బాహుబలి గురించి బూతులు మాట్లాడుకున్నారు...

Published: Sat, 08 Feb 2020 03:15:19 ISTfb-iconwhatsapp-icontwitter-icon
బాహుబలి గురించి బూతులు మాట్లాడుకున్నారు...

ఆయన ఏ కథ రాసినా ఆ సినిమా హిట్టే! కథను చిత్రికపట్టే నైపుణ్యం ఆయన సొంతం. ఒకేసారి తెరమీదికి వచ్చిన రెండు పెద్ద చిత్రాలు ‘బాహుబలి’, ‘బజరంగీ భాయ్‌జాన్‌’ ప్రేక్షకుల ఆదరణ పొందడం కన్నా కెరీర్‌లో సంతృప్తి ఏముంటుంది అంటున్న విజయేంద్రప్రసాద్‌తో ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే కోసం ఏబీఎన్‌ ఎండీ వేమూరి రాధాకృష్ణ చేసిన ఇంటర్వ్యూ 27-7-2015న ఏబీఎనలో ప్రసారమయింది. ఆ వివరాలు...


ఆర్కే: కంగ్రాట్స్‌. ఒక వారం గ్యాప్‌లో జాతీయ సినిమా చరిత్రలో ‘బాహుబలి’, ‘బజరంగీ భాయ్‌జాన్‌’ చిత్రాలతో అద్భుతమైన విజయాలు సాధించారు. మీ అనుభూతి ఏంటి?

విజయేంద్రప్రసాద్‌: ఏదేదో చెప్పాలనుంది.. అయితే కొత్తగా అనిపించటం లేదు.


ఆర్కే: ఎందుకనీ?

విజయేంద్రప్రసాద్‌: ఐ డోన్ట్‌ నో.. అదే నాకూ ఆశ్చర్యంగా ఉంది. మామూలుగా అయితే ఫ్రెండ్స్‌ దగ్గరికెళ్లి పార్టీలు చేసుకోవాలి. అవేం చేయలేదు. ఇపుడు మనసంతా ‘బాహుబలి పార్ట్‌ 2’ పైనే ఉంది. కొత్త బరువు ఏదో నెత్తిమీద ఉన్నట్లుంది.. (నవ్వులు)


ఆర్కే: మీకొచ్చిన బెస్ట్‌ కాంప్లిమెంట్‌

విజయేంద్రప్రసాద్‌: చాలా కాంప్లిమెంట్స్‌ వచ్చాయి. ఈ మధ్య చాలా సే్ట్రంజ్‌ కాంప్లిమెంట్‌ విన్నాను. మాది కొవ్వూరు. రేవు కెళ్లి పుష్కర స్నానం చేసి పైకి వస్తుండగా పదిమంది జనం. అందరూ గోదారి జిల్లాల వారే. దేవుడు, పుష్కరాల గురించి కాకుండా ‘బాహుబలి’ గురించి మాట్లాడుకుంటున్నారు. అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్‌ అది. ఇక్కడ చెబితే బాగోదు. అక్కడ వాళ్లలో ఒకడు ‘అసలు ఏమనుకుంటున్నాడు.. ఆ డైరెక్టర్‌ ఏమనుకుంటున్నాడు.. సగంలో వదిలేస్తాడేంటీ.. ఇందుకోసం ఏడాదిన్నర ఆగాలా.. అసలు వాన్నీ ...’’ అంటూ బూతులు మాట్లాడుతున్నారు. అయితే ఆ బూతులు వింటుంటే నవ్వొస్తోంది. కోపం రాకపోగా ఆనందం కలిగింది. ఆ కోపం వెనకాల ఆలోచిస్తే వారికి ‘బాహుబలి’ కథ ఎంత నచ్చేసింది. ఎంత ఇన్‌వాల్వ్‌ అయిపోయారోననిపిస్తుంది. సెకండ్‌ పార్ట్‌ కోసం ఎంత తహతహలాడుతున్నారో.. అది చూసి ఆనందంతో పాటు సెకండ్‌ పార్ట్‌ ఆడియన్స్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్‌ అవ్వాలనే భయం నాలో స్టార్ట్‌ అయ్యింది.


