
విజయవాడ (Vijayawada): జగనన్న (jagananna) కాలనీల్లో ప్రభుత్వమే ఇళ్లను కట్టించాలని, టిడ్కో (Tidco) ఇళ్లు వెంటనే ఇవ్వాలంటూ సీపీఎం డిమాండ్ చేస్తూ ధర్నా (CPM Dharna) చేపట్టింది. ఈ సందర్బంగా సీపీఎం నేత దోనేపూడి కాశీనాథ్ (Donepudi Kashinath) ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పేదలకు ఇళ్లు ఇస్తానని జగన్ ఎన్నికల సమయంలో ఘనంగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఊరికి దూరాన ఎక్కడో సెంటు స్థలం ఇచ్చామని పత్రాలు చేతిలో పెట్టారు.. స్థలం చూపించకుండా రూ. 35 వేలు కట్టాలని చెబుతున్నారని, కోర్టులో కేసులు ఉన్నా... అమరావతి ప్రాంతంలో స్థలాలు ఎలా ఇచ్చారు?.. ఇచ్చిన స్థలాల్లో కూడా ఇళ్లు కట్టుకోవాలని పేదలపై భారం మోపుతున్నారన్నారు. రూ. లక్షా యనభైవేలు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపు కుంటుందని విమర్శించారు. డబ్బులు లేక మధ్యలోనే ఇళ్ల నిర్మాణం నిలిచిపోతుందన్నారు.
సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం ఇళ్లు పూర్తిగా నిర్మించి ఇవ్వాలని దోనేపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. టిడ్కో ఇళ్ల కోసం పేద, మధ్య తరగతి ప్రజలు అప్పులు తెచ్చి కట్టారని, మూడేళ్లుగా వాళ్లకి ఇళ్లు ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారని విమర్శించారు. పూర్తి అయిన ఇళ్లను కూడా ఇవ్వలేని చేతకాని ప్రభుత్వమని మండిపడ్డారు. గడప గడపకూ కార్యక్రమంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోందన్నారు. అందుకే ఇంటింటికీ సీపీఎం నేతలు వెళుతుంటే ప్రజలు సమస్యలు ఏకరువు పెడుతున్నారన్నారు. పన్నులు, విద్యుత్ ఛార్జీల భారాలను మోయలేక పోతున్నామని కన్నీరు పెడుతున్నారని చెప్పారు. పేదలు తినే బియ్యం కూడా రెండో కోటా పంపిణీ నిలిపివేయడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై జులై 11వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు దోనేపూడి కాశీనాథ్ తెలిపారు.
ఇవి కూడా చదవండి