సాయిరెడ్డికి చేదు అనుభవం

ABN , First Publish Date - 2021-03-06T09:16:02+05:30 IST

రాష్ట్ర బంద్‌ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు, వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి విజయసాయిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. మద్దిలపాలెం కూడలిలో వామపక్షాలు చేపట్టిన నిరసన కార్యక్రమానికి

సాయిరెడ్డికి చేదు అనుభవం

ముందు పోస్కోతో డీల్‌ రద్దు చేసుకోండి

బంద్‌లో నిలదీసిన సీఐటీయూ కార్యకర్త


విశాఖపట్నం: రాష్ట్ర బంద్‌ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు, వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి విజయసాయిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. మద్దిలపాలెం కూడలిలో వామపక్షాలు చేపట్టిన నిరసన కార్యక్రమానికి విజయసాయిరెడ్డితోపాటు రాష్ట్ర మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కురసాల కన్నబాబు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీతో హాజరై తమ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి వ్యాఖ్యాతగా వ్యవహరించి అందరూ మానవహారంగా ఏర్పడి వాహనాల రాకపోకలను అడ్డుకోవాలని మైక్‌లో కోరారు. అనంతరం ఆయన మానవహారంగా ఏర్పడిన ఒక్కొక్కరి వద్దకు మైక్‌ను తీసుకువెళ్లి, బంద్‌తోపాటు స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై తమ అభిప్రాయాలను చెప్పాలని కోరారు. ఈ క్రమంలో సీఐటీయూ కార్యకర్త సురేశ్‌ వద్ద మైక్‌ పెట్టి తన అభిప్రాయం చెప్పాలని కోరారు. ఆయన ఊహించని విధంగా ‘ముందు మీరు పోస్కోతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయండి’ అని కోరారు. దీంతో అవాక్కయిన విజయసాయిరెడ్డి ‘ఒప్పందం ఎవరు చేసుకున్నారు?’అని ప్రశ్నించారు.


దీనిపై సురేశ్‌...‘ఎవరు చేసుకున్నా, అఽధికారంలో మీరు ఉన్నారు కాబట్టి మీరు ఆ పనిచేయండి’ అని రెట్టించి సమాధానం ఇచ్చారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన విజయసాయిరెడ్డి ‘ఆ ఒప్పందంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధం లేదు. ఒప్పందాన్ని రద్దు చేసే అధికారం కూడా లేదు. నీకు లేని అధికారాన్ని నువ్వు ప్రదర్శించలేవు’ అని అంటూ అక్కడి నుంచి మైక్‌ తీసుకుని విసురుగా మరొకరి వద్దకు వెళ్లిపోయారు. 

Updated Date - 2021-03-06T09:16:02+05:30 IST