ఆర్కే: ‘బజరంగీ భాయ్‌జాన్‌’ సినిమా కథకు నేపథ్యం..

విజయేంద్రప్రసాద్‌: చిరంజీవి గారి సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’ సినిమా నాకు చాలా ఇష్టం. ఓసారి ఆ సినిమా చూస్తుంటే కన్నీళ్లొచ్చాయి. ఆ సోల్‌ తీసుకుని రాద్దామనుకున్నా. హీరోకి ఓ పిల్లాడు దొరికాడు. వాడెవడో తెలీదు.. అనుకోకుండా హీరోతో ఓ అనుబంధం వచ్చింది. ఆ పిల్లాడితో కష్టం ఏంటీ... కష్టాలు తీర్చడం. అది చిన్న ఎలిమెంట్‌. ఈ థీమ్‌పై చేద్దామనుకున్నా. ఓ సారి కీరవాణితో ఈ కథ చెప్పగా ‘ఆ కష్టం పాకిస్తాన్‌లో ఉంటే అప్పుడు కథ బావుంటుంది కదా’ అన్నాడు. ఈ సినిమా చేయడానికి మరో ప్రేరణ ఉంది. నాలుగైదు సంవత్సరాల క్రితం ఇద్దరు పాకిస్తాన్‌ కపుల్స్‌ వారి చిన్న పాపకు హార్ట్‌లో హోల్‌ ఉందని ఇండియాకు వచ్చారు. వాళ్ల చేతిలో డబ్బుల్లేవు. పదిహేను లక్షలవుతుందన్నారంతా. చెన్నైలోని ఓ కార్పొరేట్‌ హాస్పిటల్‌ రెండు లక్షలకే ఆపరేషన్‌ చేస్తామంది. ఆ డాక్టర్లు వారి పరిస్థితి తెలుసుకుని ఫ్రీగా ఆపరేషన్‌ చేశారు. ఆ తల్లిదండ్రులు టీవీలో ఆ విషయం చెబుతుంటే కళ్లలో నీళ్లొచ్చాయి. హార్ట్‌కి కనెక్ట్‌ అయింది. ఈ తల్లిదండ్రులు ఇండియాకు వస్తుంటే భారతీయులను పాకిస్తానీయులు నరరూప రాక్షసులుగా వర్ణించే ఉంటారు.

 

అయితే ఆపరేషన్‌ తరువాత ప్రాణం పోసిన ఇక్కడి డాక్టర్లని చూసి ఎంత మంచి మనసుందని ఉప్పొంగిపోయారో! ప్రజల మధ్య గొడవలేవీ లేవనిపించింది. కేవలం ప్రభుత్వాలే ఇలా అగాథాలు సృష్టిస్తున్నాయి. ఇంతవరకూ పాకిస్తాన్‌ జిందాబాద్‌, హిందూస్తాన్‌ జిందాబాద్‌ అనే సినిమాలొచ్చాయి. జనాల్ని రెచ్చగొట్టి డబ్బులు సంపాదించకుండా ఇరుదేశాల మధ్య వారధి లాగా ఉండాలని హానె్‌స్టగా రాశాను. ఒక్క ప్రేక్షకుడు కన్నీటి చుక్క రాల్చినా సక్సెస్‌ అనుకున్నా. ఇవాళ సినిమా చూసి ఎంతోమంది కన్నీళ్లు పెట్టుకున్నారు. నా అటెంప్ట్‌ నెరవేరింది. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది.

బాహుబలి గురించి బూతులు మాట్లాడుకున్నారు...

ఆర్కే: ఆ కథ రాయడానికి ఎన్నాళ్లు పట్టింది. సల్మాన్‌ఖాన్‌ను దృష్టిలో పెట్టుకుని రాశారా. సినిమా రిలీజ్‌ అయ్యాక ఆయన ఏమన్నారు?

