వచ్చే మూడేళ్లలో ఏటా 15 కేంద్రాలు

ABN , First Publish Date - 2021-11-28T08:06:45+05:30 IST

సమగ్ర డయాగ్నోస్టిక్‌ సేవలు అందిస్తున్న విజయా డయాగ్నోస్టిక్‌ సెంటర్‌.. వచ్చే రెండు మూడేళ్లలో ఏడాదికి 14-15 డయాగ్నోస్టిక్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది.

వచ్చే మూడేళ్లలో ఏటా 15 కేంద్రాలు

  •  విజయా డయాగ్నోస్టిక్స్‌ 


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): సమగ్ర డయాగ్నోస్టిక్‌ సేవలు అందిస్తున్న విజయా డయాగ్నోస్టిక్‌ సెంటర్‌.. వచ్చే రెండు మూడేళ్లలో ఏడాదికి 14-15 డయాగ్నోస్టిక్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. హబ్‌ అండ్‌ స్పోక్‌ మోడల్‌లో ఈ కేంద్రాలను నెలకొల్పనుంది. గతంలో ఏడాదికి 15 కేంద్రాలను ఏర్పాటు చేసిన చరిత్ర ఉంది. ఇదే స్థాయి విస్తరణను రానున్న కాలంలో కూడా కొనసాగిస్తామని విజయా డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ సీఈఓ సుప్రితా రెడ్డి తెలిపారు. సొంత కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటే ఇతర డయాగ్నోస్టిక్‌ సంస్థలను కూడా కొనుగోలు చేయడానికి విజయా డయాగ్నోస్టిక్‌ సుముఖంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌), కోల్‌కతాలో కంపెనీకి మొత్తం 85 డయాగ్నోస్టిక్‌ కేంద్రాలు, 11 రిఫరల్‌ ల్యాబ్‌ లు ఉన్నాయి. రోజుకు 10 వేల మంది రోగులకు సేవలు అందిస్తోంది. ఏడాదికి దాదాపు 90 లక్షల డయాగ్నోస్టిక్‌ టెస్టులు చేస్తోంది. 

 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రధమార్ధంలో 5 కేంద్రాలను ఏర్పాటు చేసింది. మిగిలిన 10 కేంద్రాలను ద్వితీయార్ధంలో నెలకొల్పనుంది. ఇందులో 4 హబ్‌లు, 11 స్పోక్‌ కేంద్రాలు ఉండగలవని సుప్రితా రెడ్డి వివరించారు. 15 కేంద్రాలను ఏర్పాటు చేయడానికి దాదాపు రూ.70-75 కోట్లు ఖర్చవుతుంది. దీని ప్రకారం వచ్చే మూడేళ్లలో విజయా డయాగ్నోస్టిక్‌ దాదాపు రూ.200 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనుంది. 

తూర్పు ప్రాంతంపై దృష్టి: ప్రధానంగా ఏపీ, తెలంగాణల్లో కొత్త ప్రాంతాల్లో కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీంతోపాటు తూర్పు ప్రాంతంపై కూడా దృష్టి పెట్టింది. తూర్పు ప్రాంతాన్ని కీలకంగా భావిస్తున్నామని సుప్రితా అన్నారు. 

2014లో బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీ అయిన మెడినోవా డయాగ్నోస్టిక్‌ను విజయా డయాగ్నోస్టిక్‌ కొనుగోలు చేసింది. మెడినోవా పేరుతో కోల్‌కతాలో కంపెనీ హబ్‌ కేంద్రాన్ని నిర్వహిస్తోంది. 

Updated Date - 2021-11-28T08:06:45+05:30 IST