Advertisement

నెంబర్‌వన్‌ సాధనే లక్ష్యం

Oct 24 2020 @ 04:53AM

 విశాఖపట్నం కంటే 

విజయవాడ ఎయిర్‌పోర్టుకే ఆ సత్తా

విదేశీ విమానయాన సంస్థలు మన వైపు చూస్తున్నాయ్‌ 

నూతన రన్‌వే ప్రారంభిస్తే.. విదేశీ భారీ విమానాలు ఇక్కడ దిగుతాయ్‌ 

ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో విజయవాడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ జి.మధుసూదనరావు


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): ‘రాష్ట్రంలో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుగా.. విశాఖపట్నం అగ్రస్థానంలో ఉంటుందని మేమూ భావించాం. కొవిడ్‌ అనంతర పరిణామాలతో .. భవిష్యత్తు తేలిపోయింది. విజయవాడ ఎయిర్‌పోర్టు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుగా అగ్రస్థానంలో ఉంటుందని స్పష్టమౌతోంది. శుక్రవారం నాటితో 200 ఇంటర్నేషనల్‌ విమానాలు విజయవాడకు వచ్చాయి. 25వేల మందికిపైగా ప్రవాసీయులు విజయవాడకొచ్చారు.


విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు 72 ఇంటర్నేషనల్‌ ఫ్లైట్స్‌ మాత్రమే వచ్చాయి. దీనిని బట్టి చూస్తే భవిష్యత్తులో రాష్ట్రంలోనే నెంబర్‌ 1 ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుగా విజయవాడ భాసిల్లుతుంది. ఒక ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌గా ఐదేళ్లు విజయవాడ విమానాశ్రయాభివృద్ధిలో పాలు పంచుకోవటం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది’ అని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ డైరెక్టర్‌ జి.మధుసూదనరావు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విజయవాడ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌గా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్రజ్యోతి ఆయనతో ప్రత్యేక ఇంటర్వ్యూ జరిపింది. ఇంటర్వ్యూ విశేషాలు ఇలా ఉన్నాయి. 


ఐదేళ్లు ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌గా ఒకేచోట కొనసాగటం ఉండదు కదా మీకెలా సాధ్యపడింది ? 

మధుసూదనరావు : నిజమే. నేను రాజమండ్రిలో ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌గా పని చేసే కాలంలో 6 నెలలకే 2015, ఏప్రిల్‌లో విజయవాడకు బదిలీ చేశారు. విజయవాడ వచ్చిన తర్వాత ఐదేళ్ల పాటు నిరవధికంగా ఇక్కడి ఎయిర్‌పోర్టు అభివృద్ధిలో భాగం పంచుకోవటం ఆనందంగా ఉంది. 


ప్రశ్న: ఐదేళ్ల కాలంలో ఎయిర్‌పోర్టులో ఎంతో అభివృద్ధి జరిగింది? ఎలాంటి ప్రణాళికలతో వీటిని పూర్తి చేశారు? 

మధుసూదనరావు : నేను విజయవాడ రాగానే  నా చేతిలో ఎయిర్‌పోర్టు మాస్టర్‌ ప్లాన్‌ పెట్టారు. దాని ప్రకారం మేంఉ ఎయిర్‌పోర్టు అభివృద్ధి విషయంలో అడుగులు వేశాం. ముందుగా విజయవాడ ఎయిర్‌పోర్టును కోడ్‌ ఎఫ్‌గా తీర్చిదిద్దేందుకు వీలుగా పనులు చేపట్టాం. పాత టెర్మినల్‌ బిల్డింగ్‌ను విస్తరించి అభివృద్ధి చేశాం. 2016 లో ఇంటీరియం టెర్మినల్‌ బిల్డింగ్‌ను కేవలం 11 నెలల్లోనే పూర్తి చేసి రికార్డు నెలకొల్పాం. 2016కు ముందు 530 ఎకరాల భూమి మాత్రమే ఉండేది. ఏఏఐతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం కారణంగా మొత్తం 698 ఎకరాల భూమి సమకూరింది. ఇదే సందర్భంలో 1074 మీటర్ల మేర అదనంగా రన్‌వే విస్తరణ పనులు చేపట్టాం. దీనికి సమాంతరంగా 10 పార్కింగ్‌ బేల పనులు చేపట్టాం. దావాజీ గూడెంలోని 6 ఎకరాల్లో డీఓవీఆర్‌ టవర్‌ నిర్మాణం చేపట్టాం. విజయవాడ రూపు రేఖలను మార్చేలా ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ను రూ.611 కోట్ల వ్యయంతో త్వరలో చేపట్టబోతున్నాం. ఈ ఐదేళ్లలో అనేక అవార్డులు, రివార్డులు సాధించాం. ఎయిర్‌పోర్టుకు ఐఎస్‌ఓ హోదా లభించింది. గ్రీన్‌ అవార్డులను  అందుకున్నాం. దాదాపుగా 50 వరకు అరైవల్స్‌, డిపార్చర్స్‌ పెరిగేందుకు కృషి చేశాం. కార్గో టెర్మినల్‌ను ఏర్పాటు చేశాం. 