విజయేంద్రప్రసాద్‌: సినిమా రిలీజ్‌ అయ్యాక సల్మాన్‌ ఫోన్‌ చేశారు. అప్పుడు ముంబైలో ఉన్నాను. ‘విజయేంద్రప్రసాద్‌ గారూ.. సినిమాకు హీరో నేను కాదండీ.. మీరే హీరో అన్నారు’ సల్మాన్‌. క్యాజువల్‌గా చెప్పారు అనుకున్నా. సినిమా ఫీల్డ్‌లో సలీం- జావెద్‌లు నాకు గురువులు. వారు రైటర్‌కు వాల్యూ పెంచారు. ఆ రచయితలకు నేను ఏకలవ్య శిష్యుడిని. వారంటే ఆరాధన. సల్మాన్‌ ఫోన్‌ చేశాక ఇరవై నిమిషాల తర్వాత మళ్లీ సలీం గారు ఫోన్‌ చేసి.. కాంప్లిమెంట్‌ ఇచ్చారు.


ఆర్కే: అంతకుముందు ఆయనతో మీకు పరిచయం ఉందా?

విజయేంద్రప్రసాద్‌: కథ చెప్పటానికి వారి ఇంటికి ఓసారి వెళ్లాను. అప్పుడు మాట్లాడా. సలీం గారు ఫోన్‌ చేసి ‘కృష్ణప్రసాద్‌.. నేను చాలా సినిమాలు రాశాను.. చాలా సినిమాలు చూశాను. ఇంత గొప్ప కథ ఎప్పుడూ రాయలేదు.. ఇంత గొప్ప సినిమా ఎన్నడూ చూడలేదు’ అన్నారు. ఆయన మాటలు అల్టిమేట్‌. ఒకసారి ఆయన ఇంటికెళ్లినపుడు సరదాగా ఓ మాట చెప్పారు. ఫస్ట్‌ సినిమాలో సలీం-జావెద్‌గారి పేరు పోస్టర్లో ఎక్కడో కింద వేశారట.

 

సలీంతో పాటు జావెద్‌ గారు సైకిల్‌ తీసుకుని, రెండు పెయింట్‌ డబ్బాలు తీసుకొని ప్రొడ్యూసర్‌ ఇంటి దగ్గర నుంచి ప్రొడ్యూసర్‌ ఆఫీస్‌ వరకూ దారిలో ఎన్ని పోస్టర్స్‌ ఉన్నాయో అన్నింటిపైన ‘సలీం-జావెద్‌’ అని రాసుకున్నారట. అది చెబుతూనే చాలా నవ్వొచ్చింది. తర్వాత ఆయనే ‘కృష్ణప్రసాద్‌ మా అబ్బాయి రెమ్యునరేషన్‌ ఎంత తీసుకుంటున్నాడో... వాడికంటే నువ్వు ఒక రూపాయి ఎక్కువ పుచ్చుకో’ అన్నాడు (ఒకటే నవ్వులు). ఆయన ఎందుకు అన్నాడంటే రైటర్‌కు వ్యాల్యూ ఉండాలి అని.


ఆర్కే: బజరంగీ బాయ్‌జాన్‌ కథ రజనీకాంత్‌ గారికి చెప్పారా

విజయేంద్రప్రసాద్‌: రజనీకాంత్‌కు చెప్పాను. ఆయనకు ఎక్కలేదు. వెంకటేష్‌ గారికి కూడా చెప్పాను. బావుందన్నారు. తర్వాత ముంబైకి వెళ్లి అమీర్‌ఖాన్‌కు చెప్పా. ఆయన కళ్లల్లో నీళ్లొచ్చాయి. డేట్స్‌ కుదరక సల్మాన్‌కు ఈ కథ చెప్పమన్నాడు. అలా సల్మాన్‌కు కుదిరింది.


ఆర్కే: కథకుడిగా మీరు, డైరెక్టర్‌గా మీ కొడుకు పాత్ర ఎలా ఉంది...

విజయేంద్రప్రసాద్‌: కొడుకును పొగడకూడదు. అయితే ఏదైనా మనం ఓ సీన్‌ చెబుతున్నపుడు కంటిముందు దృశ్యం కనిపిస్తుంటుంది. కథ చెప్పింది చెప్పినట్లే దృశ్యకావ్యంలా తెరకెక్కిస్తాడు రాజమౌళి.


ఆర్కే: అసలు మీ నేపథ్యం ఏంటీ?

