వెనక్కి తగ్గిన విజయన్

ABN , First Publish Date - 2020-11-25T06:21:10+05:30 IST

కేరళలో రాష్ట్ర పోలీసు చట్టానికి చేసిన సవరణను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్నది. సైబర్ నేరాలను అరికట్టడం పేరు మీద తలపెట్టిన...

వెనక్కి తగ్గిన విజయన్

కేరళలో రాష్ట్ర పోలీసు చట్టానికి చేసిన సవరణను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్నది. సైబర్ నేరాలను అరికట్టడం పేరు మీద తలపెట్టిన వివాదాస్పద సవరణ ఆర్డినెన్స్‌ను రద్దు చేస్తూ గవర్నర్ మరొక ఆర్డినెన్స్‌ను జారీ చేయనున్నారు. ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బిజెపి నుంచే కాక, ప్రభుత్వ భాగస్వామ్య పక్షాలనుంచి కూడా తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ముఖ్యమంత్రి పినరాయి విజయన్ వెనుకడుగు వేయక తప్పలేదు. పోలీసు చట్టానికి చేయతలపెట్టిన సవరణ, వామపక్ష ప్రభుత్వానికి ఎంతో అప్రదిష్ట తెచ్చింది. వామపక్ష ప్రభుత్వాలంటే కమ్యూనిస్టు అభిమానులు కానివారికి కూడా గౌరవం, నమ్మకం ఉంటాయి. ప్రభుత్వ యంత్రాంగం సమర్థంగా పనిచేస్తుందని, నాయకులు వ్యక్తిగతంగా తాము అవినీతికి దూరంగా ఉంటూ అధికారయంత్రాంగాన్ని కూడా దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తారని, ప్రభుత్వ విధానాలు ప్రజాపక్షపాతంతో ఉంటాయని విశ్వసిస్తారు. కానీ, ఇటీవలి కాలంలో ప్రజలకు భిన్నమైన అనుభవాలు ఎదురవుతున్నాయి.


కేరళ పోలీసుచట్టంలో కొత్తగా చేర్చిన 118ఎ అనే సెక్షన్ ఏమి చెబుతోంది? ఏ సమాచార సాధనం ద్వారా కానీ, ఏ విషయంలో అయినా కానీ, ఒక వ్యక్తిని లేదా కొందరు వ్యక్తుల శ్రేణిని బెదిరించడం కానీ, దుర్భాషలాడడం కానీ, కించపరచడం కానీ, పరువుకు భంగం కలిగించడం కానీ, ఆ ఆరోపణ, నింద, దుర్భాష అసత్యమని తెలిసీ, అవతలివారి మనసుకు, పరువుకు, ఆస్తులకు నష్టం కలిగిస్తుందని తెలిసీ, చేస్తే మూడు సంవత్సరాల దాకా శిక్ష, పదివేల రూపాయల దాకా జరిమానా విధించడం జరుగుతుంది.- ఇంత అస్పష్టంగా, ఇంత అతివ్యాప్తితో కూడిన సెక్షన్ మరొకటి ఉండదు. నిజానికి, ఈ సెక్షన్ కొత్తదేమీ కాదు. గతంలో 118 (డి) సెక్షన్‌గా కేరళ పోలీసుచట్టంలో ఉన్నదే. దాన్ని 2015లో సుప్రీంకోర్టు శ్రేయా సింఘాల్ కేసులో ఐటి చట్టం, 2000లోని 66ఎ సెక్షన్‌తో పాటుగా కొట్టివేసింది. సుప్రీంకోర్టు కొట్టివేసిన దాన్ని మళ్లీ చేర్చి, చట్టరూపం ఇవ్వాలని కేరళ ప్రభుత్వం ప్రయత్నించింది? ఎందుకు? సామాజిక మాధ్యమాలలో మహిళలకు బెదిరింపులు, అవమానాలు పెరిగిపోతున్నాయి కాబట్టి, వాటిని నివారించడానికి అట. పైన చెప్పిన చట్టసవరణలో ఎక్కడా సామాజిక మాధ్యమాలు అని లేదు. ఏ సమాచారసాధనం ద్వారా అయినా అని చెప్పారు. 


