కొత్త వ్యూహం

ABN , First Publish Date - 2021-11-20T06:55:15+05:30 IST

రైళ్లలో అక్రమ రవాణా నేరం నుంచి బయటపడేందుకు విజయవాడ రైల్వేస్టేషన్లోని కమర్షియల్‌ అధికారి, ఆయన బినామీ ప్రయత్నాలు ప్రారంభించారు.

కొత్త వ్యూహం

రైళ్లలో ‘అక్రమ రవాణా’ తీవ్రతను తగ్గించేందుకు అధికారి ఎత్తుగడ

బినామీతో కమర్షియల్‌ అధికారి మంతనాలు

పాత తేదీతో ప్యాంట్రీ అనుమతి పత్రం కోసం యత్నం!

కమర్షియల్‌ విభాగంలో అంతర్గత విచారణ ముమ్మరం 

వీడియో ఫుటేజీలను పరిశీలిస్తున్న ఆర్పీఎఫ్‌ 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : రైళ్లలో అక్రమ రవాణా నేరం నుంచి బయటపడేందుకు విజయవాడ రైల్వేస్టేషన్లోని కమర్షియల్‌ అధికారి, ఆయన బినామీ ప్రయత్నాలు ప్రారంభించారు. విజయవాడ స్టేషన్‌ నుంచి ప్రయాణికుల రైళ్లలో గ్యాస్‌ సిలిండర్లు, నిత్యావసరాల అక్రమ రవాణాపై ‘ఆంధ్రజ్యోతి’లో వరుస కథనాలు ప్రచురితం కావడం, అధికారులు అంతర్గత విచారణను ప్రారంభించడంతో అక్రమాల తీవ్రతను తగ్గించి చూపేందుకు సరికొత్త ఎత్తుగడకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం కమర్షియల్‌ అధికారి తన బినామీతో సంప్రదింపులు జరపడం హాట్‌ టాపిక్‌గా మారింది. అంతర్గత విచారణలో అడ్డంగా దొరికిపోతామన్న భయంతో ఈ అక్రమాల తీవ్రతను తగ్గించి చూపించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా మంచినీళ్లు, ఇతర అనుమతించదగిన నిత్యావసరాల సరఫరాకు ప్యాంట్రీ కాంట్రాక్టర్ల నుంచి పాత తేదీతో బినామీకి అనుమతులు ఇప్పించేందుకు చక్రం తిప్పుతున్నట్టు సమాచారం. ఇలా పాత తేదీతో తెచ్చుకున్న అనుమతి పత్రాలను ఉన్నతాధికారుల ముందుంచి, తాము మంచినీళ్ల బాటిల్స్‌ను అనుమతుల మేరకే రవాణా చేస్తున్నామని, ప్యాంట్రీ నిర్వాహకుల ఒత్తిడి మేరకు గ్యాస్‌ సిలిండర్లను ఇవ్వవలసి వచ్చిందని, ఇలాంటి తప్పులను పునరావృతం కానీయమని అభ్యర్థించటానికి వీలుగా ప్రణాళికలు రూపొందించుకున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారం నుంచి బయటపడేందుకు ఆ అధికారి ప్యాంట్రీ నిర్వాహకులను బలి పశువులను చేసే ప్రయత్నం చేయటం గమనార్హం. ప్యాంట్రీ  నిర్వాహకులు వంట చేయకూడదని, తయారు చేసిన ఆహారాన్నే తీసుకోవాలని రైల్వే శాఖ మార్గదర్శకాలను ఇచ్చింది కాబట్టి వంట చేయడం నేరమవుతుంది. రైళ్లలో రైల్‌ నీర్‌ మాత్రమే ఇవ్వాల్సి ఉండగా బిస్లరీ వాటర్‌ బాటిల్స్‌ను సరఫరా చేయడం కూడా నేరమే. ఇది ఏదో కొద్దిరోజుల వ్యవహారం కాదు. లోతుగా విచారణ జరిపితే కొన్నేళ్ల అక్రమాల కథలు వెలుగులోకి వస్తాయి.


వేగంగా విచారణ

కమర్షియల్‌ విభాగాధిపతి సీనియర్‌ డీసీఎం భాస్కరరెడ్డి వేగంగా అంతర్గత విచారణ చేయిస్తున్నారు. ఇందులో భాగంగా రైల్వే క్యాటరింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ను విచారించారు. రైళ్లలో జరుగుతున్న వ్యవహారాలను ఆయన వివరించినట్టు తెలుస్తోంది. కమర్షియల్‌ స్టాఫ్‌ కూడా తమను విచారిస్తే జరుగుతున్న బాగోతాలను బయట పెట్టాలని భావిస్తున్నారు. మరోపక్క రైల్వేస్టేషన్‌లోని సీసీ టీవీల ఫుటేజీని ఆర్పీఎఫ్‌ విభాగం పరిశీలిస్తోంది. 

Updated Date - 2021-11-20T06:55:15+05:30 IST