విజయేంద్రప్రసాద్‌: మానాన్న గారు కాంట్రాక్టర్‌. ధనవంతులు. మా నాన్న గారు 1950 సంవత్సరంలోనే తన సంపాదనకు ఏటా లక్షరూపాయలు ఇన్‌కం టాక్స్‌ కట్టేవారు. మేం ఆరుగురం అన్నదమ్ములం. ఒక అక్కయ్య. చాలా సి్ట్రక్ట్‌. నిబద్ధతగల మనిషి. ఓసారి గవర్నమెంట్‌కు టాక్స్‌ కట్టేయకుండా తప్పించుకోవచ్చు అని ఓ ఆడిటర్‌ మా నాన్నకు సలహా ఇస్తే.. అది పద్ధతి కాదన్నారు. ధర్మం ఉండే మనిషి. ఐ ఫీల్‌ సో ప్రౌడ్‌. నేను ఆ ఫీల్డ్‌కి వెళ్లలేదు. కీరవాణి తండ్రి శివశక్తి గారికి పెయింటిగ్‌, కవిత్వం, ఆర్ట్‌ అన్నీ ఇష్టం. ఆయన సినిమాలకు డైరెక్ట్‌ చేయాలని మేం కోరుకునేవాళ్లం. రాయచూర్‌వెళ్లి పొలాలు కొనుక్కొని వ్యవసాయం చేతకాక సక్సె్‌సఫుల్‌గా పొలాలు అమ్మి, చెన్నైకి వెళ్లి సినిమాలతో ఆస్తంతా పొగొట్టుకున్నాం. ఉమ్మడి కుటుంబం మాది. ఎట్లాంటి స్టేజ్‌కు వచ్చామంటే కేజీ బియ్యం కొనాలంటే డబ్బులేక ఆలోచించేవాళ్లం.

బాహుబలి గురించి బూతులు మాట్లాడుకున్నారు...

ఆర్కే: ఎలా రచయితగా అవకాశం వచ్చింది

విజయేంద్రప్రసాద్‌: ముఖర్జీగారు రాఘవేంద్రరావు గారికి మా అన్నయ్యను పరిచయం చేశారు. రాఘవేంద్రరావు గారి దగ్గరకు అన్నయ్యతో పాటు నేను వెళ్లేవాన్ని. ‘జానకిరాముడు’ సినిమాకు మాతో కథ రాయించారు. ఓ రోజు పిలిచి ‘మూగమనసులు కథ కావాలి కానీ మూగమనసుల్లా ఉండకూడదు అన్నారు’ రాఘవేంద్రరావు గారు. అలా నా ప్రస్థానం మొదలైంది.


ఆర్కే: అంతేగాని పర్టికులర్‌గా ఈ బాధ్యత తీసుకుందామని రావట్లేదన్న మాట..

విజయేంద్రప్రసాద్‌: లేదు. అవుటాఫ్‌ నెసెసిటీ.. అవసరం నేర్పింది. కథ రాయటమంటే అబద్ధం చెప్పగలగాలి. సీరియస్‌గా చెప్పే అబద్దాలన్నీ నిజాలుగా ఉండాలి. అందమైన అబద్ధాలు అన్న మాట. ఇక నేను నవలలు బాగా చదివేవాన్ని. అవసరం నేర్పింది. మా అన్నయ్య దగ్గర్నుంచి చాలా నేర్చుకున్నా. ‘షోలే’ చిత్రం ఎన్ని సార్లు చూశానో లెక్కేలేదు. చూసిన ప్రతి సారి కొత్త అర్థాలు కనిపించేవి. ఏదైనా కథ రాయాలంటే దేవుని ప్రార్థన ఎలా చేస్తామో అలా ‘షోలే’ చూసి పని చేస్తానండి. మనసు చార్జ్‌ అవుతుంది. కొత్త ఐడియాలు వస్తాయి.


ఆర్కే: మీ ఫ్యామిలీలో ఫైర్‌ ఉంటుంది. ఎందుకలా

విజయేంద్రప్రసాద్‌: నేను చేసేపనిని ప్రేమిస్తాను. నిజాయితీగా చెప్పాలంటే డబ్బు మీద మోజుండదు. కథలు రాయడంలో నాకు హ్యాపీనెస్‌ ఉంటుంది. కథ రాశాక డబ్బులు ఎందుకు ఇస్తున్నారూ అనుకుంటా (నవ్వులు). పనిచేస్తే డబ్బు, కీర్తి బోనస్‌ అనుకుంటా. రాజమౌళిది నా మెంటాలిటీనే.


