భద్రాద్రిలో వైభవంగా శ్రీరామలీలా మహోత్సవం

ABN , First Publish Date - 2021-10-17T07:06:38+05:30 IST

భద్రాద్రిలో వైభవంగా శ్రీరామలీలా మహోత్సవం

భద్రాద్రిలో వైభవంగా శ్రీరామలీలా మహోత్సవం
భద్రాచలంలో జమ్మిచెట్టు వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అర్చకులు

సంప్రదాయబద్ధంగా శమీపూజ 

రాములోరికి మహాపట్టాభిషేకం

ఖమ్మం జమ్మిబండ వద్ద ఘనంగా దసరా ఉత్సవాలు  

భద్రాచలం/ఖమ్మం ఖానాపురంహవేలి, అక్టోబరు 16: భద్రాచల శ్రీసీతా రామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో విజయదశమి సందర్భంగా శుక్ర వారం శమీపూజ, లీలామహోత్సవం వైభవోపేతంగా నిర్వహించారు. శ్రీరామాయణ పారాయణ సమాప్తిని పురస్కరించుకొని శ్రీ రామ మహా పట్టాభిషేకాన్ని నిర్వహించారు.దసరా సందర్భంగా పదిరోజులపాటు శ్రీమద్రా రామాణ పారాయణం నిర్వహించారు. చివరి రోజున పూర్ణాహుతి చేశారు.

సంప్రదాయంగా శమీపూజ

శ్రీ సీతారామచంద్రస్వామికి మహారాజు అలంకారం చేసి మేళతాళాలతో శమీ పూజకు స్థానిక దసరా మండపం వద్దకు తీసుకొచ్చారు. సంప్రోక్షణ నిర్వహించి షోడపోచారాతో శమీ వృక్షానికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సుదర్శనం, ఖడ్గం, ధనస్సు, గధ తదితర ఆయుధాలకు పూజలు చేసి ఉద్వాసన పలికారు. చివరగా ఇంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరునకు ఆవాహనం చేసి బాణాలు సంధించారు. ఈ సందర్భంగా జమ్మి పత్రాలు అక్షింతలతో అర్చన చేసి చివరగా వాటిని భక్తుల శిరస్సుపై చల్లారు. అనంతరం శ్రీరామ లీలా మహోత్సవాన్ని నిర్వహించగా వందలాది మంది భక్తులు తిలకించారు. ఈ సందర్భంగా ఉప ప్రధాన అర్చకులు పొడిచేటి సత్యనారాయణాచార్యులు రావణాసుర బొమ్మపై బాణాన్ని సంధించారు. కొవిడ్‌ నిబంధనల మేరకు భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో బి.శివాజీ,  ఏఈవో బి.శ్రవణ్‌కుమార్‌, వైదిక పరిపాలన సిబ్బంది పాల్గొన్నారు. 

జమ్మిబండ వద్ద ఘనంగా దసరా ఉత్సవాలు 

ఖమ్మం నగరంలోని జమ్మిబండ వద్ద దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. లక్ష్మీనర్సింహస్వామిదేవాలయం నుంచిఆ స్వామివారికి ఘనంగా పారువేట కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయానికి ప్రతీకగా రావణ దహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, దేవాదాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. పోలిస్‌శాఖ ఆధ్వర్యంలో నగరంలోని సీటీ సాయుద దళాల హెడ్‌ క్వార్టర్స్‌ కార్యాలయంలో శుక్రవారం ఆయుధ పూజ నిర్వహించారు. ఈ సందర్బంగా సీపీ విష్ణు ఎస్‌.వారియర్‌  కుటుంబ సమేతంగా పోలీసు వాహనాలు, ఆయుధాలకు ప్రతేక పూజలు నిర్వహించారు. 



Updated Date - 2021-10-17T07:06:38+05:30 IST