విజయాశ్వం మరో హిట్టు

ABN , First Publish Date - 2022-07-01T08:07:19+05:30 IST

విజయాశ్వం మరో హిట్టు

విజయాశ్వం మరో హిట్టు

ఇస్రో వాణిజ్య ప్రయోగం విజయవంతం

3 సింగపూర్‌ ఉపగ్రహాలతో పీఎస్‌ఎల్వీ-సీ53 నింగిలోకి


శ్రీహరికోట (సూళ్లూరుపేట), జూన్‌ 30: ఇస్రో విజయాశ్వం పీఎ్‌సఎల్వీ మరో హిట్టు కొట్టింది. మూడు విదేశీ ఉపగ్రహాలతో నింగిలోకి రివ్వున ఎగిరిన పీఎ్‌సఎల్వీ-సీ53 వాటిని విజయవంతంగా నిర్ణీత కక్ష్యల్లోకి చేరవేసింది. ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఎ్‌సఐఎల్‌)కు అద్భుత విజయాన్ని కట్టబెట్టింది. తిరుపతి జిల్లా శ్రీహరికోట సతీష్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం (షార్‌)లోని రెండవ ప్రయోగ వేదిక నుంచి గురువారం సాయంత్రం 6.02 గంటలకు ఈ ప్రయోగం జరిగింది. ఇస్రో వాణిజ్య విభాగం ఎన్‌ఎ్‌సఐఎల్‌ ఒప్పందం మేరకు మూడు సింగపూర్‌ ఉపగ్రహాలను శాస్త్రవేత్తలు నిర్ణీత కక్ష్యల్లోకి చేరవేశారు. పీఎ్‌సఎల్వీ 55వ సారి (పీఎ్‌సఎల్వీ-సీ53) రోదసిలోకి దూసుకెళ్లి ఎన్‌ఎ్‌సఐఎల్‌ వాణిజ్య ఒప్పందాన్ని విజయవంతంగా నేరవేర్చింది. 


ఇలా రోదసిలోకి..

ఈ ప్రయోగం కోసం బుధవారం మధ్యాహ్నం 4.02 గంటలకు ప్రారంభమైంది. అది 26 గంటలపాటు కొనసాగి గురువారం సాయంత్రం 6.02 గంటలకు ముగియగానే 228.4 టన్నుల బరువున్న పీఎ్‌సఎల్వీ-సీ53 రాకెట్‌ 522.8 కిలోల బరువున్న మూడు సింగపూర్‌ ఉపగ్రహాలతో నింగిలోకి దూసుకుపోయింది. 4 దశల ఈ రాకెట్‌లోని ఒక్కో దశను శాస్త్రవేత్తలు పనిచేయిస్తూ రోదసిలోకి పయనింపజేశారు. 18 నిమిషాలలో రాకెట్‌ను భూమధ్య రేఖకు 570 కిలోమీటర్ల ఎత్తుకు చేర్చి తొలుత డీఎ్‌స-ఈవో ఉపగ్రహాన్ని విడిచిపెట్టారు. తదుపరి 19.18 నిమిషాలకు ఎంఈయూఎ్‌సఏఆర్‌ను, 19.26 నిమిషాలకు స్కూబ్‌-1 ఉపగ్రహాలను విడిచిపెట్టారు. మరో 6 నిమిషాలకే ఈ ఉపగ్రహాల సంకేతాలు ఇండోనేసియాలోని బ్రూనై, బియాస్‌ భూకేంద్రాలకు అందడంతో షార్‌లోని మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌లో శాస్త్రవేత్తలతో కలసి ప్రయోగాన్ని పర్యవేక్షించిన ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ ప్రయోగం విజయవంతమైనట్టు ప్రకటించారు. 


రాకెట్‌ నాల్గవ దశతో భూ ప్రదక్షిణ

నాలుగు దశలపీఎ్‌సఎల్వీ రాకెట్‌లో ఒక్కో దశ పనిచేస్తూ రాకెట్‌ను నిర్ణీత ఎత్తుకు చేర్చి విడిపోతుంటాయి. అలా మూడు దశలు విడిపోయిన తరువాత నాల్గవ దశ (పీఎస్‌-4) ఉపగ్రహాలతో నిర్ణీత కక్ష్యకు చేరి వాటిని వదిలి రోదసిలో కలసిపోతుంటుంది. అయితే తొలిసారిగా ఇస్రో ఈ నాల్గవ దశ పీఎ్‌స-4ను పీఎ్‌సఎల్వీ, ఆర్బిటల్‌, ఎక్స్‌పర్‌మెంటల్‌ మాడ్యూల్‌ (పీవోఈఎం)గా రూపొందించి దాన్ని భూమి చుట్టూ తిరిగేలా చేశారు. ఇందులో ఆరు పేలోడ్లను ఏర్పాటు చేశారు. దీనిపై ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేయనున్నారు. కాగా.. ఇస్రో వాణిజ్య విభాగంగా కేంద్ర ప్రభుత్వం 2019లో న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ నిర్వహించిన రెండో వాణిజ్య ప్రయోగమిది.


ఈ సారి కచ్చితంగా చంద్రుడిపై దించుతాం

చంద్రయాన్‌-3 ప్రయోగంలో ఈసారి ల్యాండర్‌ను చంద్రు ని ఉపరితలంపై కచ్చితంగా దించుతామని ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ చెప్పారు. గురువారం పీఎ్‌సఎల్వీ-సీ53 ప్రయోగానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహేంద్రగిరి ఇస్రో సెంటర్‌లో ల్యాండర్‌పై పరీక్షలు జరుగుతున్నాయన్నారు. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గగనయాన్‌పై కసరత్తు చేస్తున్నామని చెప్పారు. వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపుతున్నప్పుడు వారి రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. వారి రక్షణ కోసం ప్రత్యేక మాడ్యూల్‌ తయారు చేస్తున్నామన్నారు. మానవసహిత గగనయాన్‌ ప్రయోగానికి ముందు మానవ రహిత ప్రయోగాలను చేపడుతున్నామని, ఈ ఏడాది చివర్లో ఈ ప్రయోగం ఉంటుందని చెప్పారు. కాబట్టి ఈ ఏడాది చివర్లోగానీ, వచ్చే ఏడాదిగానీ గగన్‌యాన్‌ ప్రయోగం ఉండదని స్పష్టం చేశారు. జూలై చివరిలో చిన్న చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి చేరవేసేందుకు ఎస్‌ఎ్‌సఎల్వీ రాకెట్‌ను ప్రయోగిస్తామని వెల్లడించారు. 


గవర్నర్‌ అభినందన..

పీఎ్‌సఎల్వీ-సి53 విజయవంతం కావడంపై గవర్నర్‌ విశ్వభూషణ్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. 


రాకెట్‌ పేరు : పీఎ్‌సఎల్వీ-సీ53 

తయారీ ఖర్చు : 130 కోట్లు 

ఎత్తు : 44.4 మీటర్లు 

బరువు : 228.4 టన్నులు 

ఉపగ్రహాలు : 3 (సింగపూర్‌)

1. డీఎ్‌స-ఈవో (365కిలోలు)

2. ఎన్‌ఈయూఎ్‌సఎఆర్‌ (155 కిలోలు)

3. స్కూబ్‌-1 (2.8 కిలోలు)

Updated Date - 2022-07-01T08:07:19+05:30 IST