రాజకీయ ఉద్దేశంతోనే పబ్‌లపై దాడులు: విజయశాంతి

ABN , First Publish Date - 2022-04-06T02:48:18+05:30 IST

బంజారాహిల్స్‌లోని పబ్‌పై పోలీసులు దాడి చేసిన ఘటనపై విజయశాంతి స్పందించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు...

రాజకీయ ఉద్దేశంతోనే పబ్‌లపై దాడులు: విజయశాంతి

హైదరాబాద్: నగరంలో ఎన్నో పబ్‌లపై డ్రగ్స్ ఆరోపణలు ఉన్నా.. కేవలం రాజకీయ ఉద్దేశంతోనే కొన్నింటిని మాత్రమే టార్గెట్ చేస్తున్నారని బీజేపీ నేత విజయశాంతి ఆరోపించారు. బంజారాహిల్స్‌లోని పబ్‌పై పోలీసులు దాడి చేసిన ఘటనపై విజయశాంతి స్పందించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అధికార పార్టీ నేతలు నడిపే పబ్‌లపై ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేందంటూ దుయ్యబట్టారు. మంగళవారం ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..


‘‘హైదరాబాద్‌లో బట్టబయలైన డ్రగ్స్ పార్టీ సంచలనం రేపుతోంది. సెలబ్రిటీలు, ప్రముఖుల పిల్లలే కాకుండా మైనర్లు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ మహమ్మారిపై ఉక్కుపాదం మోపాలి. కానీ కేసీఆర్ స‌ర్కార్ మోద్దు నిద్ర పోతోంది. హైదరాబాద్‌లోని ఎన్నో ప‌బ్స్ మీద డ్రగ్స్ ఆరోపణలున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కొకైన్, చరస్ లాంటి మత్తు పదార్థాలతో విచ్చలవిడిగా దందా నడిపిస్తున్నరు. కానీ బంజారాహిల్స్‌లోని ఒక ప‌బ్ పైనే రెయిడ్స్ చేయడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ ఉద్దేశాలతోనే ఈ దాడులు చేశారు. ఇంకా దర్యాప్తు పూర్తి కాకముందే, డ్రగ్స్ ఎవరు తీసుకున్నారనేది తేలకముందే.. కొందరిపై టీఆర్ఎస్ నేతలు బహిరంగంగా విమర్శలు చేయడం ఈ డౌట్స్‌ను బలపరుస్తున్నాయి.


‘‘145 మందిని అదుపులోకి తీసుకొని, వాళ్లను కొన్ని గంటలపాటు స్టేషన్లో ఉంచి, ఒక్కరి రక్త నమూనా కూడా సేకరించకపోవడమేంటీ..? కావాలనే కొన్ని పేర్లను మీడియాకు లీక్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 80 పబ్స్ ఉన్నాయి. 10 స్టార్ హోటల్స్‌లో 24 గంటలు లిక్కర్ సప్లయ్ చేసేందుకు అనుమతులున్నాయి. ఇలా పర్మిషన్ ఇచ్చిన వాటి నుంచి ఎక్సైజ్ శాఖ స్పెషల్ ఫీజు వసూలు చేస్తుంది. గతంలో సినీ హీరోలు, సెలబ్రిటీలు పబ్స్ నిర్వహించే వారు. కొన్నిటిపై రెయిడ్స్ సందర్భంగా హీరోల పేర్లు బయటకు వచ్చాయి. తర్వాత కొంత కాలానికే అవి అధికార పార్టీ నేతల చేతుల్లోకి వెళ్లాయి.


‘‘వాళ్లు కావాల‌నే ఇతర పబ్‌ల‌పై దాడులు చేయిస్తున్నారు. కానీ, అధికార పార్టీ నేతలు న‌డిపే వాటిలో ఇంత కన్నా దారుణంగా డ్ర‌గ్స్ దందా న‌డుస్తోంది. వీటిపై సిట్టింగ్ జ‌డ్జితో క‌మిటీ వేయాలి. క‌మిటీపై ఎలాంటి రాజ‌కీయ జోక్యం లేకుండా విచార‌ణ జ‌రిపించాలి. తెలంగాణను మరో పంజాబ్ కాకుండా జాగ్రతలు తీసుకోవాలి. యువ‌త‌ను డ్ర‌గ్స్ నుంచి దూరం చేయ‌ల్సిన బాధ్య‌త మ‌న అంద‌రీపైనా ఉంది.  డ్ర‌గ్స్ దందా చేస్తున్న ఈ దగాకోరు స‌ర్కార్‌ను గ‌ద్దె దించుదాం’’. అని విజయశాంతి పేర్కొన్నారు.



Updated Date - 2022-04-06T02:48:18+05:30 IST