సామాజిక మాధ్యమాలలో అభ్యంతరకరంగా ప్రవర్తించేవారిని, అవమానపరిచేవారిని నిరోధించడానికి ఐటిచట్టంలో 67వ సెక్షన్, భారత శిక్షా స్మృతిలో 506, 509, 500 సెక్షన్లు ఉన్నాయి. సాక్షాత్తూ, సవరణ తలపెట్టిన కేరళ పోలీసుచట్టంలోనే 119 (బి) సెక్షన్ మహిళలను అసభ్యంగా చిత్రించడం, ఫోటోలు ప్రసారం చేయడం వంటి నేరాలను అరికట్టేందుకు ఉద్దేశించింది. మరి కొత్తగా ఈ చట్టసవరణ ఎందుకు అవసరమైంది? సామాజిక మాధ్యమాలలో కట్టు తప్పి ప్రవర్తించడం పెరిగిపోతున్న మాట నిజమే. మరో వైపు రాజకీయ అసమ్మతి, వ్యతిరేకత కూడా మాధ్యమాలలో స్వేచ్ఛగా, ఒక్కోసారి అభ్యంతరకరంగా వ్యక్తమవుతున్నాయి. సామాజిక మాధ్యమాలను ఉపయోగించేవారు అసంఖ్యాకం కాబట్టి, సమస్యలు కూడా అధికంగా ఉంటున్నాయి. మాధ్యమాల నిర్వాహకులు కొంతవరకు సమస్యలను పరిష్కరిస్తున్నారు. గుర్తింపు లేకుండా ఖాతాలను అనుమతించడం లేదు. అభ్యంతరాలు వెలువడినప్పుడు వెంటనే స్పందించి చర్య తీసుకుంటున్నారు. ఫేస్ బుక్ మాధ్యమం మొత్తంగా కొన్ని రాజకీయ పక్షాలకు అనుకూలంగా, కొన్నిటికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నదన్న ఆరోపణలు ఇటీవల రావడం, సంబంధిత ఉన్నతోద్యోగి 


ఆ మాధ్యమం నుంచి నిష్క్రమించడం తెలిసినదే. కాబట్టి, ఎక్కడా నిరోధాలు లేవనడం సరి కాదు. కేరళ ప్రభుత్వం తలపెట్టిన నిరోధం, మొత్తంగా భావప్రకటనా స్వేచ్ఛకే గురిపెట్టిన అస్త్రం. ఈ మధ్య కాలంలో కేరళ ప్రభుత్వంపై రాజకీయ విమర్శలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఆర్డినెన్స్ వెలువడిందని కొందరి విమర్శ. కావచ్చు. కొవిడ్–19 కట్టడి విషయంలో ఎంతో సమర్థంగా వ్యవహరించిందని మొదట పేరు తెచ్చుకున్న కేరళ ప్రభుత్వం మలివిడత విజృంభణతో విమర్శల పాలయింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే ఉద్యోగిని ఒక విదేశం నుంచి పెద్దమొత్తంలో బంగారం తీసుకురావడంపై పినరాయి విజయన్ పైనే మీడియాలో సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇక పోలీసు ఎన్ కౌంటర్లు, ఉపా చట్టాన్ని యథేచ్ఛగా ఉపయోగించడం- కేరళ ప్రభుత్వానికి ప్రజాస్వామిక వర్గాలలో గౌరవాన్ని తగ్గించింది. ఇక అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో పర్యావరణ రక్షణలను కనీసంగా పట్టించుకోవడం లేదన్న పేరు కూడా కేరళ ప్రభుత్వానికి ఉన్నది. 


గత నాలుగేళ్లుగా కేరళలో వామపక్ష ప్రజాతంత్ర కూటమే (ఎల్‌డిఎఫ్) అధికారంలో ఉన్నది. వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కేరళలో రాజకీయ వేడి పెరగనున్నది. వామపక్ష కూటమి విధానాలు రానున్న నెలలలో మరింతగా చర్చలోకి వస్తాయి. ప్రజాభిప్రాయానికి స్పందించే గుణం ఉన్నది కాబట్టే, కేరళ ఎల్‌డిఎఫ్ చట్టసవరణను ఉపసంహరించుకుంటున్నది- అని మార్క్సిస్టు పార్టీ నాయకుడు సీతారామ్ ఏచూరి చేసిన వ్యాఖ్య ఆశ్చర్యకరంగా ఉన్నది. తలపెట్టిన చట్టసవరణ, ప్రజలకు, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైనదని మార్క్సిస్టులకు తెలియదా? ఆ చట్టం తేవడమే తప్పంటే, దాన్ని ఉపసంహరించుకోవడం ఓ గొప్ప అన్నట్టుగా చెప్పడం విచిత్రంగా ఉన్నది. కమ్యూనిస్టు పార్టీలకు కూడా రాష్ట్రాల విభాగాలపై మునుపటి వలె పట్టు లేదు. పార్టీ విధానాలు కాక, వ్యక్తుల నాయకత్వ లక్షణాలు గెలిపించే దశకు ఆ పార్టీలూ చేరుకున్నాయి. విజయన్‌ను గట్టిగా ఒక మాట అనగలిగే అధికారం పార్టీ అగ్రనేతలకు ఉన్నదో లేదో తెలియదు. ఒకవేళ అన్నా ఆయన వినకపోవచ్చు.

Updated Date - 2020-11-25T06:21:10+05:30 IST