ప్రశ్న: ఐదేళ్లు ఓకే... మరి భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి ? 

మధుసూదనరావు :భవిష్యత్తు ప్రణాళికలు చాలా ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ను పూర్తి చేసే బాధ్యత నాపై ఉంది. దానిని రెండేళ్లలో పూర్తి చేయించటం నా ముందున్న కర్తవ్యం. ఇంటర్నేషనల్‌ కార్గో టెర్మినల్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రణాళిక ఉంది. ఇంతకు ముందే ఎయిర్‌పోర్టులో 100 మెగావాట్‌ సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేశాం. ఎయిర్‌పోర్టులో 43 కేవీ సబ్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం. అత్యున్నత స్థాయిలో ఫైర్‌ స్టేషన్‌ నిర్మాణాన్ని చేపడతాం. అంతర్జాతీయ విమానాలపై దృష్టి సారిస్తాం. 


ప్రశ్న:  విజయవాడ నుంచి అంతర్జాతీయంగా ఉన్న అవకాశాలు ఏమిటి ? 

మధుసూదనరావు : నేను కూడా మొదట్లో..  అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుగా రాష్ట్రంలో విశాఖపట్నం నెంబర్‌ వన్‌గా ఉంటుందని అనుకునే వాడిని. అనేక సర్వేల ద్వారా విజయవాడ నుంచి డిమాండ్‌ ఉంటుందని తెలిసినప్పటికీ ప్రత్యక్షంగా డిమాండ్‌ ఏ స్థాయిలో ఉంటుందో.. కొవిడ్‌ నేపథ్యంలో చూశాం. వందే భారత్‌ మిషన్‌ ద్వారా ప్రత్యేక విమానాలను నడుపుతున్నప్పడు మనకు అంతగా డిమాండ్‌ ఉండదనుకున్నాం. కానీ రాష్ట్రంలో అత్యధికంగా విజయవాడ ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ విమానాలొచ్చాయి. శుక్రవారం నాటికి 200 అంతర్జాతీయ విమానాలొచ్చాయి. విశాఖ ఎయిర్‌పోర్టు 71 అంతర్జాతీయ ఫ్లైట్స్‌ మాత్రమే వచ్చాయి. గల్ఫ్‌ దే శాల నుంచి లెక్కకు మిక్కిలిగా అంతర్జాతీయ ఫ్లైట్స్‌ వచ్చాయి. రోజుకు నాలుగు విదేశీ విమానాలను కూడా ఆపరేట్‌ చేశాం. అమెరికా, యూరోపియన్‌ దేశాల నుంచి పెద్ద విమానాలు కూడా వచ్చే అవకాశం ఉన్నా.. ఇంకా విస్తరించిన రన్‌వేను ప్రారంభించుకోకపోవటం వల్ల కుదరలేదు. రాష్ట్రంలో విజయవాడ ఎయిర్‌పోర్టు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుగా నెంబర్‌ వన్‌లో ఉంటుందని ఇప్పుడు మేము గట్టిగా భావిస్తున్నాం.  

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.