కారుచౌకగా భూములు కొట్టేస్తున్న.. టీఆర్ఎస్: విజయశాంతి

ABN , First Publish Date - 2022-05-13T21:12:56+05:30 IST

టీఆర్‎ఎస్.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని బీజేపీ నేత విజయశాంతి ఆరోపించారు. కోట్ల రూపాయల విలువైన భూములను కారుచౌకగా కొట్టేస్తున్నారని మండిపడ్డారు..

కారుచౌకగా భూములు కొట్టేస్తున్న.. టీఆర్ఎస్: విజయశాంతి

హైదరాబాద్: టీఆర్‎ఎస్.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని బీజేపీ నేత విజయశాంతి ఆరోపించారు. కోట్ల రూపాయల విలువైన భూములను కారుచౌకగా కొట్టేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా వారి ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోందన్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..


‘‘అధికార పార్టీ ఆగ‌డాల‌కు అడ్డు అదుపు లేకుండా పోతోంది. టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం కోసం కారుచౌకగా భూమిని కేటాయించారు. పార్టీ హైదరాబాద్‌ జిల్లా కార్యాలయానికి ప్రభుత్వం రూ.70 కోట్ల విలువైన భూమిని కేటాయించింది. ఇంత విలువైన భూమిని గజం రూ.100 చొప్పున కేటాయించడం విచిత్రంగా ఉంది. హైదరాబాద్‌ జిల్లా షేక్‌పేట మండల పరిధిలోని బంజారాహిల్స్‌ రోడ్డు నం.12లో ఉన్న ఎన్‌బీటీ నగర్‌లో సర్వే నం.403/పీలో ఎకరం భూమిని టీఆరెస్ పార్టీ ఆఫీసు కోసం కేటాయించారు. టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌, ఎంపీ కె.కేశవరావు ఇంటి పక్కనే ఈ స్థలం ఉంది. దీన్ని కేటాయించాలని టీఆర్‌ఎస్‌ విజ్ఞప్తి చేయగానే... సచివాలయం నుంచి వచ్చిన ఆదేశాలతో ఈ నెల 9న జిల్లా కలెక్టర్‌ శర్మన్‌ ప్రతిపాదనలు పంపారు. ఆ మరుసటి రోజే భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ కార్యాలయం... భూమి కేటాయింపుపై సిఫారసు చేస్తూ ప్రభుత్వానికి ఫైలును పంపించింది.’’ 


‘‘ఆ త‌ర్వాత రోజు అంటే, మే 11న రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆగ‌మేఘాల మీద‌ భూమిని కేటాయిస్తూ జీవో నం.47ను జారీ చేశారు. ఎన్‌బీటీ నగర్‌లో గజం రూ.లక్షన్నర ధర పలుకుతోంది. అంటే ఈ భూమి విలువ రూ.70 కోట్లపైనే. కానీ, 2018 ఆగస్టు 16న ప్రభుత్వం విడుదల చేసిన పాల‌సీ ప్రకారం గజం రూ.100 చొప్పున టీఆర్‌ఎస్‌ పార్టీ ఈ స్థలానికి రూ.4.93 లక్షలు చెల్లిస్తే సరిపోతుంది. కేసీఆర్ స‌ర్కార్ అధికార దుర్వినియోగానికి ఇదొక మ‌చ్చు తున‌క మాత్ర‌మే.. ఇలాంటి రాష్ట్రవ్యాప్తంగా కోకొల్ల‌లుగా జరుగుతునే ఉన్నాయి. కేసీఆర్... నీ ఆట‌లు ఇక ఎంతో కాలం సాగ‌వు. ప్ర‌జ‌ల‌ు అన్నీ చూస్తునే ఉన్నరు. నీకు, నీ పార్టీకీ త‌గిన బుద్ధి చెప్పే రోజు తొంద‌ర్లోనే రానుంది’’. అని విజయశాంతి పేర్కొన్నారు.

Read more