సంబరాల విజయదశమి

ABN , First Publish Date - 2021-10-17T04:43:24+05:30 IST

దసరా వేడుకలు మెదక్‌ జిల్లావ్యాప్తంగా శుక్రవారం వైభవంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే ఆలయాల వద్ద భక్తులు బారులుతీరారు. మెదక్‌లోని కోదండరామాలయం, వేంకటేశ్వర ఆలయం, బోరంచమ్మ, బాలాజీ మఠం, శిరిడీసాయి ఆలయాల్లో భక్తుల సందడి నెలకొన్నది. ఆర్ధరాత్రి వరకు ఆలయాలకు భక్తుల తాకిడి కొనసాగింది. మండపాల్లో దుర్గాదేవిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

సంబరాల విజయదశమి
మెదక్‌లో దసరా ఉత్సవాల్లో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పద్మారెడ్డి

మెదక్‌ జిల్లాలో ఘనంగా వేడుకలు

ఊరూరా జమ్మి, ఆయుధ పూజలు

జిల్లా కేంద్రంలో సందడిగా ఉత్సవాలు


మెదక్‌ అర్బన్‌, అక్టోబరు 16: దసరా వేడుకలు మెదక్‌ జిల్లావ్యాప్తంగా శుక్రవారం వైభవంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే ఆలయాల వద్ద భక్తులు బారులుతీరారు. మెదక్‌లోని కోదండరామాలయం, వేంకటేశ్వర ఆలయం, బోరంచమ్మ, బాలాజీ మఠం, శిరిడీసాయి ఆలయాల్లో భక్తుల సందడి నెలకొన్నది. ఆర్ధరాత్రి వరకు ఆలయాలకు భక్తుల తాకిడి కొనసాగింది. మండపాల్లో దుర్గాదేవిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వివిధ వృత్తులవారు, పరిశ్రమలు, వ్యాపార సంస్థల్లో ఆయుధపూజ, వాహనాల పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆలయాల్లో జమ్మి పూజలు నిర్వహించారు.


మెదక్‌ జిల్లాకేంద్రంలో..

జిల్లాకేంద్రంలోని జూనియర్‌ కళాశాల మైదానంలో మెదక్‌ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దసరా వేడుకలను వైభవంగా నిర్వహించారు. ప్రజలు వేలాదిగా తరలిరావడంతో మైదానం కిక్కిరిసింది. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి హాజరై మాట్లాడుతూ జిల్లాలో ఉన్న వనరులను వినియోంగిచుకొని అభివృద్ధి చేస్తామన్నారు. అర్హులైన పేదలకు త్వరలోనే డబుల్‌బెడ్‌రూం ఇళ్లను అందజేస్తామన్నారు. సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా నూతన కలెక్టరేట్‌ను ప్రారంభించుకుంటామన్నారు. కరోనా మహమ్మారి ముప్పు తొలగిపోవాలని ఆశించారు. అనంతరం రావణాసుర దహనం నిర్వహించారు. ప్రజలు జమ్మి ఆకును ఇచ్చిపుచ్చుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. దసరా వేడుకల్లో భాగంగా దీపావళిని తలపించేలా రెండు గంటలు బాణాసంచా కాల్చారు. అకాశం నుంచి తారాజువ్వలు రాలుతున్నట్టు బాణాసంచా ఆకట్టుకుంది. తారాజువ్వల కాంతిలో పటాకుల మోతకు మైదానం హోరెత్తింది. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బట్టి జగపతి, కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, శ్రీనివాస్‌, ఆంజనేయులు, లక్ష్మీనారాయణగౌడ్‌, లలిత, యశోద, రుక్మిణి, లక్ష్మి, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్‌, ఉత్సవ కమిటీ సభ్యులు కృష్ణాగౌడ్‌, చింతల వినోద్‌, గంజి శ్రీనివాస్‌, గంగ వెంకటేశం, పూనరవి, రాయకంటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


భక్తిశ్రద్ధలతో దుర్గామాత నిమజ్జనం

మండపాల్లో నవరాత్రులు పూజలందుకున్న దుర్గామాత నిమజ్జనోత్సవాలు శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తొమ్మిది రోజులు 9 రూపాల్లో పూజలందుకున్న దుర్గామాతకు భక్తులు వీడ్కోలు పలికారు. భవానీ దీక్షాపరులు, ఉత్సవ కమిటీ నిర్వాహకులు కాషాయ ధ్వజాలను చేతబూని, భజనలు, భక్తిపాటల నడుమ అమ్మవారి శోభయ్రాత నిర్వహించి నిమజ్జనం పూర్తిచేశారు. 


ఏడుపాయలలో పల్లకీసేవ

పాపన్నపేట, అక్టోబరు 16: ఏడుపాయల వనదుర్గామాత క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా మండపం నుంచి అమ్మవారి విగ్రహాన్ని మంజీరా నది వరకు పల్లకిలో ఊరేగింపుగా తీసుకువెళ్లి నిమజ్జనం చేశారు. పల్లకీసేవలో నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, ఈవో సార శ్రీనివాస్‌, భక్తులు పాల్గొన్నారు. విజయదశమి రోజున అమ్మవారు రాజరాజేశ్వరీ దేవిగా దర్శనమిచ్చారు. పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. 

Updated Date - 2021-10-17T04:43:24+05:30 IST