ltrScrptTheme3

అన్ని అర్హతలూ ఉన్న వ్యక్తి కేసీఆర్ ఒక్కరే: విజయశాంతి

Jul 28 2021 @ 16:35PM

ఇంటర్నెట్ డెస్క్(ఆంధ్రజ్యోతి): ఏమీ లేకపోయినా అరచేతిలో స్వర్గం చూపించే ఘనుల్లో టాప్ ర్యాంక్ ఎవరికైనా ఇవ్వాలంటే అందుకు అన్ని అర్హతలూ ఉన్న ఏకైక వ్యక్తి తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక్కరేనంటూ బీజేపీ నాయకురాలు విజయశాంతి దుయ్యబట్టారు. హుజురాబాద్ ఎన్నికల నేపథ్యంలో దళితబంధు పథకం ప్రవేశపెట్టడంపై విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఎన్నికల్లో గెలవడం కోసం కొత్త కొత్త హామీలిస్తూ ప్రజల నోట్లో మన్ను కొడుతున్నారంటూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సోషల్ మీడియా ద్వారా విజయశాంతి విమర్శలు గుప్పించారు.


‘‘ఏమీ లేకపోయినా అరచేతిలో స్వర్గం చూపించే ఘనుల్లో టాప్ ర్యాంక్ ఎవరికైనా ఇవ్వాలంటే అందుకు అన్ని అర్హతలూ ఉన్న ఏకైక వ్యక్తి తెలంగాణ సీఎం కేసీఆర్ గారు మాత్రమే. ఒక పక్క తెలంగాణ ఖజానా ఖాళీ అయినా... గతంలో ఇచ్చినా హామీలు నెరవేర్చలేకపోయినా... ప్రస్తుతం అమలవుతున్న పథకాలకే న్యాయం చెయ్యలేకపోతున్నా... కొత్త హామీలు, పథకాలతో ప్రజల నోట్లో మన్ను కొడుతూ... అన్ని రోజులూ ఇలాగే ఉంటాయనుకుంటూ ఊహాలోకంలో విహరించడమేగాక గుప్పిట్లో వైకుంఠాన్ని చూపిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒకసారి గమనిస్తే... ఒకపక్క ఈ ప్రభుత్వ పథకాల కోసం పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగులో ఉన్నాయి. రైతులకు లక్షలోపు పంట రుణాల మాఫీకి డబ్బులు లేవు. వివిధ ప్రాజెక్ట్‌ల నిర్వాసితులకు సక్రమంగా పరిహారం అందించలేకపోతున్నారు. ప్రతిష్టాత్మకమైన డబుల్ బెడ్రూం పథకం నాసిరకం పనులతో ఒక అడుగు ముందుకు... పదడుగులు వెనక్కి అన్నట్టు సాగుతోంది. నిరుద్యోగుల ఆత్మహత్యలు జరుగుతుంటే నిరుద్యోగ భృతి మాటే మరిచారు. పంటలకు మద్దతు ధరలేక మంట పెట్టుకునే దుస్థితి. ఆర్టీసీని అధోగతి పాలు చేశారు. మరోపక్క కరోనా లాక్‌డౌన్ సమయంలో ఉద్యోగుల జీతాలు, పాలనాపరమైన ఖర్చుల కోసం దాదాపుగా ఇప్పటివరకూ రూ.21 వేల కోట్ల మేర అప్పులు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వేల కోట్ల రూపాయల నిధులతో ముడిపడిన దళిత బంధు పథకాన్ని అమలు చేస్తామని సీఎం గారు చెబితే నమ్మాలా? దీనికి తోడు కొత్త రేషన్ కార్డుల జారీ, వృద్ధాప్య పింఛన్ల అర్హత వయస్సు పెంపు దిశగా తెలంగాణ సర్కారు ఆలోచన చేస్తోంది. ఇప్పటికే ఆసరా పింఛన్ చెల్లింపులు చెయ్యలేక కిందా మీదా పడుతున్నారు. ఇవిగాక, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ఇన్సెంటివ్‌లు, గొర్రెల పంపిణీ యునిట్ విలువ పెంపు, 8 లక్షలకు పైగా ఎకరాల్లో ఆయిల్ ఫాం సాగుకు ప్రోత్సాహం, ఎమ్మెల్యేల నియోజకవర్గ అభివృద్ధి నిధుల పెంపు... ఇలా చూసుకుంటూ పోతే పథకాలు, హామీలే తప్ప వాటికి తగిన నిధుల సమీకరణ... ఆ మేరకు ఆదాయం గానీ, కేటాయింపులు గానీ కానరాని పరిస్థితుల్లో తెలంగాణ ఖజానాను కుంగదీశారు. ధనిక రాష్ట్రమని చెబుతూ అప్పుల పాలు చేసిన ఈ తెలంగాణ సర్కారు తన తప్పుడు నిర్ణయాలతో తెలంగాణ ప్రజల భవితవ్యాన్ని అంధకారంలోకి నెడుతోంది. పై చేష్టలు చూసినా.... సభలు, సమావేశాల్లో సీఎం గారు మాట్లాడే పిచ్చి మాటలు వింటున్నా కూడా... చిప్పు ఖరాబైందని తప్పనిసరిగా అనుకోవాల్సి వస్తుంది. వారు మానసిక సమతుల్యత లోపించి ఇలా చేస్తున్నారా?.. లేక గతంలో కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేద్దామంటే వ్యతిరేకత వచ్చింది కాబట్టి, ఈ రకమైన వింత, విపరీత విన్యాసాలు చేస్తే, ఈ సీఎం గారి కన్నా... మాట్లాడే పద్ధతి, కార్యనిర్వహణ విధంలో కేటీఆర్ గారి తీరు కొంత సెన్సిబుల్‌గా ఉంటుంది కాబట్టి, వారినే ముఖ్యమంత్రిగా చేస్తే మేలని అందరూ అనుకోవాలనే ఆలోచనతో కేసీఆర్ గారు ఇయ్యన్నీ చేస్తున్నారో తెలియదు. పై రెంటిలో కారణం ఏదైనా... ఆ అవకతవక పరిపాలన కన్నా అదే మేలేమో అన్న అభిప్రాయాన్ని ఆ పార్టీకే చెందిన కొందరు వ్యక్తం చేస్తున్నారు.’’ అంటూ తన ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాల్లో విజయశాంతి పోస్ట్ చేశారు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలనుద్దేశించి ఓ వీడియో కూడా షేర్ చేశారు.


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.