విజయపురం భూబాగోతం నిజమే

ABN , First Publish Date - 2020-09-27T15:43:52+05:30 IST

విజయపురం మండలంలో భూఅక్రమాలు నిజమేనని అధికారుల విచారణలో..

విజయపురం భూబాగోతం నిజమే

ఉన్నతాధికారులకు అందిన నివేదిక

సర్వేయర్‌ సస్పెన్షన్‌, మరికొందరిపై చర్యలు?


చిత్తూరు(ఆంధ్రజ్యోతి): విజయపురం మండలంలో భూఅక్రమాలు నిజమేనని అధికారుల విచారణలో నిర్ధారణ అయినట్లు తెలిసింది.  వైసీపీ నేతలు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై వంద ఎకరాల ప్రభుత్వ భూముల్ని మాయం చేశారంటూ ఆగష్టు 25న ‘వైసీపీ నేతల భూబాగోతం’ శీర్షికన ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రచురించింది. ఉన్నతాధికారులు స్పందించి స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ రాజశేఖర్‌ను విచారణాధికారిగా నియమించారు. ఈయన ఆధ్వర్యంలో క్షేత్రస్థాయినుంచి పలు రికార్డులను పరిశీలించి సమాచారం సేకరించినట్లు తెలిసింది.


విజయపురం మండలంలోని పలు గ్రామాలకు చెందిన 84మంది సుమారు 300 ఎకరాలను తమ పేరిట ఆన్‌లైన్‌లో ఎక్కించుకున్నట్లు బయటపడిందని తెలుస్తోంది. విచారణ నివేదిక రెండు వారాల కిందటే ఉన్నతాధికారులకు అందిందంటున్నారు. ఇందులో భాగంగానే 84మందిని జేసీ కోర్టుకు హాజరుకావాలని రెవెన్యూ జేసీ మార్కండేయులు నోటీసులిచ్చారు. వీరిలో కొందరు శనివారం జేసీ కోర్టుకు హాజరయ్యారు. లాయర్ల ద్వారా కొందరు, సొంతంగా మరికొందరు వివరణలు ఇచ్చుకున్నారు. 


అధికారులపై చర్యలు

ఇలా ఉండగా ఇదే అంశం నేపథ్యలోనే విజయపురం మండల సర్వేయర్‌ ప్రభాకర్‌రావును సస్పెండ్‌ చేస్తూ శనివారం జేసీ మార్కండేయులు ఉత్తర్వులు జారీ చేశారు. మండల స్థాయి అధికారి సహా.. ఇతర సిబ్బంది మీద కూడా నేడో, రేపో చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కలెక్టర్‌ భరత్‌గుప్తా కరోనా కారణంగా హోమ్‌ ఐసొలేషన్‌లో ఉన్నారు. ఆయన సోమవారం నుంచి విధులకు హాజరయ్యే అవకాశాలున్నాయి. ఆయన వచ్చిన వెంటనే చర్యలకు సంబంధించిన ఫైల్‌ కదిలే అవకాశం ఉంది. ఈ అక్రమాల వెనుక వైసీపీ నేతలుండడంతో అసలు కారకులైన అధికారుల మీద చర్యలుంటాయా, ఉండవా అని కూడా కొందరు చర్చించుకుంటున్నారు.

Updated Date - 2020-09-27T15:43:52+05:30 IST