ఆర్కే: దర్శకుడిగా రాజమౌళి గ్రాఫ్‌ పైకెళ్తూనే ఉంది. మరి దర్శకుడిగా మీరెందుకు సక్సెస్‌ కాలేదు.

విజయేంద్రప్రసాద్‌: నాకు తెలీదు. ప్రస్తుతం కొత్తవాళ్లతో ఓ సినిమా డైరక్షన్‌ చేస్తున్నా. తెలుగులో థ్రిల్లర్‌ సినిమా చేస్తున్నా.ఆర్కే: బాహుబలి పాత్ర నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ దగ్గర ఉన్న క్యారెక్టర్‌ అన్నారు?

విజయేంద్రప్రసాద్‌: అదేం కాదు. కథ అనుకున్నపుడు పేరు పెట్టమన్నారు. తెలుగు, తమిళంలో సినిమా చేసి హిందీలో డబ్‌ చేద్దామనుకున్నాం. కర్ణాటకలో గోమటేశ్వరాన్ని ‘బాహుబలి’ అంటారు.


 దానికి కథకు సంబంధం లేదు. మా కథ ప్రభా్‌సకు యాప్ట్‌గా ఉంటుందని అనుకున్నాం. గొప్పగా ఉంటుందని ఇలా పేరుపెట్టాం. ఇక అనుకున్న కథకు డ్రామా క్రియేట్‌ చేసి రాస్తుంటే పెద్ద కథ అయింది. కుదిద్దామంటే రసాలు, ఘట్టాలు పోతున్నాయి. అందుకే రెండు పార్టులు చేద్దామనుకున్నాం.

బాహుబలి గురించి బూతులు మాట్లాడుకున్నారు...

ఆర్కే: చిత్రమైన భాష ఎవరు పెట్టారు.

విజయేంద్రప్రసాద్‌: తమిళ రచయిత మదన్‌కార్తీ ఈ భాష సృష్టించారు. ఎలా మాట్లాడాలో కూడా చెప్పారు.


ఆర్కే: ‘బాహుబలి’ తర్వాత అంతకంటే పెద్ద చిత్రాలు చేస్తారా?

విజయేంద్రప్రసాద్‌: తెలుగు, తమిళ హీరోలను తీసుకుని ‘మిస్సమ్మ’, ‘గుండమ్మకథ’ లాంటి సినిమాలు చేస్తాం.


ఆర్కే: తెలుగు ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ నిషేధం ఎందుకు పెట్టింది?

విజయేంద్రప్రసాద్‌: దున్నపోతు ఈనింది. దూడను విజయేంద్రప్రసాద్‌ దొంగతనం చేశాడని ఒకాయన కేసు పెట్టాడు. వాళ్లు యాక్షన్‌ తీసుకున్నారు. రాజమౌళిపై కోపంతోనే అలా చేశారు.


ఆర్కే: ఒకస్థాయి తరువాత దర్శకులు, రచయితలు రిటైర్‌ అయిపోతారు కదా? మీ విషయంలో మాత్రం వయసు పెరిగే కొద్దీ షార్ప్‌నెస్‌ పెరుగుతోంది. ఎలా?

విజయేంద్రప్రసాద్‌: ఒక జేబు దొంగను తీసుకుంటే వాడి దృష్టంతా జేబుపైనే ఉంటుంది. జేబు ఎత్తుగా ఉందా? ఎలా అయితే జేబులో నుంచి డబ్బులు కొట్టేయవచ్చు? వాడి ఆలోచనలన్నీ ఇలా ఉంటాయి. ఆ వ్యక్తి ముఖంతో వాడికి పనిలేదు. నేనూ అంతే... మీతో ఇప్పుడు మాట్లాడుతున్నా నా ఆలోచనంతా వీటిలో ఏ అంశమైనా సినిమాలోకి పనికొస్తుందా? అని ఆలోచిస్తుంటాను.

