , First Publish Date - 2022-06-29T05:26:36+05:30 IST

డెంగీ జ్వరాలు మళ్లీ ప్రబలే అవకాశం కనిపిస్తోందని, అవగాహన పెంచుకుటే అరికట్టవచ్చని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ నాగరాజు అన్నారు.

డెంగీ జ్వరం పట్ల అప్రమత్తత అవసరం
చెన్నూరు అరుంధతీవాడలో మాట్లాడుతున్న డీఎంహెచ్‌ఓ

చెన్నూరు, జూన్‌ 28 : డెంగీ జ్వరాలు మళ్లీ ప్రబలే అవకాశం కనిపిస్తోందని, అవగాహన పెంచుకుటే అరికట్టవచ్చని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ నాగరాజు అన్నారు. చెన్నూరు అరుంధతీ నగర్‌లో ఓ మహిళకు డెంగీ జ్వరం సోకినట్లుగా రిపోర్టు రావడంతో డీఎంహెచ్‌ఓ మంగళవారం ఆప్రాంతాన్ని పరిశీలించారు. అంతేకాక అక్కడి ప్రజలతో మాట్లాడి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు నీటిని నిలువ లేకుండా చూసుకోవాలన్నారు. డెంగీ కేసుల నివారణకు వైద్య ఆరోగ్య సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ప్రస్తుత సీజన్‌లో అడపదడపా వర్షాలు కురవడం వల్ల లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వకుండా గ్రామ పంచాయతీల ద్వారా గుంతలను పూడ్పించాలన్నారు. ప్రధానంగా ఇంటిలో నీరు నిల్వ ఉండకుండా చేసుకోవడం, ఇంటి ఆవరణలో మురికినీరు ఎండిపోయేలా చూడాలన్నారు. చిన్నపాటి జ్వరం వచ్చి మూడు నాలుగు రోజులు తగ్గకపోతే తక్షణం సమీప ఆరోగ్య కేంద్రానికి వెళ్లి వైద్యం చేయించుకోవాలన్నారు. వైద్య సిబ్బంది కూడా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ.. ఒక్క డెంగీ కేసు వచ్చినా అప్రమత్తం కావాలని సూచించారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ చెన్నారెడ్డి, సర్పంచ్‌ వెంకటస్బుయ్య, కార్యదర్శి రామసుబ్బారెడ్డి,  వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-29T05:26:36+05:30 IST