Advertisement

జయహో దుర్గాభవానీ..

Oct 25 2020 @ 07:45AM

ఒకేరోజు రెండు అలంకారాల్లో దుర్గమ్మ

భారీగా తరలివచ్చిన భక్తులు

నేడు మహాపూర్ణాహుతితో ఉత్సవాలకు ముగింపు


విజయవాడ, ఆంధ్రజ్యోతి: వేవేల భక్తులు.. వేనవేల మొక్కులు.. అంగరంగ వైభవంగా అలంకారాలు.. అంబరాన్నంటిన సంబరాలు.. కుంకుమార్చనలు.. పల్లకీ ఊరేగింపులు.. డోలు వాయిద్యాలు.. తొమ్మిది రోజులు ఆధ్యాత్మిక అలౌకిక ఆనందాన్ని పంచిన ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు ముగింపు దశకు చేరుకున్నాయి. తొమ్మిది రోజులు.. తొమ్మిది క్షణాలు.. ఉదయాస్తమయాలు వచ్చిపోతున్నా.. కాలం కరిగిపోతున్నా.. అదే భక్తి. కరోనా భయం ఉన్నా తరగని శక్తి. అయినా.. ఏదో వెలితి. ‘అప్పుడే ఉత్సవాలు ముగుస్తున్నాయా..?’ అనుకుంటూనే.. వచ్చే నవరాత్రులను మదిలో తలచుకుంటూ ముందుకు సాగారు భక్తులు. పునర్దర్శన ప్రాప్తిరస్తు..


దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఎనిమిదో రోజు దుర్గమ్మ రెండు అలంకారాల్లో దర్శనమిచ్చింది. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దుర్గాదేవిగా, మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు మహిషాసురమర్దినీదేవిగా కొలువుదీరిన అమ్మను తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ ఏడాది తిథుల్లో హెచ్చుతగ్గుల కారణంగా అష్టమి, నవమి గడియలు శనివారమే రావడంతో అమ్మవారు రెండు అలంకారాల్లో భక్తులను కటాక్షించారు. కరోనా వైరస్‌ను కూడా లెక్కచేయని భక్తులు అమ్మ దర్శనం కోసం ఉదయం 5 గంటలకు ముందే క్యూలైన్లలోకి చేరుకున్నారు. భవానీలు ఇరుముడులు సమర్పించేందుకు వచ్చారు. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు దర్శనాలను నిలిపివేసి అమ్మవారి అలంకారం మార్చారు. అనంతరం కూడా రద్దీ కొనసాగింది. మంత్రులు మేకతోటి సుచరిత, కురసాల కన్నబాబు, విశ్వరూప్‌, మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, దుర్గగుడి మాజీ ఈవో, ఐఆర్‌ఎస్‌ అధికారిణి వి.కోటేశ్వరమ్మ, ఎమ్మెల్యేలు విడదల రజని, మల్లాది విష్ణు దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం విజయదశమి సందర్భంగా వేదపండితులు మహాపూర్ణాహుతి నిర్వహించి ఉత్సవాలకు ముగింపు పలకనున్నారు. 


నేడు తెప్పోత్సవం

వరద కారణంగా నదీ విహారం రద్దు 

దుర్గాఘాట్‌ వద్ద హంస వాహనంపై పూజలు  

కనకదుర్గ ఫ్లై ఓవర్‌పైకి అనుమతి నో


వన్‌టౌన్‌ : దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు రోజున నిర్వహించే తెప్పోత్సవ సేవకు అధికారులు అభ్యంతరం తెలిపారు. కృష్ణానదికి వరద పోటెత్తుతున్నందున గంగా సమేత దుర్గామల్లేశ్వరుల ఉత్సవమూర్తులను హంస వాహనంపై ముమ్మారు నదీ విహారం చేయించే ప్రక్రియను రద్దు చేశారు. దుర్గాఘాట్‌ వద్ద నదిలోనే హంస వాహనాన్ని ఉంచి పూజలు నిర్వహిస్తారని కలెక్టర్‌ ఇంతియాజ్‌, సీపీ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. స్థానిక మోడల్‌ గెస్ట్‌హౌస్‌లో శనివారం అధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. బ్యారేజీకి మూడు లక్షల తొమ్మిది వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో నదీ విహారానికి అనుమతులు ఇవ్వడం మంచిది కాదని పోర్టు అధికారి ధర్మశాస్త్రి, నీటిపారుదల శాఖ ఈఈ స్వరూప్‌లు చెప్పారు. ఇక హంస వాహనంలోకి 8 మంది వేదపండితులు, ఇద్దరు అర్చకులు, ఇద్దరు కర్రపు స్వాములు, ఇద్దరు కాగడాలు పట్టేవారు, ఆరుగురు భజంత్రీలవారు, ఒక ఎస్‌ఐను మాత్రమే అనుమతిస్తామని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో దుర్గగుడి ఈవో ఎంవీ సురేష్‌బాబు, వీఎంసీ కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌, జేసీ కె.మాధవీలత తదితరులు పాల్గొన్నారు. 


Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.