 

ఓ పక్క ఆ ఆలోచన నడుస్తూనే ఉంటుంది. రాధాకృష్ణ గారిని సినిమాలో స్పెషల్‌ అప్పియరెన్స్‌గా పెడితే మంచి కిక్కు వస్తుంది కదా? బాగానే క్లిక్‌ అవుతుంది కదా అని ఇప్పుడు ఆలోచిస్తున్నాను. సక్సెస్‌ సూత్రం చాలా సింపుల్‌. మన బేషజాన్ని, తెలివితేటలను తుంగలో తొక్కి నేల టికెట్‌ కొని చూసే వారిని దృష్టిలో పెట్టుకోవాలి. సగటు ప్రేక్షకునిలా ఆలోచించే వారెవరైనా కథలు రాయొచ్చు. నేను అలాగే రాస్తాను.


ఆర్కే: మీలోని టాలెంట్‌ని ముందుగా ఎవరు గుర్తించారు?

విజయేంద్రప్రసాద్‌: కైకాల నాగేశ్వరరావుగారు... ఆయన స్వయంగా నన్ను పిలిచి కథ రాయమన్నారు. మూడు కథలు రాశాను. అందులో ఒక కథ బంగారు కుటుంబం. ఆయనే తీశారు.


ఆర్కే: రాజమౌళిని డైరెక్షన్‌లో పెట్టాలనే ఆలోచన ఎవరిది?

విజయేంద్రప్రసాద్‌: మద్రాసులో నేను కిందా మీద పడుతున్నప్పుడు రాజమౌళి ఇంటర్‌ పూర్తయింది. ఆ తరువాత పై చదువులు చదవించే స్తోమత లేకపోయింది. దాంతో ఏం చేస్తావని అడిగాను. డైరెక్షన్‌ డిపార్టుమెంట్‌లోకి వెళతానన్నాడు. ఓనమాలు రాని వారిని పెట్టుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడరు. కాబట్టి ముందుగా ఎడిటింగ్‌, లైటింగ్‌, మ్యూజిక్‌... ఇవి నేర్చుకో. తరువాత డైరెక్టర్‌ దగ్గరకు వెళ్లు అన్నాను. అలా చెప్పిముందుగా చంటి గారి దగ్గర అసిస్టెంట్‌గా పెట్టాను. తరువాత క్రాంతికుమార్‌ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశాడు. కొన్నేళ్లు నాదగ్గర స్టోరీ డిపార్టుమెంట్‌లో పనిచేశాడు.


ఆర్కే: జీవితంలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూసిన వ్యక్తిగా యంగర్‌ జనరేషన్‌కు మీరు ఎలాంటి సలహా ఇస్తారు?

విజయేంద్రప్రసాద్‌: బీ సిన్సియర్‌ టు యువర్‌సెల్ఫ్‌. హానె్‌స్టగా ఉండండి. ఏ వ్యక్తి అంతరాత్మ చెప్పినట్టు నడుచుకోలేడు. కానీ కొంతవరకైనా ప్రయత్నం చేస్తే చాలు.


ఆర్కే: మీకు పేర్ల ముందు ఇంటి పేరు ఉండదు. యం.యం., ఎస్‌.ఎస్‌ అని ఉంటుంది. వాటి అర్థం ఏంటి?

విజయేంద్రప్రసాద్‌: వ్యక్తిగత కారణాల వల్ల ఇంటి పేరును వదిలేశాం. శ్రీలేఖ వాళ్ల నాన్నగారు స్పిరిచువల్‌ గురు. ఆయన ఈ పేర్లు పెట్టారు.


ఆర్కే: మీకు ఇన్‌స్పిరేషన్‌ ఎవరు?

