ltrScrptTheme3

కేసీఆర్‌కు ఇలాంటివి వెన్నతో పెట్టిన విద్యలు: విజయశాంతి ఫైర్

Oct 19 2021 @ 20:27PM

హైదరాబాద్: దళిత బంధు అంటూ అన్నీ బంద్ చేయించి ప్రజల వెన్ను విరగ్గొడుతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై భారతీయ జనతా పార్టీ నేత విజయశాంతి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్‌కు ఇలాంటివి వెన్నతో పెట్టిన విద్యలని, పొమ్మనకుండా పొగ పెట్టడంలో ఆయనకు ఎవరూ సాటిరారని ఆమె విమర్శించారు. మంగళవారం సోషల్ మీడియా ద్వారా ఆమె స్పందిస్తూ సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.


‘‘బంధు అంటూనే బంద్ చేయించి వెన్ను విరగ్గొట్టడం ఎలాగో తెలంగాణ సీఎం గారికి వెన్నతో పెట్టిన విద్య... 

పొమ్మనకుండా పొగబెట్టి... పథకం ప్రకారం ఈటల గారిని ప్రభుత్వం నుంచి, పార్టీ నుంచీ సాగనంపిన కేసీఆర్ గారి నిజస్వరూపాన్ని హుజురాబాద్ ఉపఎన్నిక బట్టబయలు చేసింది. దళిత బంధు పథకంతో దళిత సామాజికవర్గానికి ఏదో గొప్ప మేలు చేయబోతున్నట్టు... వారి జీవితాల్ని ఉద్ధరించబోతున్నట్టు గొప్పలు చెప్పుకోవడానికి కేసీఆర్ పడుతున్న తిప్పలు ఆయన అసలు రంగును బయటపెడుతున్నాయి. గడచిన ఏడేళ్ళ టీఆరెస్ పాలనలో దళితులకు కన్నీరు తప్ప మిగిలిందేమీ లేదని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే చిన్నపిల్లాడికి సైతం ఇట్టే అర్థమవుతుంది. అసలు కేసీఆర్ గారు అధికార పీఠాన్ని అధిరోహించడానికి ముందుగా మోసం చేసింది దళితులనే... తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితుడేనంటూ ముందుగా ఈ సామాజిక వర్గాన్నే పావుగా వాడుకున్నారు. ఆ తర్వాత దళితులకు మూడెకరాల ముచ్చట చెప్పి వారిని మూడు చెరువుల నీరు తాగించి ఆనందించారు తప్ప ఒరిగిందేమీ లేదు. ఇక తాజాగా ఆయన ప్రయోగించిన అస్త్రం దళిత బంధు. పై రెండు హామీల్లాగానే దిగ్విజయంగా ఈ పథకాన్ని కూడా చాలా చాకచక్యంగా అటకెక్కించి... తన చేతికి మట్టి అంటకుండా వ్యవహరిస్తున్నారు కానీ, అందరూ ప్రతిసారీ మోసపోరనే నిజాన్ని ఆయన గ్రహించడం లేదు. దళిత బంధును అలా ప్రవేశపెట్టి ఊరించి.... లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులేయించి... డ్రా చేసుకోకుండా వెంటనే ఫ్రీజ్ చేయించి... అలా అలా లాగి లాగి ఎన్నికల కోడ్ కారణంగా అది నిలిచిపోయే వరకూ తీసుకొచ్చారు. ఈ కుతంత్రాలను ఒక పక్క ప్రయోగిస్తూనే హుజురాబాద్ ఎన్నికలయ్యే వరకు దళిత బంధు అమలు కావొద్దని ఈసీతో నిలిపి వేయించి.... ఈటల రాజేందర్ గారి పేరుతో దొంగ లేఖను సృష్టించి.... బిజెపిని బద్నామ్ చేసే కుట్రకు టీఆర్ఎస్ తెర లేపింది. ఏడాది క్రితం జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు కూడా టీఆరెస్ సరిగ్గా ఇదే కుట్రకు పాల్పడి భంగపడింది. ఆ ఎన్నికలకు ముందు హైదరాబాద్ నగరంలోని వరద బాధితులకు 10 వేల సహాయాన్ని ప్రకటించిన అధికార పార్టీ.... ఆ మాట నిలుపుకోలేక తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారి పేరుతో దొంగ లేఖను పుట్టించి, బిజెపి నేతలే వరద సహాయం రాకుండా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని ఆరోపించారు. కానీ, భాగ్యనగర ప్రజలు కేసీఆర్‌కు షాక్ ఇస్తూ... ఊహించని సంఖ్యలో బీజేపీ ప్రజాప్రతినిధులను జీహెచ్ఎంసీకి పంపించారు. అదే రీతిలో హుజురాబాద్‌లోనూ అధికార పార్టీకి షాక్ తప్పదు’’ అని విజయశాంతి తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో రాసుకొచ్చారు.


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.