కదలని కమిటీ..!

ABN , First Publish Date - 2021-11-08T05:23:07+05:30 IST

కదలని కమిటీ..!

కదలని కమిటీ..!

విమానాశ్రయ విస్తరణ సమస్యలు పెండింగ్‌

700 ఎకరాలు సేకరించి ఇచ్చిన గత ప్రభుత్వం

మిగతా సమస్యలపై కలెక్టర్‌ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు 

వైసీపీ వచ్చాక మూలనపడిన ప్రతిపాదనలు

రెండేళ్లుగా ఎక్కడి సమస్యలు అక్కడే..

వెనక్కి వెళ్లిపోతున్న ఎయిర్‌పోర్టు అభివృద్ధి

విజయవాడ విమానాశ్రయ విస్తరణ సమస్యల పరిష్కార కమిటీ ఉందా, లేదా అనే ప్రశ్న తలెత్తుతోంది. సమస్యల పరిష్కారం విషయంలో రెండేళ్లుగా ఎలాంటి కదలిక లేకపోవడం, వైసీపీ ప్రభుత్వం వచ్చాక కమిటీలో క్రియాశీలత్వం లోపించడం కారణంగా కీలకమైన పనులన్నీ ఆగిపోయాయి. ఫలితంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో దినదినాభివృద్ధి చెందాల్సిన ఎయిర్‌పోర్టు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ విమానాశ్రయ అభివృద్ధికి కిందటి టీడీపీ ప్రభుత్వం 700 ఎకరాలను సమీకరించి ఇచ్చింది. విమానాశ్రయ భూముల సమస్య దశాబ్దకాలంగా అపరిష్కృతంగా ఉండటంతో టీడీపీ ప్రభుత్వం రైతులను సానుకూలంగా ఒప్పించి స్వచ్ఛందంగా 700 ఎకరాలు ఇచ్చేలా కృషి చేసింది. ఫలితంగా విజయవాడ ఎయిర్‌పోర్టును రాష్ట్రంలోనే అతిపెద్ద రన్‌వే కలిగినదిగా అభివృద్ధి చేయటానికి, ఇంటీరియం, ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ భవనాల నిర్మాణానికి బీజం వేసింది. 700 ఎకరాలను స్వాధీనం చేసుకున్న ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ)కు విస్తరణ విషయంలో అనేక సమస్యలు వెంటాడాయి. వీటి పరిష్కారానికి అప్పటి ప్రభుత్వ చొరవతో కలెక్టర్‌ అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ ఎయిర్‌పోర్టు ఉన్నతాధికారులతో సమావేశమై సమస్యల పరిష్కారానికి చొరవ చూపించింది. కొన్ని పనులకు కూడా శ్రీకారం చుట్టింది. కానీ, నేడు ఆ పనులన్నీ అసంపూర్తిగా ఉండిపోయాయి. 

రెండేళ్లుగా పరిష్కారం కాని సమస్యలెన్నో..

వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల నుంచి ఈ కమిటీలో క్రియాశీలత్వం లోపించింది. ఒకటి, రెండుసార్లు భేటీ అయినా క్షేత్రస్థాయిలో మాత్రం చర్యలు తీసుకోలేదు. రెవెన్యూ శాఖకు సంబంధించి రైతులు, నిర్వాసితులకు రూ.108 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. దేవదాయ శాఖ నుంచి కూడా స్పందన  లేదు. విమానాశ్రయానికి అప్పగించిన భూముల్లో మూడు దేవాలయాలు ఉండగా, వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని కిందటి ప్రభుత్వ హయాంలో తొలగించారు. మరో రెండు ఆలయాలు ఇంకా తొలగించలేదు. వీటిని మరోచోటకు మార్పు చేయాల్సి ఉంది. రాజీవ్‌నగర్‌ కాలనీలో పశుసంవర్థక శాఖకు సంబంధించిన పశువీర్య కేంద్రంలో కొంతభాగం, ప్రహరీ వెంబడి ఇళ్లను వేరే ప్రాంతానికి మార్చే విషయంలో రెవెన్యూ, పశుసంవర్థక శాఖల మధ్య సమన్వయం లోపించింది. నూతన రన్‌వే వెంబడి ఉన్న కాల్వ మళ్లింపు పనులను ఇరిగేషన్‌ చేపట్టినప్పటికీ లెఫ్ట్‌ అవుట్‌ పోర్షన్‌ పనులు ఇంకా జరగాలి. గన్నవరం-పుట్టగుంట రోడ్డుకు సంబంధించి కిందటి ప్రభుత్వ హయాంలో ఆర్‌అండ్‌బీ శాఖ పనులు చేపట్టింది. మధ్యలో బ్రిడ్జి నిర్మాణం జరగలేదు. దీనివల్ల రోడ్డు వినియోగంలోకి రాని పరిస్థితి ఏర్పడింది. విమానాశ్రయం నూతన రన్‌వే అవతల ఎయిర్‌పోర్టు అధికారులు నావిగేషన్‌ కోసం డీవీవోఆర్‌ను నిర్మించారు. ఇక్కడ హెచ్‌టీ లైన్స్‌ ఉన్నాయి. వీటిని తొలగించాలని ఎయిర్‌పోర్టు అధికారులు ఎప్పటి నుంచో మొర పెట్టుకుంటున్నా ఫలితం లేదు. అలాగే, విమానాశ్రయానికి ఇచ్చిన భూముల్లో కోళ్ల ఫారాలున్నాయి. వీటి తరలింపు ఇంకా పూర్తి కాలేదు. బుద్ధవరం, దావాజీగూడెం, అల్లాపురం నిర్వాసితులకు ఇప్పటి వరకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీని కల్పించలేదు. ఈ ప్యాకేజీ కోసం గత ప్రభుత్వం చిన అవుటపల్లిలో 48 ఎకరాలను తీసుకుని మౌలిక సదుపాయాల కల్పన పనులు ప్రారంభించింది. ఈ లే అవుట్‌లో నిర్వాసితులకు మోడల్‌ ఇళ్లు కట్టించి ఇవ్వాలని భావించింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఇళ్లు కాదు.. డబ్బుగా ఇంటికి రూ.9 లక్షలు ఇస్తామని, లబ్ధిదారులే కట్టుకోవాలని నిర్దేశించింది. దీనికి లబ్ధిదారులు కూడా అంగీకరించారు. రెండు విడతలుగా డబ్బు ఇస్తామని చెప్పినా నిర్వాసితులు అంగీకరించారు. ఈ జీవో ఇచ్చి ఏడాది అవుతున్నా ఇప్పటి వరకు నిర్వాసితులకు డబ్బు ఇవ్వలేదు. నిర్వాసితుల నుంచి వ్యతిరేకత నేపథ్యంలో లే అవుట్‌లోని ప్లాట్లను డ్రా తీసి కేటాయించారు. ఇళ్లు కట్టుకోవటానికి మాత్రం డబ్బు ఇవ్వట్లేదు. విమానాశ్రయం వెంబడి తమ ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయిన వారికి ఇస్తామన్న అద్దె బకాయిలు కూడా పావువంతే చెల్లించారు. 

Updated Date - 2021-11-08T05:23:07+05:30 IST