విజయేంద్రప్రసాద్‌: బిఎ్‌సప్రసాద్‌ గారని వైజాగ్‌లో ఉంటారు. ఆయనను చూసి చాలా ఇన్‌స్పైర్‌ అయ్యాను. ఆ తరువాత వ్యక్తి మా అబ్బాయి. తన వ్యక్తిత్వం నాపైన ప్రభావం చూపింది. బాహుబలి షూటింగ్‌ మూడేళ్లు జరిగింది. ఒకరోజు రాజమౌళి ‘ఈ సినిమా ఎందుకు తీస్తున్నానో తెలుసా’ అన్నాడు. ‘నీకిష్టం కాబట్టి’ అన్నాను. అప్పుడేమన్నాడో తెలుసా? ‘మహాభారతం తెరకెక్కించాలన్నది నా ఆశయం, దానికి ముందు ఈ సినిమా ట్రయల్‌. ఇది సక్సెస్‌ అయితే అది కూడా సక్సెస్‌ అవుతుంది’ అని అన్నాడు. అది నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. ఒకరోజు సుద్దాల ఆశోక్‌తేజ గారు వాళ్లనాన్న సుద్దాల హనుమంతు పోరాటం గురించి చెప్పాడు.

 

ఒక పాట ఎలా స్ఫూర్తిని నింపిందో చెబితే నాకు ఎంతో ఆశ్చర్యమనిపించింది. ‘రాజన్న’ సినిమాకు అది బీజం. తెలంగాణలో ఎన్నో పోరాటకథలున్నాయి. వాటిని తెరకెక్కిస్తే అద్భుతంగా ఉంటుందనిపిస్తుంది. తెలంగాణలో సోషల్‌ స్టేట్‌స్‌ను చూడరు. ఆంధ్రాలో వెళితే ఏం చేస్తావు బాబు? నాన్న గారు ఏం చేస్తారు? అంటూ సోషల్‌ స్టేటస్‌ కనుక్కుంటారు. అదే తెలంగాణలో పలకరిస్తే బాబూ చాయ్‌ తాగుతావా? అన్నం తింటావా? అని అడుగుతారు. ఎదుటి వాని సోషల్‌స్టేటస్‌ గురించి పట్టించుకోరు. అది కూడా బాగా నచ్చుతుంది. ‘రాజన్న’తో పూర్తిగా తృప్తి రాలేదు. ఎవరైనా ముందుకొస్తే, దేవుడు ఆశీర్వదిస్తే తప్పకుండా తీస్తాను.


ఆర్కే: రాజమౌళి తీసిన సినిమాలన్నింటికి కథలన్నీ మీరిచ్చినవేనా?

విజయేంద్రప్రసాద్‌: లేదు. ‘స్టూడెంట్‌నెం1’ పృథ్వీ అనే రైటర్‌ ఇచ్చారు. మర్యాదరామన్న స్టోరీని అవర్‌ హోస్టేజ్‌ అనే బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమా ఆధారంగా వర ముళ్లపూడి డెవలప్‌ చేశాడు. మిగతా సినిమా కథలన్నీ నావే.


ఆర్కే: 73 ఏళ్ల వయసులో కూడా కుర్రాడిలా ఆలోచిస్తున్నారు. రాజమౌళి తీయబోయే సినిమాలన్నింటికి కథలు మీరే ఇస్తారా?

విజయేంద్రప్రసాద్‌: నా మెంటల్‌ ఏజ్‌ చెప్పమంటారా? నేల మీద కూర్చోవాలని ఉంటుంది. మెంటల్‌గా నేను థర్టీ్‌స్‌లో ఉన్నాను.


ఆర్కే: రాజమౌళిలో ఏం నచ్చింది?

విజయేంద్రప్రసాద్‌: ప్రొఫెషనల్‌ కమిట్‌మెంట్‌, శ్రద్ధ, ఎవ్వరినీ నొప్పించకపోవడం, తను నష్టపోయినా పర్వాలేదు, ఇతరులు నష్టపోకుండా చూడటం వంటివన్నీ రాజమౌళిలో ఉన్నాయి.


ఆర్కే: తీపి జ్ఞాపకాలు ఏమున్నాయి?

విజయేంద్రప్రసాద్‌: పిల్లల సక్సెస్‌.. రాజమౌళి సక్సెస్‌, శ్రీలేఖ సక్సె్‌స...వాళ్ల సక్సెస్‌ ఆనందాన్నిస్తుంది.


ఆర్కే: రాజమౌళి ‘మహాభారతం’ తీసి, మీరు ‘తెలంగాణ చరిత్ర’ తీసి విజయం సాధించాలని కోరుకుంటూ థాంక్యూ వెరీ మచ్‌.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

సినీ ప్రముఖులుLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.