డబ్బులివ్వం.. రిజిస్ర్టేషన్‌ చేయం

ABN , First Publish Date - 2022-05-18T09:32:18+05:30 IST

రాష్ట్రంలో మహిళలకు అన్నగా రక్షణ కల్పిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి చేస్తున్న ప్రకటనలకు..

డబ్బులివ్వం.. రిజిస్ర్టేషన్‌ చేయం

ఎక్కువ చేస్తే నిన్ను చంపేస్తాం

ఓ మహిళపై వైసీపీ ‘రియల్‌’ దాష్టీకం

స్థలం కొనిస్తామని 5లక్షలు వసూలు

రెండేళ్లయినా రిజిస్ర్టేషన్‌ చేయని వైనం

ప్రశ్నిస్తే ఆమె ఇంటికెళ్లి తీవ్ర బెదిరింపు

దిశకు ఫిర్యాదుచేసి వారమైనా జరగని న్యాయం

బెజవాడలో బాధితురాలి ఆత్మహత్యాయత్నం


విజయవాడ (అజిత్‌సింగ్‌ నగర్‌), మే 17 : రాష్ట్రంలో మహిళలకు అన్నగా రక్షణ కల్పిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి చేస్తున్న ప్రకటనలకు ఆ పార్టీ నేతల ఆగడాలకు పొంతనే ఉండటం లేదు. విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో మంగళవారం చోటు చేసుకున్న ఘటన వైసీపీ నేతల దాష్టీకానికి అద్దం పడుతోంది. ప్రమీల అలియాస్‌ ఎస్‌కే హుస్సేన్‌ బీ న్యూ రాజరాజేశ్వరిపేటలో నివాసం ఉంటున్నారు. ఆమె భర్త దర్గా ...ప్రగతి రియల్‌ ఎస్టేట్‌ కార్యాలయంలో గుమాస్తా. ఈ ఆఫీ్‌సను స్థానిక వైసీపీ నేతలు మల్లెల చెన్నకేశవరెడ్డి, అలీ నిర్వహిస్తున్నారు. రాజరాజేశ్వరిపేటకు సమీపంలో తక్కువ ధరకు మంచి స్థలం అమ్మకానికి ఉందని దర్గాకు రెండేళ్ల క్రితం వీరు చెప్పారు. భర్త ద్వారా విషయం తెలుసుకున్న హుస్సేన్‌ బీ.. మంచి ధరకు స్థలం వస్తుందని ఆశపడ్డారు. తన తల్లికి చెందిన ఇంటిని అమ్మి ఆ డబ్బులు వారికికట్టారు. స్థలం చూపించి ఆమె నుంచి వారు డబ్బులు తీసుకున్నారు. కానీ, రిజిస్ట్రేషన్‌ చేయకుండా జాప్యం చేస్తూ వచ్చారు. ఓసారి కరోనా పేరు చెప్పి, మరోసారి స్థల యజమానికి బాగోలేదని చెప్పి రెండేళ్లు కాలం గడిపేశారు. ఒక వారం క్రితం హుస్సేన్‌ బీ స్థలం రిజిస్ట్రేషన్‌ విషయమై ఒత్తిడి తేవడంతో.. వారిద్దరు అడ్డం తిరిగారు. ‘‘నీకు డబ్బులు ఇచ్చేది లేదు.. స్థలం రిజిస్ట్రేషన్‌ చేసేది కూడా లేదు’’ అని తెగేసి చెప్పారు. ఎక్కువ చేస్తే చంపేస్తామని బెదిరించారు. అధికార పార్టీ నేతలు కావడంతో హుస్సేన్‌బీ భయపడిపోయారు. తనకు న్యాయం చేయాలని ఇటీవల దిశ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయినా.. స్పందన లేదు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి మల్లెల చెన్నకేశవరెడ్డి, అలీ ఆమె ఇంటికి వెళ్లి మరోసారి బెదిరించారు. దీంతో తన డబ్బులు తిరిగి రావనే ఆందోళన ఆమెలో పెరిగిపోయింది. తీవ్ర కలతకు గురైన సోమవారం రాత్రి నిద్రమాత్రలు మింగి బాధితురాలు  ఆత్మహత్యాయత్నం చేశారు. కుటుంబసభ్యులు స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించడంతో ప్రాణాపాయం తప్పింది. ‘‘నా వద్ద డబ్బులు తీసుకుని స్థలం రిజిస్ట్రేషన్‌ చేయకుండా చెన్నకేశవ రెడ్డి, అలీ బెదిరిస్తున్నారు. దిశ పోలీసులకు చెప్పినా ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదు’’ అని బాధితురాలు వాపోయారు. 

Updated Date - 2022-05-18T09:32:18+05:30 IST