నయవంచనలో కేసీఆర్ నెంబర్1: విజయశాంతి

ABN , First Publish Date - 2021-08-17T00:37:29+05:30 IST

బూటకపు కబుర్లతో నయవంచన చెయ్యడంలో సీఎం కేసీఆర్ నెంబర్1 అనిపించుకున్నారని బీజేపీ నేత విజయశాంతి మండిపడ్డారు.

నయవంచనలో కేసీఆర్ నెంబర్1: విజయశాంతి

హైదరాబాద్: బూటకపు కబుర్లతో నయవంచన చేయడంలో సీఎం కేసీఆర్ నెంబర్1 అనిపించుకున్నారని బీజేపీ నేత విజయశాంతి మండిపడ్డారు. సోమవారం రాములమ్మ సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేసీఆర్ చేసిన ప్రసంగం వింటే అరచేతిలో వైకుంఠం చూపించడమంటే ఏమిటో బాగా అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా ఆయన దళిత బంధు పథకం గురించి మాట్లాడుతూ రకరకాల గణాంకాలు, బడ్జెట్ కేటాయింపులంటూ అంకెల గారడీ చేశారు. తెలంగాణలోని దళితుల సమస్యలన్నిటికీ ఏకైక పరిష్కారం ఈ పథకమే అన్నట్టుగా చెప్పుకొచ్చారు. గతంలో ఆయన దళిత ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాల భూమి వంటి హామీలిచ్చినప్పుడు కూడా ఇలాంటి మాటలే మాట్లాడారు. ఆ తర్వాత దళిత ఉపముఖ్యమంత్రులిద్దరినీ పక్కకు నెట్టేసి దళితులకు ఆయన ఇచ్చిన గౌరవం ఏమిటో కళ్లారా చూశాం. ఆరంభ శూరత్వం తప్ప మరొకటి తెలియని కేసీఆర్ నైజం అందరికీ తెలిసిందే’’ అని రాములమ్మ తప్పుబట్టారు. 



కేసీఆర్ చేసిన ప్రసంగంలోని మిగతా అంశాలను రాములమ్మ ప్రస్తవిస్తూ... దేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం రెట్టింపు స్థాయిలో ఉందన్నారని, తెలంగాణ రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా అవతరించిందని చెప్పారని, పరిస్థితులు ఇంత గొప్పగా ఉన్నప్పుడు నిరుద్యోగుల ఆత్మహత్యలు, రైతులకు సమస్యలు ఇంకా ఎందుకు కొనసాగుతున్నాయో చెప్పాలని ప్రశ్నించారు. హరితహారంతో పచ్చదనం పెరిగిందన్న ముఖ్యమంత్రి... ఈ పథకం కోసం స్వంత డబ్బులు ఖర్చు చేసి అప్పుల పాలైనవారి గురించి తెలియదా? అని నిలదీశారు. రాష్ట్రాన్ని సర్కారు అంత గొప్పగా అభివృద్ధి చేసి ఉంటే... పట్టణప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాల్లో మంత్రులు, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ఎందుకు నిరసన జ్వాలలు ఎదుర్కోవలసి వచ్చిందో చెప్పాలని విజయశాంతి ప్రశ్నించారు. 

Updated Date - 2021-08-17T00:37:29+05:30 IST