ఆర్థిక మంత్రిగా విజయసాయిరెడ్డి!

ABN , First Publish Date - 2022-03-14T01:49:43+05:30 IST

ఆర్థికమంత్రిగా ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆ పదవిపై ఆసక్తి చూపడం లేదనే ప్రచారం జరుగుతోంది.

ఆర్థిక మంత్రిగా విజయసాయిరెడ్డి!

అమరావతి: ఆర్థికమంత్రిగా ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆ పదవిపై ఆసక్తి చూపడం లేదనే ప్రచారం జరుగుతోంది. బుగ్గనను తొలగిస్తే ఆయన స్థానం శిల్పా చక్రపాణిరెడ్డి పేరు పరిశీలనలోకి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నానాటికి దిగజారుతున్న తరుణంలో బుగ్గన మాత్రమే ఆ శాఖను నిర్వహించడమే కాకుండా.. ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రులతో మాట్లాడి నిధులు సమీకరించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. 


ఇదే సమయంలో మరో చర్చ కూడా జోరుగా సాగుతోంది. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ప్రస్తుతం జగన్, పార్టీ పని అప్పగించారు. ఆయనను తాడేపల్లిలోనే ఉండాలని కోరారు. అనుబంధ సంఘాలను ఇన్‌చార్జీగా నియమించారు. రానున్న రెండు సంవత్సరాల్లో ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ వ్యవహారాలు విజయసాయికి అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనకు రాజ్యసభ ఇవ్వని పక్షంలో ఎమ్మెల్సీని చేసి ఆర్థిక మంత్రిగా తీసుకుంటారని వైసీపీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ విజయసాయి కేబినెట్‌లోకి తీసుకుంటే బుగ్గనకు ఉద్వాసన పలకడం ఖాయమని చెబుతున్నారు.   


ఏపీ కేబినెట్‌లో సీఎం జగన్‌తో కలిపి మొత్తం 25 మంది మంత్రులున్నారు. ఇటీవల మరణించిన మేకపాటి గౌతమ్‌రెడ్డితో కలుపుకుంటే 26 మంది అవుతారు. ఇందులో ఆరుగురు ఎస్సీలు, ఆరుగురు బీసీలు, ఎస్టీ ఒకరు, మైనార్టీ ఒకరు ఉన్నారు. 12 మంది ఓసీలు మంత్రులుగా ఉన్నారు. మళ్లీ అదే కాంబినేషన్‌లో మంత్రివర్గ కూర్పు ఉండాలని, అవసరమైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల సంఖ్యలను పెంచి ఓసీలను తగ్గిస్తే ఎలా ఉంటుందనే దానిపై కేబినెట్‌లో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.


సీఎం కూడా ఇదే ప్రతిపాదనపై మొగ్గుచూపుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న కాపులకు ప్రాధాన్యత ఇవ్వడమా లేదా గతంలో మాదిరిగానే కొనసాగించడమా అనే అంశంపై చర్చ సాగుతోంది. ఎంత చేసిన కాపులు వైసీపీ వైపు రారని, ఆ పార్టీలోని మోజార్టీ నేతలు నమ్ముతున్నారు. ఇదే అంశంపై సీఎం వద్ద చర్చ జరుగుతోంది. 

Updated Date - 2022-03-14T01:49:43+05:30 IST