ఆలయంలో.. రాజకీయమా!

ABN , First Publish Date - 2020-11-06T10:13:40+05:30 IST

దుర్గమ్మ సన్నిధిని రాజకీయ వేదిక చేస్తున్నారు..

ఆలయంలో.. రాజకీయమా!

దుర్గగుడి పాలనా కార్యాలయంలో వైసీపీ సమావేశం

పార్టీ ర్యాలీల నిర్వహణపై సన్నాహక సమావేశం

ఆలయ ఖర్చులతో అతిథి మర్యాదలు

దుర్గగుడి చైర్మన్‌ పైలా అధికార దుర్వినియోగం 

గతంలోనూ వైసీపీ కార్పొరేటర్‌ అభ్యర్థులతో మంత్రి భేటీ


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): దుర్గమ్మ సన్నిధిని రాజకీయ వేదిక చేస్తున్నారు. అమ్మ సన్నిధిలోనే తరచూ రాజకీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆలయ పవిత్రతను కాపాడాల్సిన ఈవో, ఇతర అధికారులు వైసీపీ నేతల అడుగులకు మడుగులొత్తుతున్నారు. ఆలయ ప్రతిష్ఠను కాపాడాల్సిన దుర్గగుడి చైర్మన్‌ పైలా సోమినాయుడే ఈ సమావేశాలకు ఆతిథ్యం ఇస్తూ, అమాత్యుని ఎదుట భక్తిని చాటుకుంటున్నారు.


విజయవాడ బ్రాహ్మణవీధిలో ఉన్న దుర్గగుడి పరిపాలనా కార్యాలయాన్ని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తన అడ్డాగా మార్చుకున్నారు. పార్టీ సమావేశాలకు ఈ కార్యాలయాన్ని వేదికగా మార్చేశారు. గురువారం దుర్గగుడి పరిపాలనా కార్యాయల భవనంలో వైసీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం దుర్గగుడి పాలకమండలి చైర్మన్‌ పైలా సోమినాయుడు, మంత్రి ముఖ్య అనుచరులు కొండపల్లి బుజ్జి, కొనకళ్ల విద్యాధరరావు నేతృత్వంలో జరిగింది. పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో రాజకీయ పార్టీ సమావేశాల నిర్వహణపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


బీసీ కార్పొరేషన్ల నియామకాల నేపథ్యంలో బీసీలను వైసీపీ వైపు ఆకర్షించేందుకు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా గురువారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అదే ఊపులో నియోజకవర్గాలవారీగా ర్యాలీల నిర్వహణకు వైసీపీ నాయకులు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా పశ్చిమ నియోజకవర్గ వైసీపీ సమావేశం గురువారం జరిగింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. పార్టీ సమావేశానికి దుర్గగుడి పాలనా కార్యాలయాన్ని వాడుకోవడం మాత్రం విమర్శలకు తావిస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముఖ్యంగా ఈవో సురేశ్‌బాబు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆలయ పవిత్రత మంటగలుపుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా రాజకీయ సమావేశాలకు సైతం దుర్గగుడి పాలకమండలి కార్యాలయం వేదికగా మారడం, ఆలయ సొమ్ముతోనే ఇక్కడ సమావేశాలకు ఆతిథ్యం ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


ఈ ఏడాది మే 17న పశ్చిమ నియోజకవర్గంలోని 22 డివిజన్లలో పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థులతో మంత్రి వెలంపల్లి సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి కూడా దుర్గగుడి పరిపాలనా కార్యాలయంలోని సమావేశ మందిరాన్నే వేదికగా చేసుకున్నారు. నాటి సమావేశానికి ఈవో సురేశ్‌బాబు, వీఎంసీ ఎస్టేట్‌ అధికారి శ్రీధర్‌ కూడా హాజరవ్వడంపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తాజాగా మరోసారి పరిపాలనా కార్యాలయంలో రాజకీయ సమావేశం నిర్వహించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


మంత్రి తీరుపై కార్యకర్తల ఆగ్రహం

దుర్గగుడి పాలనా కార్యాలయంలో జరిగిన వైసీపీ నేతలు, కార్యకర్తల సమావేశంలో పలువురు నేతలు, కార్యకర్తలు మంత్రి వెలంపల్లి తీరుపై పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు ఫోన్‌ చేస్తే మంత్రి కనీసం ఫోను ఎత్తడం లేదని, ఇలాగైతే ప్రజలు తమకు విలువేం ఇస్తారని వారు సమావేశానికి హాజరైన సోమినాయుడిని నిలదీశారు. అసలు సమావేశం నిర్వహించే అర్హత సోమినాయుడికిగానీ, ఆయన పక్కన కూర్చున్న కొండపల్లి బుజ్జికి, కొనకళ్ల విద్యాధరరావుకూగానీ లేదని మండిపడ్డారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ మంజూరు చేయించడానికి డబ్బులు వసూలు చేస్తున్నారని, పశ్చిమ నియోజకవర్గంలో పార్టీని మంత్రి అనుచరులు నాశనం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. పలువురు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-11-06T10:13:40+05:30 IST